రైతులకు గుడ్‌న్యూస్‌.. పొలాల్లో కార్బన్‌ పెంచితే ఇక నగదు ప్రోత్సాహకం! | Farmers Get Cash For Increasing Soil Carbon Regenerative Farming | Sakshi
Sakshi News home page

రైతులకు గుడ్‌న్యూస్‌.. పొలాల్లో కార్బన్‌ పెంచితే ఇక నగదు ప్రోత్సాహకం!

Sep 18 2026 9:24 AM | Updated on Sep 18 2026 9:24 AM

Farmers Get Cash For Increasing Soil Carbon Regenerative Farming

వరి నాట్లకు బదులు వెద పద్ధతిలో సాగు, గడ్డి మోళ్లను తగులబెట్టకుండా ఉండటం వంటి పద్ధతులు పాటించిన రైతులకు ఆర్థిక ప్రోత్సాహం

పంజాబ్, హర్యానాలోని 2,500 మందికి పైగా రైతులకు రూ. 2.9 కోట్లకు పైగా పంపిణీ

‘మట్టి కర్బన క్రెడిట్ల’కు నగదు చెల్లింపులు దేశంలో ఇదే ప్రథమం

‘మట్టి కర్బన’ చెల్లింపులు!

పొలాల్లోని మట్టిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించే పునరుజ్జీవ వ్యవసాయ పద్ధతులను స్థిరంగా అనుసరిస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహక చెల్లింపులు ఇవ్వటం మన దేశంలో ప్రారంభమైంది. ఈ ‘వ్యవసాయ కార్బన్‌ మార్కెట్‌’ విధాన దశ నుంచి ప్రస్తుతం క్షేత్రస్థాయికి చేరింది. పంజాబ్, హర్యానాలలో పునరుత్పాదక (రీజెనరేటివ్‌) వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న 2,500 మందికి పైగా చిన్న రైతులు డిజిటల్‌ చెల్లింపులను అందుకుంటున్నారు.

లుధియానాలోని పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మొదటి చెల్లింపులు విడుదలయ్యాయి. సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించే రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూర్చే ఒక కొత్త వ్యవస్థకు ఇది శుభారంభం. పంజాబ్, హర్యానాలకు చెందిన 2,550 మంది రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీని కేంద్ర వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ కార్యదర్శి, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎం.ఎల్‌. జాట్‌ ప్రారంభించారు.

ఏడేళ్ల క్రితం ‘ఆది’కి శ్రీకారం
ఐసీఏఆర్‌ సాంకేతిక మార్గదర్శకత్వంతో 2019లో ‘గ్రో ఇండిగో’ రైతు కార్బన్‌ కార్యక్రమమైన ‘ఆది’ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కింద 2019– 2022 మధ్య రైతులు నేరుగా విత్తే వరి (డైరెక్ట్‌ సీడెడ్‌ రైస్‌–డీఎస్‌ఆర్‌), మితంగా దుక్కి, పంట అవశేషాలను తగులబెట్టకుండా భూమిలో కలిపెయ్యటం వంటి పద్ధతులను అవలంబించారు. దీని ఫలితంగా తగ్గిన గ్రీన్‌ హౌస్‌ వాయువులు, నేలలో పెరిగిన సేంద్రియ కర్బనాన్ని కొలిచి, కార్బన్‌ క్రెడిట్‌లను జారీ చేయడానికి ముందు స్వతంత్రంగా ధృవీకరించారు. ఈ కార్యక్రమం ఏడు రాష్ట్రాలలో రెండు మిలియన్లకు పైగా ఎకరాలను, లక్షకు పైగా రైతులను కవర్‌ చేస్తుంది. వెర్రా వీఎం0042 పద్ధతి ప్రకారం వ్యవసాయ కార్బన్‌ క్రెడిట్‌లను జారీ చేసింది.

గ్రీన్‌ హౌస్‌ వాయువుల గణన, పంట అనుకరణ నమూనాలు, నేల నమూనా సేకరణ పద్ధతులు, పరికరాల ధ్రువీకరణ, క్షేత్రస్థాయి బృందాలకు శిక్షణ, ఉపగ్రహ, రిమోట్‌ సెన్సింగ్‌ విధానాలు వంటి రంగాల్లో ఐసీఏఆర్‌ సంస్థలు తమ శాస్త్రీయ, క్షేత్రస్థాయి నైపుణ్యాన్ని అందించాయి. న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) ఈ ప్రక్రియలకు తోడ్పడగా, పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి గ్రో ఇండిగో కూడా ఐసీఏఆర్‌–అటారి, జోన్‌ 1తో కలిసి పనిచేస్తోంది.

ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎంఎల్‌ జాట్‌ మాట్లాడుతూ, శాస్త్రీయ అంచనాచ కఠినమైన ధృవీకరణతో కూడిన వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు నీటి సంరక్షణకు, మెరుగైన గాలి నాణ్యతకు దోహదపడుతూనే, చిన్న రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను ఎలా కల్పించగలవో ఈ కార్యక్రమం నిరూపిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐసీఏఆర్‌ సంస్థలు అందించిన సహకారాన్ని ప్రశంసించారు.

పంట దిగుబడులనే కాక పర్యావరణ ప్రయోజనాలను కూడా అందించగల వ్యవసాయ పద్ధతులకు కార్బన్‌ చెల్లింపులు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తాయి. సాంప్రదాయంగా దమ్ము చేసి నాట్లు వేయటంతో ΄ోలిస్తే నేరుగా విత్తే వరి నీటిపారుదల అవసరాలను తగ్గించగలదు. అదే సమయంలో మెరుగైన పంట అవశేషాల నిర్వహణ గడ్డి కాల్చడం, దానితో సంబంధం ఉన్న వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 2019–2022 మధ్య నమోదు చేసుకున్న పొలాల ద్వారా 4500 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది. రెండు లక్షల టన్నులకు పైగా పంట అవశేషాలను కాల్చకుండా వినియోగిస్తారు. దీనివల్ల సుమారు 1,000 టన్నుల పీఎం 2.5 వాయు కాలుష్య ఉద్గారాల నివారణ జరిగిందని అంచనా.

పొలాల ద్వారా ఉత్పత్తి అయిన కార్బన్‌ క్రెడిట్లలో రైతుల వాటా ప్రకారం వారికి చెల్లింపులు జరిగాయి. క్రెడిట్లు పూర్తిగా అమ్ముడు΄ోకముందే గ్రో ఇండిగో తన సొంత నిధుల నుండి డిజిటల్‌గా చెల్లింపులు చేసింది. మొదటి విడతలో సుమారు 30,000 ఎకరాలకు గాను 50,000కు పైగా కార్బన్‌ క్రెడిట్లకు చెల్లింపులు జరిగాయి. ఇందులో పాల్గొన్న రైతులు సుమారుగా రూ. 3,000 నుంచి రూ. 15,000ల వరకు అందుకున్నారు.

అనేక సంవత్సరాల పాటు సేంద్రియ కర్బనం, కాలుష్య స్థాయిల కొలత, స్వతంత్ర ధృవీకరణ ప్రక్రియ తర్వాత ఈ చెల్లింపులు జరిగాయి. 2022 తర్వాత ఈ కార్యక్రమంలో చేరిన రైతులు వారి కార్బన్‌ క్రెడిట్‌లు జారీ అయినప్పుడు చెల్లింపులను అందుకుంటారు.

గ్రో ఇండిగో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఉషా బర్వాలే జెహర్‌ మాట్లాడుతూ రైతుల పొలాల్లోని మట్టిలో నిల్వ ఉన్న సేంద్రియ కర్బనానికి దేశంలోనే మొదటిసారిగా డబ్బు చెల్లించామన్నారు. శాస్త్రీయ మదింపు, ధృవీకరణ ప్రక్రియలో రైతులు చూపిన నమ్మకాన్ని, సహనాన్ని ఆమె అభినందించారు. చెల్లింపులు అందుకున్న లుధియానాలోని నూర్‌పూర్‌ బెట్‌కు చెందిన రైతు హరిందర్‌జీత్‌ గిల్, సంగ్రూర్‌కు చెందిన అమన్‌ దీప్‌ కౌర్‌ కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. పునరుజ్జీవ వ్యవసాయ పద్ధతులను కొనసాగించటం, పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండటం వల్ల కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను వారు ప్రముఖంగా ప్రస్తావించారు.

లుధియానా కార్యక్రమం మన దేశ వ్యవసాయంలో వస్తున్న గుణాత్మక మార్పుకు సంబంధించిన మూడు పరస్పర సంబంధిత అంశాలను ఎత్తిచూపుతోంది. రైతు కేంద్రీకృత, క్షేత్రస్థాయి వ్యవసాయ పరిశోధన, ఐసీఏఆర్‌ పరిశోధనా సంస్థలు, అటారీలు, కేవీకేల ద్వారా అనుసరించే ‘ల్యాబ్‌–టు–ల్యాండ్‌’ విధానం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను పంచుకోవటానికి, విస్తరించటానికి అందించే అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

పునరుజ్జీవ వ్యవసాయంపై శాస్త్రీయంగా లెక్కించిన పర్యావరణ ఫలితాలను, రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో ఎలా అనుసంధానించవచ్చో.. అదే సమయంలో వనరుల పరిరక్షణ, వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోవటం ద్వారా సుస్థిర వ్యవసాయ ఉత్పత్తికి ఎలా దోహదపడవచ్చో మన దేశంలో రైతులకు అందించిన ఈ మొదటి మట్టి–కార్బన్‌ చెల్లింపుల వ్యవహారం నిరూపిస్తోంది.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇదీ చదవండి: 12 ఏళ్లకోసారి ప్రకృతిలో అద్భుత దృశ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement