
ఫ్యూసేరియం గ్రామినీరమ్ శిలీంధ్రం సోకి దెబ్బతిన్న గోధుమ, మొక్కజొన్న కంకులు
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్‌యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది.
శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్‌లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.
కొత్త వాతావరణమే సమస్య
ఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్‌నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు.
ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్‌ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అన్ని దేశాల్లోనూ ఉన్నదే!
‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు.
ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్‌బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.
దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!
శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.
ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్‌లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది.
చదవండి: జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట!
ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్‌బాబు.
మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం
చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్‌గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.
– డాక్టర్ బలిజేపల్లి శరత్‌బాబు,
అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,
మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం.