భారత్ పర్యటనకు నెతన్యాహు.. అమెరికాకు షాక్! | Israel Prime Minister Netanyahu will visit India soon | Sakshi
Sakshi News home page

భారత్ పర్యటనకు నెతన్యాహు.. అమెరికాకు షాక్!

Oct 20 2025 5:03 PM | Updated on Oct 20 2025 5:29 PM

Israel Prime Minister Netanyahu will visit India soon

జెరూసలేం: భారత్-ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్‌  ప్రధాని నెతన్యాహు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా ఒత్తిడిని పక్కనపెట్టి భారత్ వైపు అడుగులు
చైనా, భారత్, రష్యా వంటి దేశాలపై టారిఫ్‌ల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు దిగుతున్నారు. హమాస్‌తో యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌కు హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు తలొగ్గి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ముందుకు వచ్చింది. అయినప్పటికీ హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ.. ఆ సంస్థ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయే వరకు గాజాలో యుద్ధం ముగియదని ఆయన  స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో, అమెరికా ఒత్తిడిని పక్కనపెట్టి భారత్‌తో సత్సంబంధాలను మెరుగుపరచేందుకు ఇజ్రాయెల్ ప్రధాని భారత్‌లో పర్యటించనున్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

వ్యూహాత్మక రంగాల్లో సహకారం
నెతన్యాహు పర్యటన సందర్భంగా ఇరు దేశాలు శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఇప్పటికే ఇజ్రాయెల్, భారత్ మధ్య రక్షణ రంగంలో అనేక ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఈ పర్యటన ద్వారా వాటిని మరింత విస్తరించే అవకాశం ఉంది.

అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పాత్ర
ఈ పరిణామం ద్వారా భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను మరోసారి నిరూపించుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల సమయంలో భారత్‌తో ఇజ్రాయెల్ సత్సంబంధాలను మెరుపరచడం, భారత్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను సూచిస్తుంది.

ప్రపంచ వేదికపై భారత్‌ తన దౌత్య నైపుణ్యాన్ని సమర్థంగా ప్రదర్శిస్తోంది. అమెరికా టారిఫ్‌ బెదిరింపులకు వెనక్కి తగ్గకుండా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ..అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. ఇప్పటికే ఆప్తమిత్రుడిగా ఉన్న రష్యాతో చమురు కొనుగోలు ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకుంది.  

ఓ వైపు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజలకు మానవతా సహాయం అందిస్తూ, మరోవైపు ఇజ్రాయెల్‌తో సైనిక పరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటూ, సమతుల్యమైన దౌత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విధంగా, భారత్‌ తన అంతర్జాతీయ సంబంధాలను వ్యూహాత్మకంగా విస్తరించుకుంటూ, ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement