ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా చమురు కొనుగోళ్లు బంద్
భారత్ అంగీకరించిందని వ్యాఖ్య
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఇస్తున్న డబ్బులతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని ఆయన మండిపడుతున్నారు. ఈ కొనుగోళ్లను ఆపేయాల్సిందేనని అంటున్నారు. అదే విషయం మరోసారి స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పారు.
ఈ ఏడాది ఆఖరు నాటికి ఆ దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోతాయని పేర్కొన్నారు. అంటే కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనకుండా చైనాను ఒప్పించడానికి ప్రయతి్నస్తానని ట్రంప్ తెలిపారు. భారత్ బాటలో చైనా కూడా నడిస్తే బాగుంటుందని సూచించారు.
ఆయన బుధవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్ననే ఫోన్‌లో మాట్లాడాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, హఠాత్తుగా ఆపేయలేరు కాబట్టి కొంత సమయం పడుతుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయి. భారత్ గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది’’అని ఉద్ఘాటించారు. రష్యా చమురు విషయంలో ట్రంప్ పట్టుదలతో ఉన్నారు.
భారత్, చైనాలు రష్యాకు ఇచ్చే డబ్బులు ఆగిపోతే ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగుతుందని ఆయన తరచుగా చెబుతున్నారు. ఈ యుద్ధానికి ఆ రెండు దేశాలే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయని మండిపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బంద్ చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని భారత్ ఖండించింది. మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని తేల్చిచెప్పింది.
తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో మరో ఉద్దేశం లేదని వెల్లడించింది. తన మాట లెక్కచేయనందుకు భారతదేశ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. త్వరలో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కాబోతున్నానని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అది చమురు గానీ, ఇంధనం గానీ, ఇంకేదైనా గానీ రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన ప్రతిపాదనల పట్ల జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని వివరించారు.


