జంతువుల పెంటతో నేలకు కొత్త జీవం.. పెరూలో శాస్త్రవేత్తలకు షాక్‌! | Vicuna Dung Restores Barren Soil Peru Andes Organic Carbon | Sakshi
Sakshi News home page

జంతువుల పెంటతో నేలకు కొత్త జీవం.. పెరూలో శాస్త్రవేత్తలకు షాక్‌!

Sep 25 2026 9:28 AM | Updated on Sep 25 2026 9:43 AM

Vicuna Dung Restores Barren Soil Peru Andes Organic Carbon

సాగుబడి

జీవవైవిధ్యాన్ని, నేల సారాన్ని పెంచుతున్న జంతు విసర్జితాలు

భూమిని ఎలా కా΄ాడుకోవాలనే ప్రశ్నకు ఆచరణాత్మక పరిష్కారం

పెరూ పరిరిశోధనలో వెల్లడి

పెరూ ఆండీస్‌ పర్వతాల్లోని ‘వికూనా’ (ఒంటె జాతి జంతువు) మలం బంజరు నేలలను సారవంతంగా మారుస్తోందని తాజా పరిశోధన తెలిపింది. ఈ వ్యర్థాల వల్ల నేలలో సేంద్రియ కర్బనం 62 శాతానికి పెరిగి, తేమ నిలిచి కొత్త మొక్కలు మొలుస్తున్నాయి. రసాయనిక ఎరువులకు బదులు పశువుల పెంట, సహజ ఎరువులతో నేల సారాన్ని, జీవాన్ని ఎలా పునరుద్ధరించవచ్చో దక్షిణ అమెరికాలోని పెరూ ఆండీస్‌ పర్వతాల్లో జరిగిన తాజా శాస్త్రీయ అధ్యయనం నిరూపిస్తోంది.

వాతావరణ మార్పుల తీవ్రతతో పాటు ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటం, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవటం వంటి కారణాలతో నేలల్లోని తేమ క్షణాల్లో ఆవిరైపోతోంది. దశాబ్దాలుగా విచక్షణారహితంగా వాడుతున్న రసాయనిక ఎరువులు నేలను మరింత నిస్సారంగా, గట్టి రాతిలా మారుస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భూమిని ఎలా కాపాడుకోవాలనే ప్రశ్నకు దక్షిణ అమెరికాలోని పెరూ ఆండీస్‌ పర్వతాల్లో జరిగిన తాజా శాస్త్రీయ అధ్యయనం ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపింది.

పర్వత ప్రాంతాలలో హిమానీనదాలు కరిగిపోయిన తర్వాత మిగిలిన బంజరు నేలల్లో కనీసం గడ్డి మొలవడానికి కూడా సాధారణంగా శతాబ్దం పైగా పడుతుంది. అయితే అక్కడ సంచరించే ‘వికూనా’ (ఒంటె జాతికి చెందిన వన్యప్రాణి) అనే జంతువుల విసర్జితాల ద్వారా ఈ బంజరు భూములు కొద్ది కాలంలోనే పచ్చటి ఒయాసిస్‌లుగా మారుతున్నట్లు జేమ్స్‌ మాడిసన్, కొలరాడో విశ్వవిద్యాలయాల పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలు ప్రతిష్టాత్మక ‘సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఎల్‌నినో సమయంలో తీవ్ర వర్షాభావం, అధిక ఎండల వల్ల పంటలు నిలబడాలంటే నేలలో సేంద్రియ కర్బనం (ఆర్గానిక్‌ కార్బన్‌) తప్పనిసరి. పెరూ పరిశోధన ప్రకారం, సహజ జంతు వ్యర్థాలు నేలలోని ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను అరికట్టి తేమను ఎక్కువ కాలం నిలిపి వుంచాయి. రసాయనిక ఎరువుల కంటే పశువుల పెంట వంటి సహజ ఎరువులే నేలకు బలమైన రక్షణ కవచాలుగా నిలుస్తాయని ఇది స్పష్టం చేస్తోంది. మన రైతులు సంప్రదాయ ఎరువులను వాడటం ద్వారా కరవు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు.

సాధారణ నేల వర్సెస్‌ జంతు వ్యర్థాల నేల!
పరిశోధకులు సముద్ర మట్టానికి దాదాపు 18,000 అడుగుల ఎత్తులో మట్టి నమూనాలను పరీక్షించి అందించిన శాస్త్రీయ అధ్యయన వివరాలు ఈ పట్టికలో పొందుపరిచాం.

రోజూ అక్కడే సామూహిక మల విసర్జన! 
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన ముఖ్యమైన అంశం వికూనాల ప్రవర్తన. ఇవి మేత కోసం ఎక్కడ తిరిగినా, మలవిసర్జన చేయడానికి మాత్రం గుంపులుగా ఒకే నిర్దిష్ట ప్రదేశానికి వస్తాయి. శాస్త్రవేత్తలు వీటిని ‘కమ్యూనిటీ లెట్రిన్స్‌’ (సామూహిక మలమూత్ర విసర్జన కేంద్రాలు) అని పిలుస్తున్నారు.

  • సహజ విత్తన భాండాగారం: అవి తిన్న గడ్డిలోని విత్తనాలు వాటి విసర్జితాల ద్వారా అక్కడే పడి, పేడలోని పోషకాల సాయంతో వేగంగా మొలకెత్తుతున్నాయి.

  • తిరిగి అదే మేత: తాము వేసిన పెంట కుప్పలపై ఏపుగా పెరిగిన పచ్చికను మేయటానికి వికూనాలు క్రమం తప్పకుండా మళ్లీ అక్కడికే వస్తుండటం విశేషం.

  • వన్యప్రాణుల రాక: అక్కడ వికసించిన పచ్చదనం, సూక్ష్మ జీవులను చూసి ఎత్తయిన కొండలపై ఎన్నడూ కనిపించని అరుదైన పక్షులు, చివరకు ప్యూమా వంటి పెద్ద మాంసాహార మృగాలు కూడా అక్కడ సంచరించటం కెమెరాల్లో నమోదైంది.

  • మన పూర్వీకులు పొలాల్లో గొర్రెల, పశువుల మందలు కట్టించటం, పెంట కుప్పలను పొలమంతా వెదజల్లటం వెనుక ఉన్న శాస్త్రీయ అంతరార్థం ఇదే. ఎల్‌నినోను తట్టుకోవాలంటే నేలకు జీవం పోసే సహజ పద్ధతులను పునరుద్ధరించుకోవటమే ఏకైక మార్గం.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇదీ చదవండి: పుల్ల మజ్జిగతో మొక్కలకు భలే లాభాలు.. కానీ ఈ తప్పు చేయొద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement