న్యూనత కాదు... న్యూ ట్రెండ్‌! | House Husbands Can Be A New Normal says Madras High C ourt | Sakshi
Sakshi News home page

న్యూనత కాదు... న్యూ ట్రెండ్‌!

Sep 29 2026 1:07 AM | Updated on Sep 29 2026 1:07 AM

House Husbands Can Be A New Normal says Madras High C ourt

హౌస్‌ హజ్బెండ్‌

భార్యను ‘హౌస్‌వైఫ్‌’ అని పరిచయం చేస్తారు. కాని ఆమె ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవడం వల్లే భర్త కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. అయితే, కాలం మారుతోంది. ఇప్పుడు భార్య సంపాదిస్తుంటే భర్త ఇంట్లో ఉండటం నామోషీగా  భావించాల్సిన పని లేదు. ‘భార్యాభర్తల ఎదుగుదలకు అవసరమైతే, పురుషులు కూడా హౌస్‌ హజ్బెండ్‌ గా మారాలి’ అంటూ మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఇటీవల ఒక కీలక వ్యాఖ్య చేసింది. ఊపందుకుంటున్నఈ సరికొత్త ధోరణిలోని ‘ప్లస్‌ – మైనస్‌’లపై ఒక ప్రత్యేక నజర్‌...

పెళ్లి కార్డు పంచుతున్నప్పుడో, ఆఫీస్‌ పార్టీలోనో భర్త తన భార్యను పరిచయం చేస్తూ ‘మా ఆవిడ హౌస్‌ వైఫ్‌’ అంటే ఎవరూ ఆశ్చర్య΄ోరు. కాని భార్య ‘మా ఆయన హౌస్‌ హజ్బెండ్‌’ అని చెబితే అక్కడ నిశ్శబ్దం, ఆ తర్వాత చిన్న నవ్వు, ఆ తర్వాత ‘నిజంగానా?’ అనే అనుమానం. ఈ అనుమానానికే ఇప్పుడు దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో ఒకటి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. హౌస్‌ హజ్బెండ్‌ జీవన సౌలభ్యమే అని సూచించింది.

కోర్టు ఏమందో తెలుసా?
సెప్టెంబర్‌ 23, 2026. మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఒక డాక్టర్‌ దంపతుల విడాకుల కేసును విచారిస్తూ ‘హౌస్‌ వైఫ్‌లు ఉన్నప్పుడు హౌస్‌ హజ్బెండ్లు ఎందుకు ఉండకూడదు? ఇది న్యూ నార్మల్‌ కావాలి. పెళ్లి అనే వ్యవస్థను కాపాడుకోవాలంటే హోమ్‌ మేకర్‌గా ఎవరున్నా తప్పు లేదు. హోమ్‌ మేకర్‌ అనేది జెండర్‌ లేని పదం’ అంది.

కేసు వెనుక కథ: 2011లో పెళ్లి చేసుకున్న ఇద్దరు డాక్టర్లు పుదుచ్చేరిలోని ఒక హాస్పిటల్‌లో ఉద్యోగం చేసేవారు. భర్త పైచదువులు చదవడానికి వెళితే, భార్య తన కెరీర్‌ను త్యాగం చేసి పుట్టింట్లో ఉంటూ ఇద్దరు పిల్లల్ని పెంచింది. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. భరణం విషయంలో భర్త అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ఆ సందర్భంలో హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ‘భార్య ఇంటి దగ్గర ఉండి చేసే సేవకు విలువ ఉంటుంది’ అంటూ ఆమెకు రూ.1.5 కోట్లు భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు ‘నేడు ఐటీ వంటి రంగాల్లో ఉన్న స్త్రీలు తమ కెరీర్‌కి పెళ్లిని ఒక అడ్డంకిగా చూస్తున్నారు దీనికి పరిష్కారం భర్తలు కూడా ఇంటి బాధ్యత పంచుకోవడమే’ అని కూడా అంది.

ఎందుకు ఇప్పుడు ఈ చర్చ?
ఒకప్పుడు భార్య ఇంట్లో ఉండటం ఆర్థిక అవసరం. ఇప్పుడు భార్య బయటకు వెళ్లడం ఆర్థిక అవసరం. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఐటీలో 35 శాతం ఉద్యోగులు మహిళలే. వారిలో చాలామంది భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అప్పుడు ప్రశ్న– ఇద్దరూ సంపాదిస్తే పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇద్దరిలో ఒకరి కెరీర్‌ ఆగాల్సిందే. అయితే ఎప్పుడూ ఆమె కెరీరే ఎందుకు ఆగాలి? ఆమె కెరీర్‌ దూసుకు΄ోతుంటే అతను వెనక్కి తగ్గితే తప్పేంటి?

ఈ మార్పు వల్ల లాభాలేంటి?
→ తండ్రి అంటే కేవలం ఏటీఎం కాదు, ఆదివారం పార్క్‌కు తీసుకెళ్లే వ్యక్తి మాత్రమే కాదు. రోజూ హోమ్‌ వర్క్‌ చేయించే, జ్వరం వస్తే రాత్రంతా కూర్చునే వ్యక్తి అనే భావన పిల్లల్లో మానసిక భద్రతను పెంచుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు 
→ వంట, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం వెనుక ఎంత శ్రమ ఉందో స్వయంగా చేస్తేనే తెలుస్తుంది. ఆ శ్రమ తెలిసిన మగవాడు భార్యను, తల్లిని, సమాజంలోని ప్రతి స్త్రీని గౌరవిస్తాడు ∙ ‘నువ్వు వెళ్లు, ఇల్లు నేను చూసుకుంటా’ అని భర్త అన్నప్పుడు భార్యకు వచ్చే ధైర్యం, ఆమె కెరీర్‌లో 10 రెట్లు వేగంగా ఎదగడానికి కారణం అవుతుంది. ఇది త్యాగం కాదు, ఇన్వెస్ట్‌మెంట్‌.

నష్టాలు ఉన్నాయా?
అయితే ఈ దారి గులాబీల బాట కాదు, ముళ్ల కంచె అని ఒప్పుకోవాలి ∙మన పితృస్వామ్య సమాజం ఇంట్లో ఉండే మగవాడిని అంత తేలిగ్గా ఒప్పుకోదు. ‘ఆడదాని సంపాదన తింటున్నాడు’, ‘భార్య చేతిలో కీలుబొమ్మ’ అంటూ చుట్టుపక్కల వాళ్లు, బంధువులే గాయాలు చేస్తారు ∙ఎంత మోడరన్‌ అని చెప్పుకున్నా పురుషుడి లోపలి అహం దెబ్బతింటుంది. తన సొంత ఖర్చులకు కూడా భార్యను అడగాల్సిన పరిస్థితి, స్నేహితుల ముందు తన ఉద్యోగం గురించి చెప్పుకోలేని ఇబ్బంది అతడిని నెమ్మదిగా డిప్రెషన్‌లోకి నెట్టే ప్రమాదం ఉంది ∙తాను సంపాదిస్తున్నందువల్ల భార్యలో అహం వస్తే? ఇంట్లో ఉండే భర్తను చులకనగా చూస్తే?  ఈ ప్రశ్నలు భయపెడతాయి.

మరి పరిష్కారం ఏంటి?
పరిష్కారం నాలుగు గోడల మధ్యే ఉంది. సమాజం మన ఇంట్లోకి వచ్చి వండిపెట్టదు, మన పిల్లల్ని పెంచదు. తమకు ఏది మంచో భార్యాభర్తలే నిర్ణయించుకోవాలి. భర్త ‘హౌస్‌ హజ్బెండ్‌’గా ఉండాలనుకుంటే అది భార్యాభర్తలు ఇద్దరూ కూచుని చేసుకోవాల్సిన ఒప్పందం. సంపాదన కేవలం వనరు మాత్రమేననీ అధికారం కాదనీ, ఇంటి పని సహాయం కాదు బాధ్యత అనీ, ఇద్దరికీ పర్సనల్‌ స్పేస్, పర్సనల్‌ ఖర్చులకు స్వేచ్ఛ ఉండాలి అనీ చెప్పుకుని ఆ మాటలు గౌరవించాలి. ఈ నిర్ణయం తాత్కాలికమా, శాశ్వతమా అనే క్లారిటీ ఉండాలి.

కోర్టు చెప్పినట్టు హోమ్‌మేకర్‌ అనేది జెండర్‌ లేని పదం. మగతనం అనేది బయట సంపాదించడంలోనే కాదు, ఇంటిని నిలబెట్టడంలో కూడా ఉంటుంది. భార్య సక్సెస్‌లో భాగస్వామి కావడమే ఇప్పటి నిజమైన మగతనం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement