ప్చ్.. మళ్లీపోయింది! | Power Cuts In Chandrababu Naidu Govt | Sakshi
Sakshi News home page

ప్చ్.. మళ్లీపోయింది!

Sep 17 2026 9:42 AM | Updated on Sep 17 2026 9:46 AM

Power Cuts In Chandrababu Naidu Govt

ఇష్టానుసారం విద్యుత్‌  కోతలతో పల్లెలు, పట్టణాల్లో అల్లాడుతున్న ప్రజలు  

సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకూ సరఫరా నిలిపివేత

విద్యుత్‌ ఉపకరణాలను పగలే వాడుకోవాలని కోరుతున్న డిస్కంలు 

వ్యవసాయానికి ‘విడతల వారీగా’ 5 నుంచి 7 గంటలే సరఫరా 

దీంతో పలుచోట్ల సబ్‌స్టేషన్లను ముట్టడించే పరిస్థితి తలెత్తుతున్న వైనం  

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కోతలతో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జనం అల్లాడుతున్నారు. వేసవిని తలపిస్తూ విద్యుత్‌ కోతల తీవ్రత పెరుగుతున్నట్లు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్య పలు ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు సరఫరాలు నిలిపివేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం (సెప్టెంబర్ 15న) విద్యుత్‌ డిమాండ్‌ 264.521 మిలియన్‌ యూనిట్లకు (ఎంయూ) చేరగా, అధికారిక లెక్కల్లోనే 7.03 ఎంయూల లోడ్‌ రిలీఫ్‌ (విద్యుత్‌ కోత) నమోదైంది. 

వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోవాల్సిన దుస్థితి వచ్చింది.  విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా అందించలేకపోతున్న ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు విద్యుత్‌ పొదుపు పాటించాల్సిందిగా విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులకు పలు విజ్ఞప్తులు చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే అధికారిక గణాంకాల్లో మాత్రం మొత్తం డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నట్లు చూపుతుండడం... క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉండడం గమనిస్తున్న ప్రజలు,  ప్రభుత్వ వైఖరితో మరింత అసహనానికి గురవుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లను సైతం ముట్టడించే పరిస్థితి ఏర్పడింది.  

అన్నదాత ఆవేదన 
వ్యవసాయానికి రోజుకు 9 గంటల సరఫరా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో రోజుకు 5 నుంచి 7 గంటలు, ఇతర ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతోందని అన్నదాతలు చెబుతున్నారు. ఈ సరఫరాను కూడా రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. రాత్రివేళ రెండు గంటలు సరఫరా ఇవ్వడంతో చీకట్లో పొలాలకు వెళ్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీంతో ఆ సమయంలో కరెంటు ఇచ్చినా అది వృథా అవుతుందని అంటున్నారు. పగటి పూట ఇచ్చే కొద్ది గంటల సరఫరాతోనే పొలాన్ని తడుపుకుంటున్నారు. పగలు 
ఒకే విడతలో 9 గంటలు విద్యుత్‌ సరఫరా వ్యవసాయానికి అందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

రెండుమూడు రోజులకే బొగ్గు నిల్వలు 
థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అత్యంత దారుణంగా పడిపోయాయి. విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (వీటీపీఎస్‌)లో 2.87 రోజులకు, రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఆర్‌టీపీపీ)లో 2.56 రోజులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయి. ఈ థర్మల్‌ కేంద్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కృష్ణపట్నంలో 11.23 రోజులు, హిందూజాలో 5.99 రోజులు, సెయిల్‌లో 16.56 రోజులకు సరిపడా బొగ్గు ఉంది. కానీ ఇది ఏమాత్రం సరిపోదు. థర్మల్‌ కేంద్రాల్లో కనీసం 15 రోజుల నుంచి 30 రోజులకు సరిపడా బొగ్గు లేకపోతే ఉత్పత్తి చాలా కష్టం. 

ఏ కారణం చేతనైనా రోజువారీ బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడితే థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి ఒక్క సారిగా కుప్పకూలుతుంది. అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోళ్లు విద్యుత్‌ డిమాండ్‌కు తగిన ఉత్పత్తి రాష్ట్రంలో లేదు. పోనీ ముందస్తు ప్రణాళికలు ఏవైనా వేశారా అంటే అదీ లేదు. కాగితాల్లో తప్ప ఆచరణలో ఎలాంటి ప్లానింగ్‌ అమలు చేయకపోవడంతోపాటు పెరిగిన డిమాండ్‌ను తగ్గట్లు విద్యుత్‌ను సమకూర్చలేక రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది. బహిరంగ  మార్కెట్‌ నుంచి 40 ఎంయూల నుంచి 50 ఎంయూల వరకూ ప్రతి రోజూ విద్యుత్‌ కొనుగోలు చేస్తోంది. ఇందుకు మొత్తం రూ.28.415 కోట్లు నుంచి రూ.35 కోట్ల వరకూ ఖర్చవుతోంది. ఇందులో డే ఎహెడ్‌ మార్కెట్‌ ద్వారా 29.270 ఎంయూలను యూనిట్‌కు సగటున యూనిట్‌ రూ.5.774 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రియల్‌ టైమ్‌ మార్కెట్‌లో 6.960 ఎంయూలకు యూనిట్‌కు రూ.9.994 చొప్పున అత్యధిక ధర చెల్లిస్తున్నారు.

వాటిని వాడకండి: పృధ్వీతేజ్‌  
వాషింగ్‌ మెషిన్లు, ఐరన్‌ బాక్సులు, బ్యాటరీ చార్జింగ్‌లు వంటివి పగటిపూట మాత్రమే వాడుకుంటే గ్రిడ్‌పై భారం తగ్గుతుందంటూ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌ వీడియో బుధవారం సందేశాన్ని విడుదల చేశారు. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారులు అవసరం లేని మెషిన్లు, విద్యుత్‌ ఉపకరణాలు వినియోగం తగ్గించుకోవాల్సిందిగా ఆయన కోరారు.  

కొంచెం ఎక్కువే చెప్పండి: మంత్రి ఆదేశాలు 
విద్యుత్‌ కోతలపై ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలని, ఎంత సేపు విద్యుత్‌ కోత విధిస్తున్నామనే వివరాలను, ఆయా వేళలను ముందుగానే చెప్పాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ కోతలు, సమస్యలపై టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912 ద్వారా కాల్‌ సెంటర్‌కు అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని వాటన్నిటికీ సమాధానం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.

 విద్యుత్‌ సరఫరా ఎప్పుడు వస్తుందని వినియోగదారులు అడిగితే, అవసరమైతే కాస్త ఎక్కువ సమయమే చెప్పమని ఆయన అధికారులకు సూచించారు. విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. బొగ్గు నిల్వలపై దృష్టి సారిస్తున్నామని, బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతించామని మంత్రి చెప్పారు. ఏపీసీపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన విలేకరులకు రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై మంత్రి వివరణ ఇచ్చారు.  

ప్రజావ్యతిరేకత తీవ్రమవకుండా ‘చిట్కాలు’ 

  • విద్యుత్‌ శాఖ చెబుతున్నదాని కంటే ఎక్కువగానే రాష్ట్రంలో విద్యుత్‌ అవసరం ఉంది.  
  •  ఈ పరిస్థితుల్లో అనధికార విద్యుత్‌ కోతలు, నిర్వహణ పేరుతో వారంలో ఒకటి రెండు రోజులు వ్యవసాయానికి నిలిపివేయడం వంటి చర్యల ద్వారా డిమాండ్‌ను కంట్రోల్‌ చేస్తున్నారు.  
  • కోతలు అన్ని ప్రాంతాల్లో ఒకేసారి విధించడం లేదు. అలాగే ఒకేసారి ఎక్కువ సమయం కూడా 
    సరఫరా తీసేయడం లేదు.  
  • అలా చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కొద్ది కొద్ది సమయాలు, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో సరఫరా ఆపుతున్నారు.  
  • ఎవరైనా కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి అడిగితే నిర్వహణ, సాంకేతిక సమస్యలను సాకుగా చూపిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement