breaking news
Panthangi Rambabu Sagubadi
-
Sagubadi: రైతమ్మల శ్రమకు జేజేలు!
వ్యవసాయం, ఆహారోత్పత్తుల తయారీ, పంపిణీ రంగాల్లో మహిళలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా శ్రమ తోడు లేకుండా వ్యవసాయం ఒక్క పూట కూడా ముందుకు సాగదు. ఆమె బహుపాత్రాభినయం చెయ్యకపోతే కుటుంబమూ వర్ధిల్లదు. పొలాల్లో వ్యవసాయ పనులు, ఇంటి దగ్గర పశుపోషణతో పాటు అదనంగా వంట పనులు, ఇంటి పనులు, పెద్దల సంరక్షణ పనులను భుజాన వేసుకొని మోస్తున్న మహిళా రైతులు కొవ్వొత్తుల్లా కరుగుతూ సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నారు. మహిళా రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లింగపరమైన ప్రతిబంధకాలను, వివక్షలను, అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. ఈ లింగ అంతరాలను గుర్తించి, పరిష్కరిస్తే ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆహార అభ్రదత గణనీయంగా తగ్గుతుందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో ఆ దిశగా మీ ఆలోచనలు, ఆచరణకు పదును పెట్టండి అని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం (ఐవైడబ్ల్యూఎఫ్ 2026)గా ప్రకటించింది. ఆహార భద్రతను అందించటంలో మహిళలు – రైతుగా, రైతు కూలీగా, ఆహార పరిశ్రమదారుగా, ఉద్యోగిగా, అమ్మగా, కుటుంబ సభ్యుల సంరక్షకురాలిగా– బహుముఖ సేవలందిస్తున్నారు. ప్రపంచ వ్యవసాయ శ్రామిక శక్తిలో మహిళలకు గణనీయమైన భాగస్వామ్యం ఉంది. వ్యవసాయ, ఆహార విలువ గొలుసులో వీరి పాత్ర అత్యంత కీలకం. వ్యవసాయంలో, వ్యవసాయానుబంధ రంగాల్లో ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్ పనుల నుంచి పంపిణీ, వాణిజ్య కార్యకలాపాల వరకు వ్యవసాయ, ఆహార విలువ గొలుసు పరిధిలోకి వస్తాయి. ఇంటి ఆహార భద్రత, పోషకాహారం సమకూర్చటంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021లో వ్యవసాయ ఆహార రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా శ్రమిస్తున్న వారిలో 41% మహిళలైనప్పటికీ, మహిళల శ్రమ విలువను తక్కువగా చూస్తున్నారు. నడుములు పడిపోయే శ్రమతో కూడుకున్న పనులు చేయిస్తారు. కానీ, తక్కువ జీతం. భూమి, ఆర్థిక, సాంకేతికత, విద్య, విస్తరణ సేవలు తదితర అన్ని స్థాయిల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో వ్యవస్థాగత అడ్డంకులను మహిళా రైతులు ఎదుర్కొంటున్నారు. మహిళా రైతుల జీవన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటానికి, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలను శక్తివంతం చేయడానికి.. తద్వారా వ్యవసాయాన్ని ఆహారోత్పత్తి రంగాలను మరింతగా ఒడిదుడుకుల్ని తట్టుకునేలా పటిష్టంగా నిర్మించడానికి అనుగుణంగా విధాన సంస్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్‌ఏఓతో పాటు ఐరాస అనుబంధ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ), వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్లు్యఎఫ్పీ)లు వచ్చే ఏడాదంతా మహిళా రైతులను బలోపేతం చేసే కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి. ‘మహిళా రైతు’లంటే ఎవరు?వ్యవసాయ, ఆహార రంగాల్లో విభిన్న పాత్రల్లో పనిచేస్తున్న మహిళలందరూ మహిళా రైతులే. చిన్న/పెద్ద సొంత భూముల్లో పంటలు సాగు చేసే మహిళలు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేపలు/రొయ్యల రైతులు, మత్స్యకారులు, చేపల కార్మికులు, తేనెటీగల పెంపకందారులు, పశువులు/కోళ్ల పెంపకందారులు, ప్రాసెసర్లు, వ్యాపారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామీణ వ్యవస్థాపకులు, సాంప్రదాయ విజ్ఞానవంతులు.. అధికారిక లేదా అనధికారిక పనిలో నిమగ్నమయ్యే మహిళలు.. భూమి యాజమాన్య హక్కులు ఉన్నా లేకున్నా సరే.. వీరంతా మహిళా రైతులే. వీరిలో యువతులు, వృద్ధులు, పేద, ఆదివాసీ మహిళలు, వైకల్యాలున్న మహిళలు, శరణార్థులు, వలస వచ్చి వ్యవసాయ, ఆహార శుద్ధి పనులతో పొట్టపోసుకుంటున్న మహిళలు కూడా ఈ కోవలోని వారే. వ్యవసాయ, ఆహార రంగాల్లో మహిళల స్థితిగతులు, లింగ అసమానతల స్థాయి, పర్యావరణ విపత్తుల నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతల వల్ల కలుగుతున్న ప్రమాదాలను ఎఫ్ఏఓ నివేదికలు నొక్కి చెబుతున్నాయి. మీకు తెలుసా?→ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలు, ఆహార పరిశ్రమల్లో 2021లో పనిచేసే కార్మికుల్లో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతను ఎదుర్కొంటున్నారు. → మగ రైతులతో పోల్చితే చాలా మంది మహిళా రైతులు చిన్న కమతాల్లోనే సేద్యం చేస్తున్నారు. → వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పరిశ్రమల్లో పనిచేసే మహిళల సంపాదన పురుషుల కన్నా 22% తక్కువ. → మహిళా రైతులపై పొలం పనులతో పాటు ఇంటి సంరక్షణ పని భారం అధికంగా ఉంటుంది. ఇంటి పనులకు ప్రత్యేక ఆదాయం ఉండదు. అసలు ఆ శ్రమ విలువ లెక్కలోకి రాదు. పని చేసినా ఆర్థిక సాధికారత రాదు. వారి శారీరక, మానసిక శ్రేయస్సును ఈ వేతనం లేని పని భారం దెబ్బతీస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యుల కోసం చేసే వేతనం లేని సంరక్షణ పని విలువ ఏటా కనీసం 10.8 లక్షల కోట్ల డాలర్లని ఎఫ్ఏఓ లెక్కగట్టింది.→ ప్రణాళికాబద్ధమైన పథకాల ద్వారా గ్రామీణ మహిళలను సాధికారపరిస్తే 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. 23.5 కోట్ల మందికి ఒడిదుడుకుల్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. అయినప్పటికీ ఈ దిశగా కృషి జరగటం లేదు. → తీవ్రమైన వేడి, కరువుల నేపథ్యంలో పురుషుల కంటే మహిళలపై ఎక్కువ పని భారం పడుతుంది. → లింగపరమైన అంతరాలను రూపుమాపితే ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు పెరుగుతుంది. 4.5 కోట్ల మంది ఎదుర్కొంటున్న ఆహార అభద్రతను తగ్గించవచ్చు. → ఆహార అభద్రత బాధితుల్లో మహిళల సంఖ్యే ఎక్కువ. ఉపాధి, విద్యావకాశాలు, ఆదాయంలో లింగపరమైన అంతరం తగ్గించగలిగితే మహిళల్లో ఆహార అభద్రతను 52% తొలగించవచ్చని ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. → మహిళలకు భూమి హక్కులు కల్పిస్తే వ్యవసాయ, ఆహార వ్యవస్థలు, గ్రామీణాభివృద్ధికి.. మొత్తంగా సమాజాభివృద్ధికి సహాయపడుతుంది. భూమి యాజమాన్య హక్కు విషయాల్లో లింగ వివక్ష రాజ్యం ఏలుతోంది. సాగు భూమిపై మహిళలకు మరింతగా హక్కులు కల్పిస్తే వారి సాధికారత, పెట్టుబడి సామర్థ్యం, స్థిరత్వం, సమస్యలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. భూమి హక్కున్న మహిళా రైతుకు సేవల లభ్యత మెరుగవుతుంది. లింగ ఆధారిత హింస తగ్గుతుందని ఎఫ్ఏఓ సూచిస్తోంది. గడ్డిభూముల సంవత్సరం కూడా ! 2026ను మహిళా రైతుల సంవత్సరంతో పాటు గడ్డి భూములు, సంచార పశుకాపరుల సంవత్సరంగానూ ఉమ్మడిగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. గడ్డి భూములు, సవన్నాలు, పొదలతో నిండిన బంజర్లు, ఎడారులు, చిత్తడి భూములు, కొండలు గుట్టలున్న ప్రాంతాల విస్తీర్ణం భూతలమ్మీద సగానికి సగం ఉంటుంది. ఈ ప్రాంతాలను పర్యావరణ హితమైన రీతిలో నిర్వహించటం జీవవైవిధ్యం, పచ్చదనం పరిరక్షణకు, కర్బన నిల్వలు, నీటి చక్రం నిర్వహణకు అవసరం. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు వంటి సుమారు 100 కోట్ల పశువులను బంజరు భూములు, పచ్చికబయళ్లలో మేపుకుంటూ ఎంతో మంది సంచార పశుకాపరులు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూముల్లో దాగి ఉన్న కర్బన నిల్వల్లో 30% ఈ భూముల్లోనే ఉంది. భూతాపం పెరగటం వల్ల ఈ భూముల్లోని సగం కర్బనం వాతావరణంలో కలిసినట్లు అంచనాలు ఉన్నాయి. ఫలితంగా ఈ భూములపై ఆధారపడి ఉన్న ప్రజల జీవనోపాధులు ప్రమాదంలో పడుతున్నాయి. గడ్డి భూములు, చిత్తడి నేలల పరిరక్షణకు పాలకులు శ్రద్ధతీసుకొని పెట్టుబడులు పెట్టాలని ఎఫ్ఏఓ పిలుపునిచ్చింది. ఈ భూములను పరిరక్షించటం ద్వారా పంట పొలాలకూ మేలు జరుగుతుంది. -
‘నానో’ మ్యాజిక్ తక్కువ ఎరువు ఎక్కువ దిగుబడి!
పంట మొక్కల మొదళ్ల దగ్గర వేసే సాధారణ రసాయనిక ఎరువుల్లో 30 శాతమే పంటలకు ఉపయోగపడుతుంటే, 70% ఎరువులు నేల పాలవుతున్నాయి. రైతుల డబ్బు వృథా కావటంతో పాటు ఇవి నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తున్నాయి. అయితే, దీన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నేలపై వేసే యూరియా వంటి ఎన్పీకే (రసాయనిక) ఎరువులనే అతి సూక్ష్మ కణాల ఎన్పీకే పొడిగా మార్చి, నేలపై వెయ్యకుండా, నీటిలో కలిపి పిచికారీ చేస్తే.. ప్రామాణిక మోతాదులో కేవలం 20–30% నానో ఎరువులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చు. 80–70% ఎరువులను నికరంగా ఆదాయ చెయ్యవచ్చు. ఎరువుల ఖర్చును తగ్గించుకోవటంతో పాటు పనిలో పనిగా పర్యావరణ కాలుష్యాన్ని, నేల ఆరోగ్యాన్ని, భూతాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే, అతి సూక్ష్మ రసాయనిక ఎరువులతో దీర్ఘకాలంలో దుష్ఫలితాలేమీ లేవని నిర్ధారించే పరీక్షలు ఇంకా చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వస్తుందని ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రొ. శ్రీకాంత్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.‘నానో ఫెర్టిలైజర్ లేదా అతి సూక్ష్మ రసాయనిక ఎరువులు’ అనగానే సీసాల్లో నింపి అమ్ముతున్న నానో ద్రవ రూప ఎరువులు చప్పున గుర్తొస్తాయి. అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది వాటి గురించి కాదు. మామూలుగా మన రైతులు గుప్పిళ్లతో పొలాల్లో వెదజల్లే తెల్లని యూరియా, ఫాస్పరస్, డీఏపీ వంటి గుళికల రసాయనిక ఎరువుల గురించే. గుళికల రూపంలో ఉండే వీటిని అతి సూక్ష్మ కణాల పొడిగా మార్చితే అవి ‘నానో ఎరువులు’ అవుతాయి. ఈ పొడిని నీటితో కలిపి పంటలపై పిచికారీ చేస్తే.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలకు సిఫారసు చేసే రసాయనిక ఎరువుల మోతాదులో 20–30% అతిసూక్ష్మ ఎరువులతోనే సాధారణం కన్నా అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు రుజువు చేశారు. ఎన్పీకే స్థూల ఎరువులతో పాటు ఐరన్, జింక్ తదితర సూక్ష్మపోషక ఘనరూప ఎరువులను సైతం పొడిగా మార్చి, నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసి సత్ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ వీవీఎస్ఎస్ శ్రీకాంత్ తదితర పరిశోధకుల బృందం నానో–ఎరువుల రూపకల్పన, తయారీపై పనిచేసింది. మొక్కల ఎదుగుదల తీరుపై ప్లాంట్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పొదిలె అప్పారావు బృందం అధ్యయనం చేసింది. అతి సూక్ష్మ ఎరువుల ప్రయోజనాలు 3:∙ఎరువుల మోతాదులో 20–30% చాలు∙80–70% తగ్గనున్న ఎరువుల ఖర్చు ∙నేల, నీరు, గాలి కాలుష్యానికి చెక్!రోజ్మేరీపై నెలకోసారి పిచికారీరోజ్మేరీ (రోస్మరినస్ అఫిసినాలిస్) ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్న విలువైన సుగంధ నూనె పంట. రోజ్మేరీ నూనెను ఆహారం, సౌందర్య సాధనాలు, ఔషధ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే, సాధారణంగా అధికంగా రసాయనిక ఎరువుల వాడకంతో అధిక ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రత్యేక డిజైన్‌తో రూపొందించిన యంత్రంలో సాధారణ ఎన్పీకే ఎరువులను వేసి, నానో ఎరువుల పొడిగా మార్చారు. ఎన్పీకే ఎరువులతో పాటు ఇనుము, జింక్, మాంగనీస్, రాగి సహా కీలకమైన సూక్ష్మ పోషకాలను కూడా అతి సూక్ష్మ పొడిగా మార్చి వాడారు. గ్రీన్హౌస్లో కుండీల్లో పెరిగే రోజ్మేరీ మొక్కలపై 3 నెలల పంట కాలంలో నెలకోసారి పిచికారీ చేశారు. సాధారణ ఎరువుల గుళికలను నేలపై వేసినప్పటితో పోల్చితే, పిచికారీ చేసిన నానో పొడిలోని పోషకాలను మొక్కలు ఆకుల ద్వారా చాలా మెరుగ్గా ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. రోజ్మేరీ పంట సాగులో సాధారణంగా హెక్టారుకు ఏడాదిలో 100–300 కిలోల ఎన్పీకే ఎరువులు వాడతారు. అయితే, రోజ్మేరీ మొక్కలకు ప్రామాణిక ఎరువుల మోతాదులో 20–30% పరిమాణంలోనే నానో ఎరువుల పొడిని వాడారు. అయినా మొక్కలు, వేర్ల పెరుగుదల మెరుగ్గా ఉంది. అతి సూక్ష్మ రూపంలోని రసాయనిక ఎరువుల కణాలను ఆకులు సులువుగా గ్రహించటం వల్ల సమర్థవంతంగా పోషక శోషణ జరిగింది. జీవక్రియ మెరుగ్గా జరిగింది. ఫలితంగా అధిక నూనె దిగుబడి వచ్చింది. నూనె నాణ్యత, సుగంధ స్థాయి అధికంగా వచ్చింది. ఈ పరిశోధన ఫలితాలు ‘ఇండస్ట్రియల్ క్రాప్స్–ప్రొడక్ట్స్’ శాస్త్రీయ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఈ విధానాన్ని మార్కెట్లో అధిక విలువ కలిగిన అనేక ఔషధ, సుగంధ పంటలకు కూడా అన్వయించవచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. మీటరులో 100 కోట్ల వంతు!సాధారణంగా రైతులు వాడే డీఏపీ, ఎన్పీకే వంటి రసాయనిక ఎరువుల గుళికలు మైక్రోమీటర్ల (మీటరులో పది లక్షల వంతు) సైజులో ఉంటాయి. ఇఫ్కో నుంచి సా«దారణ 19:19:19 ఎన్పీకే, మైక్రో–న్యూట్రియంట్ మిక్స్ (ఉత్కర్ష్ కాంబి–2)లను కొనుగోలు చేశారు. వీటిని హై–ఎనర్జీ షేకర్ మిల్లులో వేసి నానో ఎరువుల పొడిని తయారు చేశారు. నానో ఎరువుల కణాలు మీటరులో 100 కోట్ల వంతు సైజులో అతి సూక్ష్మంగా ఉంటాయి. నానో ఎరువుల బయో ఎవైలబిలిటీ (జీవ లభ్యత) ఎక్కువ. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసినప్పుడు పత్ర రంధ్రాల ద్వారా ఈ పోషకాలు నేరుగా మొక్క సులువుగా, సమర్థవంతంగా తీసుకోగలుగుతుంది. నేలలో వేసిన సాధారణ ఎరువుల్లో పోషకాలను వేర్ల ద్వారా గ్రహించగలిగే దానికన్నా, పిచికారీ చేసిన నానో ఎరువుల పోషకాలను చాలా సులువుగా, మెరుగ్గా పంట మొక్కలు తీసుకోగలుగుతాయి. వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్తలు సిఫారసు చేసే మోతాదులో 20 నుంచి 30% అతి సూక్ష్మ ఎరువులతోనే అధిక దిగుబడి తీయటం సాధ్యమవుతుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రభావాలపై పరీక్షలు చెయ్యాల్సి ఉందివ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే ప్రామాణిక రసాయనిక ఎరువుల పరిమాణంలో 20–30% నానో ఎరువులు æ వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. అతి సూక్ష్మ కణాలతో కూడి ఉన్నందున నానో ఎరువులు తక్కువ మోతాదుతోనే అధిక ఫలితాన్ని ఇస్తాయి. నేల, నీటి వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సాధారణ రసాయనిక ఎరువులను ఉపయోగించి నానో ఎరువులను తయారు చేశాం. మా యూనివర్సిటీ ప్రయోగశాలలో నియంత్రిత వాతావరణంలో కుండీల్లో రోజ్మేరీ మొక్కలపై ప్రయోగాత్మకంగా నానో ఎరువులు వాడాం. దాంతో పాటు రోజ్మేరీ నూనె దిగబడితో పాటు నాణ్యత కూడా పెరిగింది. అయితే, రైతులకు ఈ సాంకేతికత అందించడానికి ముందు మరికొన్ని పరీక్షలు చెయ్యాల్సి ఉంది. నానో ఎరువుల వల్ల దీర్ఘకాలిక పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి అంతర్జాతీయ మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కఠినమైన పరీక్షలు ఇంకా చెయ్యాల్సి ఉంది. నానోటెక్నాలజీ అనూహ్యంగా ఎటు వంటి హానీ చెయ్యదని, వ్యవసాయానికి నిజంగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆధార సహితంగా నిర్ధారించుకోవటానికి ఈ పరీక్షలు ముఖ్యం. ఆ తదనంతరం నానో ఎరువుల సాంకేతికతను రైతుల వద్దకు తీసుకువెళ్తాం. – ప్రొఫెసర్ వీవీఎస్ఎస్ శ్రీకాంత్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
విపత్తుల్ని తట్టుకునే వినూత్న ఉపాయాలు!
అధిక వేడి, అధిక చలి, నీటి ముంపు వంటి విపత్కర వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు పంటలు, తోటలు తట్టుకోలేకపోవటం ఆధునిక కాలపు వ్యవసాయ, ఉద్యాన తోటల సాగుకు పెద్ద సవాలుగా నిలిచింది. గడ్డు కాలాన్ని తట్టుకొని నిలబడటమే కాకుండా, మంచి దిగుబడినిచ్చేందుకు తోడ్పడే 2 అద్భుత సాంకేతికతలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు డాక్టర్ జడల శంకరస్వామి ఆవిష్కరించారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో వీటితో సత్ఫలితాలు సాధించారని, మన దేశంలో తానే మొదటిగా గత మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నానని ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. వాతావరణ మార్పులు మనం, మన పంటలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఉద్యాన పంటల సాగులో వాతావరణం కీలకపాత్ర పోషిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఫలితంగా వర్షపాతంలో/ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, విపరీతమైన వేడి గాలులు, పెరుగుతున్న నీటి అవసరాలు సవాళ్లు విసురుతున్నాయి. అధిక వర్షాలు, వరద ముంపు సందర్భాల్లో ఉద్యాన తోటలు, సీజనల్ పంటలకు అధిక నష్టం కలిగి, ఉత్పాదక శక్తి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ విపత్తుల నుంచి పంటలు, తోటలను రక్షించుకోవటానికి ఉపయోగపడే రెండు చక్కని సాంకేతికతలను వనపర్తి జిల్లా మోజర్లలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జడల శంకరస్వామి ఆవిష్కరించారు. ప్రయోజనకరమైన పరిశోధనలు చేస్తున్న ఆయన ఆవిష్కరించిన మొదటి సాంకేతికత: ‘మల్టీవాల్ కార్బన్ నానో ట్యూబ్ పౌడర్’(నానో బొగ్గుపొడి), రెండోది: ‘హైడ్రోజన్ రిచ్ వాటర్ (హైడ్రో నీరు)’. నానో బొగ్గు పొడి, హైడ్రో నీటిని పిచికారీ చేసి పండ్ల తోటలు, కూరగాయ తోటలతోపాటు పత్తి, మిరప, వరి వంటి సీజనల్ పంటలను కాపాడుకోవచ్చని డా. శంకరస్వామి వెల్లడించారు. వీటిని వేర్వేరుగా పిచికారీ చేయటం ద్వారా పంటలు, తోటలను పర్యావరణ ఒత్తిళ్ల నుంచి సమర్థవంతంగా రక్షించుకోవచ్చని రుజువైందని డా. శంకరస్వామి తెలిపారు. పంట, పండ్ల వ్యర్థాలతో నానో బొగ్గు పొడి తయారీ ఇలా..నానో బొగ్గు పొడి పైకి సాధారణ బొగ్గు పొడిలాగే కనిపిస్తుంది. కానీ, అతిసూక్ష్మ కర్బన గొట్టాలతో కూడిన బొగ్గు పొడి ఇది. పంటల వ్యర్థాలను ఒక ప్రత్యేక యంత్రంలో వేసి ఆక్సిజన్ లేని వాతావరణంలో 600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మండించి దీన్ని తయారు చేస్తారు. రైతుల పొలాల్లో, పట్టణాలు, నగరాల్లో వృథాగా పారేసే పంట, పండ్ల వ్యర్థాలతో నానో బొగ్గు పొడిని తయారు చేసుకోవచ్చు. ఎండిన దానిమ్మ, నారింజ, పుచ్చ, సీతాఫలం, పనస, సొర, గుమ్మడి తదితర పండ్ల తొక్కలు.. మామిడి టెంకలు, చింతగింజలు, పత్తి చెట్ల ప్రధాన కాండాలు (వేర్లతో సహా), అరటి బోదలు, కొబ్బరి బొండాల డొప్పలు, కొబ్బరి చిప్పలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక కిలో చెత్తను యంత్రంలో వేస్తే పావు కిలో బొగ్గు పొడి తయారవుతుంది. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్నా, ఖరీదెక్కువ. కిలో ధర రూ. 10 వేలు. గ్రాము ధర రూ. వంద వరకు ఉంటుంది. అయితే, దీని తయారీ యంత్రం ధర కనీసం రూ. 7.5 లక్షలు ఉంటుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు దీన్ని తయారు చేసి రైతులకు అందించవచ్చని డా. శంకరస్వామి సూచిస్తున్నారు. పత్ర రంధ్రాల్లోంచి చొచ్చుకెళ్తుంది!నానో బొగ్గు పొడి పైకి సాధారణ బొగ్గు పొడి మాదిరిగానే కనపడుతుంది. అయితే, నీటిలో కలిపి పంటలు, తోటలపై పిచికారీ చేస్తే బాగా పనిచేస్తుంది. ఆకుల్లోని సూక్ష్మ రంధ్రాల ద్వారా చొచ్చుకెళ్లి వాతావరణ ఒత్తిళ్లను తట్టుకునే శక్తినిస్తుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తేలా చేస్తుంది. తోటలు/పంటల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. నీరు, ముఖ్యమైన పోషకాలను సమర్ధవంతంగా గ్రహించటంలో తోడ్పడుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంటలు దెబ్బతినకుండా కాపాడుతుంది. హైడ్రో నీరు తయారీ ఇలా..పంటలు, తోటలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తినివ్వటంలో హైడ్రోజన్ కలిపిన నీరు (హైడ్రోజన్ రిచ్ వాటర్) ఉపయోగపడుతుంది. సాధారణ నీటిలో హైడ్రోజన్ వాయువును అదనంగా కలిపితే హైడ్రో నీరు తయారవుతుంది. సాధారణ నీటిలో హెచ్2ఓ అణువులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ నీటిలో స్వేచ్ఛగా తిరిగే ‘కరిగిన హైడ్రోజన్ అణువులు’ అదనంగా ఉంటాయి. హైడ్రోజన్ వాయువును ఎలక్ట్రోలసిస్ పరికరం సహాయంతో హైడ్రో నీటిని తయారు చేసుకోవచ్చు. ఈ నీటి సాంద్రతను పార్ట్స్ పర్ బిలియన్ (పీపీబీ) యూనిట్లలో కొలుస్తారు. 1000 పీపీబీ సాంద్రత గల హైడ్రో నీటిని పిచికారీ చేస్తే వాతావరణ ప్రతికూలతలను తట్టుకునే శక్తి వస్తుందని డా. శంకరస్వామి పరిశోధనల్లో తేలింది. రోజుకు వేల లీటర్ల హైడ్రో నీటిని ఉత్పత్తి చేసే వాటర్ ఎలక్ట్రోలైజర్ మిషన్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది లేదా మిక్సీ మాదిరిగా ఉండే చిన్న మిషన్ ధర రూ. 2 వేలు ఉంటుంది. దేన్నయినా వాడొచ్చు. సాధారణ నీటితో నింపిన 2 లీ. గాజు సీసాను ఈ మిషన్‌పై తల్లకిందులుగా పెడితే, 15 నిమిషాల్లో 1000 పీపీబీ హైడ్రో నీరు సిద్ధమవుతుంది. ఈ నీటిని (సాధారణ నీళ్లలో కలపకూడదు) నేరుగా పంటలు, తోటలపై పిచికారీ చెయ్యాలి. జీవ ఉత్ప్రేరకం హైడ్రో నీరు పిచికారీ వల్ల మొక్కలు/చెట్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెరుగుతాయి. అధిక వేడి, చలి, నీటి ముంపు వంటి ఒత్తిళ్లకు గురైనప్పుడు ఏర్పడే ‘రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్’ పంటలను బలహీనపరుస్తాయి. వీటిని తటస్థీకరించటంలో హైడ్రోజన్ ఒక సెలెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైడ్రో నీరు జీవ ఉత్ప్రేరకం (బయో స్టిమ్యులెంట్) గా పనిచేస్తుంది. జిబ్బరిల్లిక్ యాసిడ్ వంటి హర్మోన్లను పెంపొందిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చెట్లు, మొక్కలు చనిపోకుండా కాపాడుతుంది. కిరణజన్య సంయోగ క్రియను మెరుగుపరిచి, జీవక్రియ, శక్తి జీవక్రియ (ఏటీపీ)ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. పూలు, పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత త్వరగా పాడవకుండా నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతుంది. అధిక ఉష్ణోగ్రతను, అతి చలిని తట్టుకోవటంతో పాటు వ్యాధి నిరోధకతను పెంపొందించేందుకు కూడా హైడ్రో నీరు ఉపయోగ పడుతుందని డా. శంకరస్వామి చెబుతున్నారు. పిచికారీతో 15 రోజులు రక్షణవేసవి వడగాడ్పులు, అధిక ఎండ, అతి చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. అధిక వర్షం కారణంగా ఉరకెత్తకుండా పత్తి, మిర్చి, టమాటా వంటి కూరగాయ పంటలు, పండ్ల తోటలను రక్షించుకోవడానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీటిని వేర్వేరుగా పిచికారీ చేసి కాపాడుకోవచ్చని డా. శంకరస్వామి చెప్పారు. పిచికారీ చేస్తే 15 రోజుల పాటు రక్షణ ఉంటుందన్నారు. అవసరమనుకుంటే మళ్లీ పిచికారీ చేసుకోవాలన్నారు. ఈ రెండింటిని కలిపి చల్లకూడదు. వేర్వేరుగా చల్లాలి. ఇదొకరోజు, అదొకరోజు సాయంత్రం వేళల్లోనే చల్లాలి. లీటరు నీటికి 7 గ్రాముల బొగ్గు పొడి లీటరు నీటికి 7 గ్రాముల నానో బొగ్గు పొడిని కలిపి సాయంత్రపు వేళలో పిచికారీ చెయ్యాలి. ఆ తెల్లారి సాయంత్రం 1000 పీపీబీ సాంద్రత గల హైడ్రో నీటిని పంటలు/చెట్ల ఆకులన్నీ పూర్తిగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. సాధారణ నీటిలో కలపకుండా పంటలు, తోటలపై నేరుగా పిచికారీ చెయ్యాలి. అవసరమైతే 15 రోజుల తర్వాత మళ్లీ చల్లాలి. ముదురు పండ్ల తోటల్లో చెట్టుకు 10 లీటర్ల మోతాదులో ఈ రెండింటిని వేర్వేరుగా, 24 గంటల వ్యవధిలో, పిచికారీ చెయ్యాలి. ఎకరం వరికి 4 కిలోల నానో బొగ్గు పొడినీరు నిల్వగట్టిన వరి పొలాల్లో, పిచికారీ కాకుండా చేలోని నీటిలో, ఎకరానికి 4 కిలోల చొప్పున నానో బొగ్గు పొడిని నేరుగా కలపాలి. వరి మొక్కల కాండాలు, వేరు వ్యవస్థలకు ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. 24 గంటల పాటు ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ నానో బొగ్గు పొడిని వరి పొలం నీటిలో చల్లాలి. వరి పొలంలో హైడ్రోజన్ రిచ్ నీరు చల్లనవసరం లేదు. నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు తయారీపై శిక్షణ ఇస్తాంవాతావరణ మార్పులు తెచ్చే విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడే విధంగా పంటలు, తోటల సామర్థ్యాన్ని పెంపొందించటానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు ఉపయోగపడతాయి. మూడేళ్లుగా నేను ఈ పరిశోధనలు చేస్తూ సత్ఫలితాలు సాధించాను. మన దేశంలో మొట్టమొదట ఉద్యాన కాలేజీలోనే వీటిపై పరిశోధనలు చేపట్టాం. తమిళనాడు కోస్తా ప్రాంతంలో మాత్రమే పండే మధురై మల్లి పంటను వనపర్తి జిల్లా్లలో పండించడానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు చాలా బాగా ఉపయోగపడ్డాయి. నీటిని నిల్వగట్టి సాగు చేసే వరి పొలాల దగ్గరి నుంచి.. కూరగాయలు, పండ్ల తోటలు, పత్తి, మిర్చి వంటి అన్ని రకాల ఆరుతడి పంటల వరకూ గడ్డుకాలాల్లో కాపాడుకోవటానికి ఇవి నిస్సందేహంగా ఉపయోగపడతాయి. నానో బొగ్గు పొడిని, హైడ్రో నీటిని రైతులు మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. యంత్రాలను సమకూర్చుకొని ఎఫ్పీఓలు, సొసైటీలు, రైతు సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు వీటిని తయారు చేసి రైతులకు అందించవచ్చు. వీటి తయారీ, వాడే పద్ధతులపై మోజర్ల ఉద్యాన కాలేజీలో 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నాం. – డా. జడల శంకరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల, మోజర్ల, వనపర్తి జిల్లా(సాయంత్రం 6–7 గంటల మధ్య రైతులు డా. శంకరస్వామికి 97010 64439 నంబరుకు ఫోన్ చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు) – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
‘జాబ్స్ టియర్స్’..కొత్త మిల్లెట్ పంట!
కొత్త మిల్లెట్ పంట! ‘జాబ్స్ టియర్స్’.. ఇది మన దేశానిదే అయినా మనకు తెలియని పంట. మణిపూర్‌కు చెందిన మిల్లెట్ పంట. అధిక పోషక విలువతో కూడి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే.. మల్టీకట్ మిల్లెట్ క్రాప్. అంటే, ఒక్కసారి నాటితే చాలు, మూడుసార్లు ధాన్యం కోసుకోవచ్చు. మొదటి కోత తర్వాత కొద్ది నెలల వ్యవధిలో మరో రెండుసార్లు పంట తీసుకోవచ్చు. మణిపూర్ ప్రాంతంలో ఇది సాగవుతోంది. అన్నంగా వండుకు తినొచ్చు. పశువులకు గ్రాసంగా, దాణాగా పెడతారు. మణిపూర్‌లోని సేనాపతి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ కమీ ‘సాక్షి సాగుబడి’తో ఈ పంట విశేషాలు పంచుకున్నారు. గ్రామినే కుటుంబంలోని ఒక స్మాల్ మిల్లెట్ పంట ఇది. 1–2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. గింజలు రకాన్ని బట్టి రంగు మారుతుంది. పసుపు, ఊదా లేదా గోధుమ రంగులో ఉంటాయి. కన్నీటì బిందువు రూపంలో ఉంటాయి. అందుకే ‘టియర్స్’ అనే పేరొచ్చింది. ఎటువంటి నేలల్లో, ఎంతటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకుంటుంది. దీని బియ్యంలో మాంసకృత్తులు 9%, కొవ్వు 0.5–6.1%, పిండిపదార్థం 58–77%, పీచు 0.3–8.4, 100 గ్రాముల బియ్యంలో 1500 కిలో కేలరీలుంటాయి. వరి బియ్యం, గోధుమలతో పోల్చితే కొవ్వు, ప్రొటీన్ చాలా ఎక్కువ. జాబ్స్ టియర్స్ పైపొట్టు తీసిన ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తింటే ఆరోగ్యం. పిండితో రొట్టె చెయ్యొచ్చు. సూప్‌లలో చిక్కదనం కోసం కలుపుకోవచ్చు. సిరిధాన్యాలతో చేసే చిరుతిళ్లన్నీ చేసుకోవచ్చు. మద్యం తయారీకీ వాడుతున్నారు. కోళ్లకు, పశువులకు కూడా పుష్టికరమైన ఆహారం ఇది. ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్కరువు కాలంలో ఇతర పంటలు పోయినా ఇది బతికి, మనుషుల్ని, పశువుల్ని బతికిస్తుంది. నీటి ముంపును తట్టుకుంటుంది. ఆమ్ల గుణం ఉండే నేలల్లో, లేటరైట్ నేలల్లో, కొండవాలులో నిస్సారమైన భూముల్లోనూ పెరుగుతుంది. సముద్రతలం నుంచి 2 వేల మీటర్ల వరకు ఎత్తు గల ప్రాంతాల్లో పండుతుంది. విత్తనాలను బాగా మసిలే వేడి నీళ్లలో 10 నిమిషాలు ఉంచి, విత్తుకుంటే తెగుళ్లు రావు. మే–జూలై మధ్య విత్తుకోవచ్చు. 8–10 అంగుళాల లోతు దుక్కిచేసి, సాళ్లుగా విత్తుకోవాలి/ వెద పెట్టాలి. 100–115 రోజుల పంట. గింజ గట్టిపడి, తేమ 20% కన్నా తగ్గినప్పుడు కోత కోసుకోవాలి. హెక్టారుకు 2–4 టన్నుల ధన్యం దిగుబడి నిస్తుంది. పైపొట్టు తీసేస్తే 30–50% వరకు ముడిబియ్యం వస్తాయి. హెక్టారుకు 34 టన్నుల పచ్చిగడ్డి, 8 టన్నుల ఎండు గడ్డి పండుతుంది. ఇతర వివరాలకు.. డా. డేవిడ్ కమీ davidkamei81@gmail.com -
పటిష్ఠ క్వారంటైన్‌తోనే చెక్!
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది. శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.కొత్త వాతావరణమే సమస్యఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు. ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్‌ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అన్ని దేశాల్లోనూ ఉన్నదే! ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్‌బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. చదవండి: జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట!ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్‌బాబు.మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్‌గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.– డాక్టర్ బలిజేపల్లి శరత్‌బాబు, అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం. -
ఒకే మోటారుతో రెండు బోర్ల నుంచి నీరు!
తన ఆవిష్కరణ లోగుట్టును వెల్లడించిన రైతు శాస్త్రవేత్త పుల్లారెడ్డి హెచ్.డి.పి. పైపుతో ఇక ఎవరైనా అనుసంధానించుకోవచ్చు! ఖర్చు అంతా కలిపి రూ. 10 వేల లోపే దగ్గర్లో ఉన్న రెండు బోరు బావుల నుంచి ఒకే మోటారుతో నీటిని తోడుకునే పరిజ్ఞానాన్ని కనుగొన్న రైతు శాస్త్రవేత్త పందిరి పుల్లారెడ్డి అద్భుత ఆవిష్కరణ గురించి ‘పల్లెసృజన’ సౌజన్యంతో రెండేళ్ల క్రితమే ‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’ ద్వారా తెలుగు రైతు లోకానికి తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక మంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతిని అనుసరిస్తూ విద్యుత్తును ఆదా చేస్తూ సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. కోరిన రైతుల ఊళ్లకు పుల్లారెడ్డి స్వయంగా వెళ్లి రెండు బోర్లను అనుసంధానం చేసి చూపుతూ వచ్చారు. అయితే, తెలంగాణలో భూగర్భ నీటి మట్టం పెరిగి, వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ఇటీవల చాలా మంది రైతులు ఈ పద్ధతి గురించి అదేపనిగా ఫోన్లు చేస్తుండడంతో పుల్లారెడ్డి ఆలోచనలో పడ్డారు. అన్ని ఊళ్లకూ తానే స్వయంగా వెళ్లడం సాధ్యం కాని పని. కాబట్టి, రెండు బోర్లను అనుసంధానం చేసే పద్ధతిలో గుట్టుమట్లను రైతు లోకానికి విడమరచి చెబితే.. ఎవరికి వారే ఆ పనిని త్వరలోనే అమలు చేసుకోగలుగుతారని ఆయన భావించడం అభినందనీయం. తనను కన్న వారి పేరిట ‘వెంకట శేషాద్రి వాటర్ పంపింగ్ స్కీం’ను రైతాంగానికి అంకితం ఇస్తున్నానని పుల్లారెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు. ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం. తన పొలంలోని రెండు బోర్లు ఆగి, ఆగి నీరు పోస్తుండడం.. రెండో మోటారుకు విద్యుత్ కనెక్షన్ పొందే అవకాశం లేకపోవడంతో వేరే విధంగా ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అని కొత్తదారిలో ఆలోచించి రైతు లోకానికే వెలుగుబాట చూపారు. బోర్లను అనుసంధానం చేసుకోవడానికి అన్నీ కలిపి సుమారు రూ. 10 వేలు ఖర్చవుతుంది. ఆయన చెప్పిన ప్రకారం బోర్ల అనుసంధానం చేసుకునే తీరు ఇదీ. ఈ పద్ధతి విజయవంతం కావాలంటే.. బోర్ల లోతు 150 అడుగులు ఉండాలి. రెండు బోర్ల మధ్య దూరం 35 అడుగులు ఉండాలి. ఈ రెండు బోర్లలో నీరు నేలమట్టం నుంచి 20 అడుగుల లోతులో ఉన్నప్పుడు మాత్రమే అనుసంధానం చేయడం సాధ్యపడుతుంది. ఆ తర్వాత కాలంలో నీటి మట్టం పడిపోయినా ఇబ్బంది ఉండదు. 1.5 – 1.25 ఇంచుల నీరు పోసే 2 బోర్లను కలిపినప్పుడు చక్కని ఫలితం కనిపిస్తుంది. ప్రభుత్వానికి విద్యుత్ ఆదా అవుతుంది. రైతుకు కనీసం రూ. 50 వేలు ఆదా అవుతుంది. రెట్టింపు భూమికి సాగునీరు అందుతుందని పుల్లారెడ్డి తెలిపారు. బోర్ల అనుసంధానానికి కావాల్సిన వస్తువులు: ఎ) 200 అడుగుల పొడవు గల హెచ్.డి.పి. పైపు (10 గేజ్, 1.5 ఇంచులు); బి) 36 అడుగుల పొడవైన 8 ఎం.ఎం. ఇనుప చువ్వలు– రెండు; సి) మోపెడ్‌కు వాడే ట్యూబు ఒకటి (అడుగు పొడవైన ముక్కలుగా కత్తిరించి ఉంచుకోవాలి). హెచ్.డి.పి. పైపును మట్టి కింద ఉంచితే మేలు.. 2 బోర్ల మధ్యన హెచ్.డి.పి. పైపును నేల పైన ఉంచే కన్నా.. మట్టి లోపలికి ఉండేలా పెట్టుకుంటే కదిలిపోకుండా ఉంటుంది. ఇలా చేయడానికి రెండు బోర్లకు ఉన్న కేసింగ్ పైపులను పై నుంచి నేల మట్టం వరకు హెచ్.డి.పి. పైపు పట్టే సైజులో కత్తిరించి.. అందులో నుంచి హెచ్.డి.పి. పైపును కిందికి దింపితే బాగుంటుంది. సందేహాలుంటే పుల్లారెడ్డి (99632 39182)ని సంప్రదించవచ్చు. పుల్లారెడ్డి తన జ్ఞానాన్ని ఉచితంగా పంచిపెట్టడం వల్ల ఈ సీజన్లోనే రైతులందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావించిన గొప్ప మనిషి పుల్లారెడ్డి ఆదర్శప్రాయుడని ‘పల్లెసృజన’ అధ్యక్షులు బ్రిగేడియర్ (రిటైర్డ్) పోగుల గణేశం (98660 01678) అన్నారు. విలక్షణ రైతు శాస్త్రవేత్త పుల్లారెడ్డికి ప్రభుత్వం పింఛనుతో గౌరవించాల్సిన అవసరం ఉంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ బోర్లను అనుసంధానించుకోవడం ఇలా.. 1. తొలుత.. హెచ్.డి.పి. పైపును తీసుకొని.. పైపు రెండు చివరలను ఆకాశం వైపు తిప్పి.. గుంజలకు కట్టేయాలి. పైపులో పూర్తిగా నీరు నింపాలి. 2. నీరు నింపిన తర్వాత.. తడి బంక మట్టిని గోనె సంచిలో చుట్టి.. పైపు రెండు చివరల్లోనూ కూర్చాలి. 3. ఆ తర్వాత.. అడుగు పొడవైన ట్యూబు ముక్క ఒక వైపును మూసివేసి తాడుతో గట్టిగా కట్టి, రెండో వైపును.. హెచ్.డి.పి. పైపునకు తొడగాలి. హెచ్.డి.పి. పైపును బోర్ల లోపలికి దింపే సమయంలో రెండు చివర్ల నుంచి నీరు కారిపోకుండా చూడడానికి రెండు మోపెడ్ ట్యూబు ముక్కలను ఉపయోగిస్తున్నామన్న మాట. 4. హెచ్.డి.పి. పైపు చివరల్లో తొడిగిన ట్యూబు ముక్కల లోపలికి ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి ఇనుప చువ్వలను కలిపి.. ఆ ఇనుప చువ్వల సాయంతో హెచ్.డి.పి. పైపు చివరలను బోర్ల కేసింగ్ పైపుల లోపలికి చేర్చాలి. 5. హెచ్.డి.పి. పైపు చివరలు రెండు బోర్లలో నీటిలోకి పెట్టిన తర్వాత.. ఇనుప చువ్వలను కిందికి నెడుతూ.. పైపు చివరల్లో తొడిగిన మోపెడ్ ట్యూబు ముక్కలను హెచ్.డి.పి. పైపుల నుంచి తొలగించాలి. ఆ తర్వాత ఇనుప చువ్వలను బయటకు తీసేయాలి. పైపును గట్టిగా కుదిపితే.. పైపు చివరల్లో నుంచి బంకమట్టి కూడా బయటకు వచ్చేస్తుంది. 6. బొమ్మలో చూపిన విధంగా.. హెచ్.డి.పి. పైపు ఒక చివరను.. మోటారు బిగించిన బోరు కేసింగ్ పైపు లోపలికి దశల వారీగా 90 అడుగుల లోతునకు దింపాలి. రెండో చివరను.. మోటారు లేని ఖాళీ బోరు లోపలికి దశల వారీగా 80 అడుగుల లోతునకు దింపాలి. 7. ఈ విధంగా హెచ్.డి.పి. పైపును రెండు బోర్ల లోపలికి దింపి నీటితో అనుసంధానం చేసిన తర్వాత మోటారు స్విచ్ ఆన్ చేయాలి. 8. మోటారు ఆన్ చేసిన తర్వాత బోర్ల మధ్య భూమిపైన ఉన్న హెచ్.డి.పి పైపుపై చెవిని ఉంచితే నీరు ఒక బోరు లోనుంచి మరో బోరులోకి ప్రవహిస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. -
‘పొగ’బట్టిన ‘ఏక’ పంటలు!
వాయుకాలుష్యం రూపంలో దేశ రాజధాని నగరంలో ‘పర్యావరణ అత్యవసర’ పరిస్థితిని సృష్టించింది. పొలాల్లో వరిగడ్డి దహనానికి దీపావళి కాలుష్యం తోడైంది. ‘హరిత విప్లవం’ మన పొలాల్లోకి వచ్చి ఇప్పటికి సరిగ్గా ఏభయ్యేళ్లు. అప్పటి నుంచి పంట భూముల్లోపల తొలుస్తున్న పర్యావరణ సంక్షోభమే ఇవాళ అతి సూక్ష్మ ధూళికణాల మహా పడగై రాజధానిని చుట్టుముట్టింది. దేశ రాజధానివాసులను మునుపెన్నడూ ఎరుగనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ‘హరిత విప్లవం’ వెంట తెచ్చిన ఏక పంటల (మోనోకల్చర్) దురలవాటే ఈ దుస్థితికి మూలకారణం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల పొలాల్లో ఖరీఫ్‌లో వరి, రబీలో గోధుమ పంటల సాగు పద్ధతి రైతుల మనసుల్లో లోతుగా నాటుకుపోయింది. ఈ రెండు పంట దిగుబడులను మద్దతు ధరకు ప్రభుత్వం చప్పున సేకరిస్తుంది. కాబట్టి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల మిశ్రమ పంటల సాగు వంటి ప్రత్యామ్నాయాల వైపు రైతులు చూడలేకపోతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని సారవంతమైన నేలల్లో రైతులు కేవలం వరి, గోధుమ పంటలనే ఏక పంటలుగా సాగు చేస్తున్నారు. యంత్రాలతో వరి కోతలైన కొద్ది రోజుల్లోనే గోధుమ విత్తుకోవాలంటే.. పొలాల్లో మిగిలిన మోకాలెత్తు వరి మోళ్లను తగుల బెట్టడానికి మించి మరొక సులువైన మార్గం రైతులకు తోచడం లేదు. పశువులకు వరి గడ్డి కన్నా గోధుమ గడ్డి మేపడమే మేలన్న భావన అక్కడి రైతుల్లో ఉంది. అందుకే ప్రభుత్వం నిషేధించినప్పటికీ వరి గడ్డి మోళ్లకు రైతులు నిప్పంటిస్తున్నారు. భూమిలో అనేక అంగుళాల లోతు వరకూ సూక్ష్మజీవరాశి మాడిపోయి పొలం నిర్జీవంగా, నిస్సారంగా మారిపోతున్నా.. ఏటేటా రసాయనిక ఎరువుల మోతాదు పెంచుతున్నారే తప్ప.. ఏక పంటల సాగు విషవలయాన్ని రైతులు ఛేదించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మండుతున్న లక్షలాది హెక్టార్ల పంట భూముల పొగ.. ఢిల్లీ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పరస్పరాధారితమైన జీవవైవిధ్యమే ప్రకృతి మనుగడకు మూల సూత్రం. ఏక పంటల రసాయనిక వ్యవసాయ నమూనా ఫలితం నేలతల్లి పొదుగు కోసి పాలుతాగడం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ విషవలయంలో చిక్కుకున్న అన్నదాతల ఆక్రందనలు, ఆత్మబలిదానాలు పాలకులను కదిలించలేకపోతున్నాయి. కానీ, వరి పొలాల పొగ.. ఢిల్లీ పాలకులకు, ప్రజానీకానికి పంట భూముల్లో రగులుతున్న సంక్షోభాన్ని రుచి చూపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, నేలతల్లి కడుపులో సూక్ష్మజీవరాశి వైవిధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే.. గ్రామీణులకైనా, దేశ రాజధానివాసులకైనా మనుగడ సాగుతుందని ఇప్పటికైనా గ్రహించడం మేలు. వాయుకాలుష్యం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో.. ఆదివారం నాడు ఢిల్లీలో వ్యవసాయక జీవవైవిధ్యంపై ప్రధాని శాస్త్రవేత్తలతో కొలువుదీరడం కేవలం యాదృచ్ఛికమే! ప్రభుత్వ అపసవ్య వ్యవసాయ విధానమే అసలు సమస్యకు మూలమని గ్రహించడం అత్యవసరం!! గడ్డిని భూమిలోకి కలియదున్నితే భూసారం పెరుగుతుంది. అయితే, ఇందుకు ఎకరానికి రూ. 5 వేలు ఖర్చవుతుంది. ఆ ఖర్చును ప్రభుత్వం భరించవచ్చు. వరి కోత యంత్రాల్లో మార్పులు చేయించడం మరో పరిష్కారం. వరి గడ్డిని నేలమట్టానికి కోయడంతోపాటు.. ఆ గడ్డిని ముక్కలు చేసి నేలపైన పరవడం లేదా గడ్డిని బేళ్లుగా చుట్టడానికి కంబైన్ హార్వెస్టర్లలో తగిన మార్పులు చేయించాలి. గడ్డిని సేకరించి కంపోస్టు చేయించాలి. ఈ పనులు చేయకుండా ప్రభుత్వం రైతులకు జరిమానా విధించడం సరికాదు. - పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ -
చేను కిందే చెరువును సృష్టిద్దాం!!
పొలంలోనే కందకాలు తీసి.. వాన నీటిని తాపుదాం! సాగునీటి భద్రత కోసం ‘సాక్షి’ మీడియా గ్రూప్, విశ్రాంత ఇంజనీర్ల వేదిక సంయుక్త ప్రచారోద్యమం పంటలను బతికించుకోవడానికే కాదు.. గొడ్డూ గోదాను కాపాడుకోవడానికి.. చివరికి తమ ప్రాణం నిలుపుకోవడానికీ చుక్క నీరు దొరక్క అలో లక్ష్మణా అంటూ అన్నదాతలు అలమటిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉందో.. పరిష్కారం కూడా అక్కడే ఉంటుందంటారు పెద్దలు. కురిసే ప్రతి చినుకునూ ఒడిసి పట్టుకుంటే మనకు, జీవాలకు, పంటలక్కూడా శాశ్వతంగా నీటి కొరతన్న మాటే ఉండదంటున్నారు నిపుణులు. ఈ స్ఫూర్తిని అన్నదాతలందరి మనసుల్లో రగిలించి.. కార్యోన్ముఖులను చేయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సంయుక్తంగా ప్రచారోద్యమానికి శంఖం పూరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న కొన్ని జిల్లాల్లో వర్క్‌షాపులు వరుసగా రెండో ఏడాది కూడా నిర్వహించబోతున్నాం. గత ఏడాది వర్క్‌షాప్‌లలో పాల్గొన్న అనేకమంది రైతులు కందకాలు తవ్వుకుని లబ్దిపొందారు. ఈ ఏడాదీ మరికొందరు అన్నదాతలు ఉద్యమ స్ఫూర్తితో తమ పొలాల్లో కందకాలు తవ్వుకుంటారని.. ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాం.. కాలం మారిపోయింది. వాతావరణంలో పెనుమార్పు వచ్చింది. కార్తెల ప్రకారం వాన దేవుడు కరుణించడం అనుమానాస్పదంగా మారింది. స్థిమితంగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గింది. కుండపోత వర్షాల సంఖ్య పెరిగింది. ఉన్నట్టుండి విరుచుకుపడే అకాల వర్షాల సంఖ్య పెరిగింది. కొద్ది రోజుల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ అస్తవ్యస్థ పరిస్థితి వల్ల భూమిలోకి ఇంకే వాన నీటి శాతం తగ్గిపోయింది. అంటే.. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా ఆ వరద నీటిని సాధ్యమైనంత ఎక్కువగా భూమిలోకి ఇంకింప జేసుకోవడమే సర్వోత్తమం. ఇదే కరువుపై మనం చేసే పోరాటం. అందుకనే పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. కందకాలు తవ్వుకోవాలి. ఈ కందకాల లోతు అడుగో, అడుగున్నరో ఉంటే వరద నీటిని ఒడిసిపట్టలేం. కాబట్టి, కందకాల లోతు మీటరుండాలి. వెడల్పు కూడా మీటరుండాలి. పొడవు 25 మీటర్ల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత 5 మీటర్లు వదిలి.. అదే వరుసలో మరో కందకం తవ్వాలి. ఈ విధంగా వాన నీటిని కందకాల ద్వారా పొలం కిందే నిల్వ చేసుకోవాలి. చేను కిందే చెరువును సృష్టించుకొని సాగు నీటి భద్రతను కల్పించుకోవాలి. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా, బావుల ద్వారా తోడుకొని సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చు. చుక్క నీరు లేక పంట ఎండిపోయే దుర్భర నీటి దారిద్య్రాన్ని పారదోలడానికి ఇదే చక్కని దారి. చేను కిందే చెరువును సృష్టించుకోవాలంటే.. వర్షాలకు ముందే పొలంలో లోతైన కందకాలు తవ్వుకోవాలి. ఏయే పొలాల్లో కందకాలు తవ్వేదెలా? సమతల కందకాలు: పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. మీటరు లోతు, మీటరు వెడల్పున సమతల (ఒకే లెవల్) కందకాలను తవ్వుకోవాలి. కందకం పొడవు 25 మీటర్లుండాలి. తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి మరో కందకం తవ్వాలి. కందకంలో తవ్విన మట్టిని పొడవుగా ఒకే కట్టగా లోతట్టు వైపున పోయాలి. ఇలా చేస్తే కందకంలోకి వచ్చిన వాన నీరు పొర్లిపోకుండా ఉంటుంది. ఎర్రనేలలు: ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కానేలల్లో నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇటువంటి పొలాలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఒక వేళ ఎర్ర చల్కా చేను ఏటవాలుగా కాకుండా సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి. నల్లరేగడి నేలలు: ఈ నేలల్లో నీరు త్వరగా ఇంకదు. కాబట్టి ఈ నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ పొలాల్లో కందకాలతోనే సాగునీటి భద్రత వ్యవసాయానికి సాగు నీరు అందించడానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఖర్చుతో నదులపై ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఉంటాయి. అయితే, పాలకులు తలపెట్టిన ఒక ప్రాజెక్టు పూర్తయి, నీరు అందుబాటులోకి రావాలంటే చాలా సంవత్సరాలే గడచిపోతాయి. కాబట్టి, అన్ని ప్రాంతాల రైతులూ వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను ఒడిసిపట్టుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి. పొలంలో కందకాలు తవ్వుకొని ఈ సీజన్లోనే తమ పంటలకు సాగు నీటి భద్రత కల్పించుకోవచ్చు. చిన్నపాటి వర్షాలు కురిసినప్పుడు పొలంలో నుంచి వర్షపు నీరు పెద్దగా బయటకు పోదు. కానీ, భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా నీరు బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. అయితే, మీటరు లోతు, మీటరు వెడల్పున లోతైన కందకాలు తవ్వుకుంటే భారీ వర్షం కురిసినప్పుడు వరద నీటిని సైతం భూగర్భంలోకి ఇంకింపజేసుకోవచ్చు. ఖర్చు ఎకరానికి రూ. 2 వేలకు మించదు. రైతన్నలారా.. కదలండి..! - సంగెం చంద్రమౌళి (98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్ల వేదిక.


