పుల్ల మజ్జిగతో మొక్కలకు భలే లాభాలు.. కానీ ఈ తప్పు చేయొద్దు! | Sour Buttermilk Asafoetida For Terrace Garden Plants | Sakshi
Sakshi News home page

పుల్ల మజ్జిగతో మొక్కలకు భలే లాభాలు.. కానీ ఈ తప్పు చేయొద్దు!

Sep 25 2026 9:41 AM | Updated on Sep 25 2026 9:44 AM

Sour Buttermilk Asafoetida For Terrace Garden Plants

సాగుబడి

పుల్ల మజ్జిగ

ఇంటి పంట 20

మిద్దెతోటలు, పెరటి తోటల్లో పుల్ల మజ్జిగ లేదా పుసిసిన పెరుగును ఉపయోగించడం అనేది ఒక అద్భుతమైన, చౌకైన, ప్రకృతిసిద్ధమైన పద్ధతి. ఇది మొక్కల ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయపడుతుంది.

1. పుల్ల మజ్జిగలో ఉండే లాక్టిక్‌ యాసిడ్, మొక్కలకు వచ్చే బూజు తెగులు లేదా బూడిద తెగులు (΄ûడరీ మిల్డ్యూ) వంటి తెగుళ్లను, ఆకుమచ్చ తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది.
2. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి మొక్కల పెరుగుదలకు, పూత/కాయ పెరగడానికి సహాయపడతాయి.
3. మజ్జిగలోని మంచి బాక్టీరియా మట్టిలోని సూక్ష్మజీవులను పెంచి, మట్టిని గుల్లగా మార్చి, వేర్లు బాగా పెరిగేలా చేస్తుంది.
4. మజ్జిగ స్ప్రే చేయడం వల్ల తెల్ల దోమ, అఫిడ్స్, పిండి నల్లి (మిల్లీబగ్స్‌) వంటి చిన్న కీటకాల ఉధృతి తగ్గుతుంది.
5. మిరప, టమోటా, వంగ వంటి కూరగాయ మొక్కలకు 10–15 రోజులకొకసారి ఇస్తే, పూత రాలకుండా ఉండి, కాయలు బాగా కాస్తాయి.

6. ఒక  లీటరు పుల్ల మజ్జిగకు 10–20 లీటర్ల నీరు కలిపి, ఆకులపైన, కింద స్ప్రే చేయాలి.
6. ఒక లీటరు మజ్జిగకు 10 లీటర్ల నీరు కలిపి, మొక్క మొదళ్లలో (కుండీలలో) పోయాలి. 
7. కనీసం 5–7 రోజుల పాటు బయట ఉంచిన పుల్లటి మజ్జిగను వాడితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
8. కరివేపాకు, నిమ్మ, మిరప, వంకాయ, టమోటా, రోజా మొక్కలకు ఇది చాలా మంచిది. చిన్న మొక్కలకు  చాలా పల్చగా చేసి వాడాలి.

9. పుల్ల మజ్జిగకు ఇంగువ కలపడం వల్ల తోట రక్షణలో దాని శక్తి రెట్టింపు అవుతుంది. ఈ మిశ్రమాన్ని వ్యవసాయంలో ఒక శక్తివంతమైన సహజ కీటకనాశినిగా, తెగుళ్ల నాశినిగా ఉపయోగిస్తారు. 
10. టమోటా, మిరప, వంకాయ మొక్కలకు వచ్చే ముడత తెగులు నివారణకు ఇది రామబాణంలా పనిచేస్తుంది. ఇంగువలోని యాంటీ–వైరల్‌ గుణాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటాయి.

11. మజ్జిగ, ఇంగువలను కలిపి వాడితే బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, వేరు కుళ్ళు  వంటి ప్రమాదకరమైన ఫంగస్‌ సమస్యలు చాలా వేగంగా తగ్గుతాయి.
12. ఇంగువకు ఉండే ఘాటైన వాసన వల్ల మొక్కలను ఆశించే తెల్లదోమ, పేనుబంక, నల్లి, రసం పీల్చే పురుగులు మొక్కల దరిచేరవు. పెరటి తోటల్లో ఇంగువ వాసనకు పక్షులు, ఉడుతలు, కోతులు మొక్కలను పాడుచేయడానికి అంతగా ఇష్టపడవు.
13. ఈ మిశ్రమాన్ని పిచికారీ చేయడం వల్ల మొక్కలకు అవసరమైన సల్ఫర్‌ అందుతుంది. ఇది పూత, పిందె రాలడాన్ని తగ్గించి, అధిక దిగుబడికి సహాయపడుతుంది.

14. 2 నుండి 3 గ్రాముల ఇంగువ పొడి (లేదా చిన్న ముక్క)ని  కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసి బాగా కరిగించాలి. ఈ కరిగిన ఇంగువ నీటిని 1 లీటరు పుల్లటి మజ్జిగలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 10 /15 లీటర్ల  నీటిలో బాగా మిక్స్‌ చేయాలి. ఈ నీటిని వడకట్టి, 10–15 రోజులకొకసారి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో  మాత్రమే మొక్కల ఆకులపై బాగా స్ప్రే చేయాలి.
15. పుల్ల మజ్జిగను పరిమితంగానే వాడాలి. ఎక్కువగా వాడితో సమస్యలు వస్తాయి. ఇందులో లాక్టిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది మట్టి పీహెచ్‌ (ఉదజని సూచిక) స్థాయిని తగ్గించి, మట్టిని తీవ్ర ఆసిడిక్‌గా మారుస్తుంది. ఎక్కువ మోతాదులో వాడటం వల్ల మట్టిలో తేమ నిలిచిపోయి వేర్లకు గాలి ఆడదు. ఇది వేరు కుళ్లు తెగులుకు  దారితీస్తుంది. మట్టి పీహెచ్‌ మారడం వల్ల మొక్కలు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి అవసరమైన పోషకాలను వేర్ల ద్వారా పీల్చుకోలేవు.

16. మజ్జిగలోని చక్కెరలు, కొవ్వుల వల్ల మట్టిపై తెల్లటి బూజు ఏర్పడుతుంది. ఇది హానికరమైన శిలీంధ్రాలను ఆకర్షిస్తుంది. 
17. మిగిలిపోయిన మజ్జిగ మట్టిలో కుళ్లిపోవడం వల్ల తోటలో తీవ్రమైన దుర్వాసన వస్తుంది. ఇది ఈగలు, చీమలు మరియు ఇతర పురుగులను పెంచుతుంది.
18. సరిగ్గా నీరు కలపకుండా ఆకులపై నేరుగా ఎక్కువ గాఢత ఉన్న పుల్ల మజ్జిగను చల్లితే ఎండ తీవ్రతకు ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. పుల్ల మజ్జిగను ఎప్పుడూ నేరుగా పోయకూడదు. 1 లీటరు పుల్ల మజ్జిగకు కనీసం 10 నుండి 20 లీటర్ల నీటిని కలిపి పలచగా చేసి మాత్రమే మొక్కల మొదళ్లలో లేదా ఆకులపై స్ప్రే చేయాలి. వారానికి లేదా పది రోజులకు ఒకసారి సాయంత్రం వేళల్లో మాత్రమే దీన్ని వాడటం సురక్షితం.

- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్‌: 94906 02366

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇదీ చదవండ: జంతువుల పెంటతో నేలకు కొత్త జీవం.. పెరూలో శాస్త్రవేత్తలకు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement