వాస్తవాదీన రేఖకు అతి సమీపంలో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం
పాంగాంగ్ సరస్సు తూర్పు అంచున నిర్మిస్తున్న చైనా
దీర్ఘశ్రేణి హెచ్‌క్యూ 9 క్షిపణులను మోహరించేలా ఏర్పాట్లు
శాటిలైట్ ద్వారా గుర్తించిన అమెరికా సంస్థ ఆల్‌సోర్స్ అనాలిసిస్
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్‌కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్‌ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది.
ఈ బేస్‌ను మొదట అమెరికాకు చెందిన ఆల్‌సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్‌ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్‌కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్‌లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది.
భారీ క్షిపణులకు కేంద్రంగా..
ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్‌లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్‌లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు.
అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి.
ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్‌క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్‌సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్‌ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్‌కు చెందిన ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్‌ఐఎన్‌టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది.
సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి.
మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్‌సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు.


