
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఏం చేయాలో ట్రంప్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు. ట్రంప్ అసత్యమైన, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.
భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనవసరమని థరూర్ అన్నారు. ఇది భారత స్వతంత్రతను, విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.
విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నేతగా, శశి థరూర్ మాట్లాడుతూ ..భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశం. ఇతర దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనైతికం’అని అన్నారు.