
భారత్‌లో కేసు విచారణ సవ్యంగా సాగదన్న మెహుల్ ఛోక్సీ వాదనను కొట్టేసిన బెల్జియం కోర్టు
మీ కోసం ముంబైలో అంతర్జాతీయ స్థాయి జైలుగది నిర్మించారని వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారతీయ న్యాయస్థానాల్లో తన కేసు విచారణ సవ్యంగా సాగదని, జుగుప్సాకర జైలు గదిలో రోగాలబారిన పడతానంటూ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ చేసిన వాదనలను బెల్జియం కోర్టు కొట్టేసింది. భారత్‌కు అప్పగించాక కేసు విచారణలో ఎలాంటి అన్యాయం జరగదని, ముంబైలో మీ కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కారాగార సెల్ నిర్మించారని ఆంట్‌వెర్ప్‌లోని అప్పీళ్ల కోర్టు వెల్లడించింది.
తనను భారత్‌కు అప్పగించడమనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అంటూ ఛోక్సీ చేసిన వాదనలనూ కోర్టు తోసిపుచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.13,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నేరస్థుడు ఛోక్సీని భారతీయ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్‌కు అప్పగించడం సబబేనంటూ గతేడాది ఆంట్‌వెర్ప్ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు కనిపించట్లేదని అప్పీళ్ల కోర్టు వ్యాఖ్యానించింది.
ఛోక్సీని తమకు అప్పగించాలంటూ ముంబై ప్రత్యేక కోర్టు 2018 మే, 2021 జూన్‌లో ఇచ్చిన ఉత్తుర్వులను అమలుచేయొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఛోక్సీని ఉద్దేశిస్తూ కోర్టు పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ మిమ్మల్ని భారతీయ ప్రభుత్వాధికారులకు అప్పగిస్తే ముంబై జైలులో అమానవీయంగా చిత్రహింసకు గురిచేస్తారన్న వాదనల్లో ఆధారాలు లేవు. భారత్‌లో మీకు న్యాయం లభించదన్న వాదనల్లో పస లేదు.
ఆంటిక్వా, బార్బుడా నుంచి భారతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కిడ్నాప్ చేశారన్న వాదనలకు ఎలాంటి ఆధారం లేదు. డొమినికా దేశంలో హింసించారన్న వాదన ఉత్తిదే అని మాకు అర్థమైంది. కేసుల విచారణలో భారతీయ న్యాయమూర్తులకు స్వతంత్రత లేదని, అందుకే మీ హక్కులు ఉల్లంఘనకు గురవుతాయన్న వాదనలకు బలం చేకూర్చే డాక్యుమెంట్లు ఏవీ లేవు. అందుకే మిమ్మల్ని తిరిగి భారత్‌కు అప్పగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ముంబై జైలులో చక్కటి సౌకర్యాలున్నాయి
ఈ సందర్భంగా భారతీయ దర్యాప్తు అధికారులు అందించిన వివరాలను కోర్టు గుర్తుచేసింది. ‘‘ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో మిమ్మల్ని ఉంచుతారు. 12వ నంబర్ బ్యారక్‌లో మీ కోసం ప్రత్యేకంగా రెండు గదులు నిర్మించారు. బ్యారక్ విస్తీర్ణం ఏకంగా 46 చదరపు మీటర్లు. విడిగా మీ కోసం టాయిలెట్ కట్టారు. ధారాళంగా స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడానికి మూడు పెద్దపెద్ద కిటికీలు పెట్టారు. పైన ఐదు వెంటిలేటర్లు నిర్మించారు. మూడు ఫ్యాన్లు, ఆరు పెద్ద ట్యూబ్‌లైట్లు బిగించారు.
వార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు చూసేందుకు ప్రత్యేకంగా కొత్త టీవీ అమర్చారు. ఈ గదుల్లోకి రావడానికి వెడల్పాటి కారిడార్‌ను కట్టారు. అనారోగ్యం, కేసు విచారణ కాకుండా ఇతర కారణాలతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్లబోరు. దర్యాప్తు సంస్థల పరిధిలో కాకుండా మిమ్మల్ని జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచుతారు’’ అని బెల్జియం కోర్టు వ్యాఖ్యానించింది. రూ.13,000 కోట్ల కుంభకోణంలో చోక్సీ ఒక్కడే రూ.6,400 కోట్లమేర మోసానికి పాల్పడినట్లు సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొనడం తెల్సిందే.