breaking news
appeals court
-
మీకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు
న్యూఢిల్లీ: భారతీయ న్యాయస్థానాల్లో తన కేసు విచారణ సవ్యంగా సాగదని, జుగుప్సాకర జైలు గదిలో రోగాలబారిన పడతానంటూ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ చేసిన వాదనలను బెల్జియం కోర్టు కొట్టేసింది. భారత్‌కు అప్పగించాక కేసు విచారణలో ఎలాంటి అన్యాయం జరగదని, ముంబైలో మీ కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కారాగార సెల్ నిర్మించారని ఆంట్వెర్ప్లోని అప్పీళ్ల కోర్టు వెల్లడించింది. తనను భారత్‌కు అప్పగించడమనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అంటూ ఛోక్సీ చేసిన వాదనలనూ కోర్టు తోసిపుచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.13,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నేరస్థుడు ఛోక్సీని భారతీయ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్‌కు అప్పగించడం సబబేనంటూ గతేడాది ఆంట్వెర్ప్ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు కనిపించట్లేదని అప్పీళ్ల కోర్టు వ్యాఖ్యానించింది. ఛోక్సీని తమకు అప్పగించాలంటూ ముంబై ప్రత్యేక కోర్టు 2018 మే, 2021 జూన్‌లో ఇచ్చిన ఉత్తుర్వులను అమలుచేయొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఛోక్సీని ఉద్దేశిస్తూ కోర్టు పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ మిమ్మల్ని భారతీయ ప్రభుత్వాధికారులకు అప్పగిస్తే ముంబై జైలులో అమానవీయంగా చిత్రహింసకు గురిచేస్తారన్న వాదనల్లో ఆధారాలు లేవు. భారత్‌లో మీకు న్యాయం లభించదన్న వాదనల్లో పస లేదు. ఆంటిక్వా, బార్బుడా నుంచి భారతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కిడ్నాప్ చేశారన్న వాదనలకు ఎలాంటి ఆధారం లేదు. డొమినికా దేశంలో హింసించారన్న వాదన ఉత్తిదే అని మాకు అర్థమైంది. కేసుల విచారణలో భారతీయ న్యాయమూర్తులకు స్వతంత్రత లేదని, అందుకే మీ హక్కులు ఉల్లంఘనకు గురవుతాయన్న వాదనలకు బలం చేకూర్చే డాక్యుమెంట్లు ఏవీ లేవు. అందుకే మిమ్మల్ని తిరిగి భారత్‌కు అప్పగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ముంబై జైలులో చక్కటి సౌకర్యాలున్నాయిఈ సందర్భంగా భారతీయ దర్యాప్తు అధికారులు అందించిన వివరాలను కోర్టు గుర్తుచేసింది. ‘‘ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో మిమ్మల్ని ఉంచుతారు. 12వ నంబర్ బ్యారక్‌లో మీ కోసం ప్రత్యేకంగా రెండు గదులు నిర్మించారు. బ్యారక్ విస్తీర్ణం ఏకంగా 46 చదరపు మీటర్లు. విడిగా మీ కోసం టాయిలెట్ కట్టారు. ధారాళంగా స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడానికి మూడు పెద్దపెద్ద కిటికీలు పెట్టారు. పైన ఐదు వెంటిలేటర్లు నిర్మించారు. మూడు ఫ్యాన్లు, ఆరు పెద్ద ట్యూబ్‌లైట్లు బిగించారు. వార్తలు, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు చూసేందుకు ప్రత్యేకంగా కొత్త టీవీ అమర్చారు. ఈ గదుల్లోకి రావడానికి వెడల్పాటి కారిడార్‌ను కట్టారు. అనారోగ్యం, కేసు విచారణ కాకుండా ఇతర కారణాలతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్లబోరు. దర్యాప్తు సంస్థల పరిధిలో కాకుండా మిమ్మల్ని జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచుతారు’’ అని బెల్జియం కోర్టు వ్యాఖ్యానించింది. రూ.13,000 కోట్ల కుంభకోణంలో చోక్సీ ఒక్కడే రూ.6,400 కోట్లమేర మోసానికి పాల్పడినట్లు సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొనడం తెల్సిందే. -
టారిఫ్‌లు అక్రమం
వాషింగ్టన్: శత్రుదేశాలు, మిత్ర దేశాలు అనే తేడా లేకుండా ఎడాపెడా టారిఫ్‌ల వాతలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి అప్పీళ్ల కోర్టు షాక్ ఇచ్చింది. అధికారాలను మితిమీరి వాడేశారని, ఇలా టారిఫ్‌లు పెంచడం పూర్తిగా అక్రమమని వాషింగ్టన్‌లోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్’శుక్రవారం తీర్పు చెప్పింది. ‘‘ప్రపంచంలోని ప్రతి దేశంపై ఇష్టారీతిన అంతర్జాతీయ టారిఫ్‌లు పెంచేసే అధికారం, అర్హత అధ్యక్షుడికి లేవు’’అని జడ్జీలు 7–4 మెజారీ్టతో తీర్పు చెప్పారు. అధిక టారిఫ్‌లను తప్పుబడుతూ మేలో న్యూయార్క్‌లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును మేం సమర్థిస్తున్నామని మెజారిటీ జడ్జీలు తమ తీర్పులో అభిప్రాయపడ్డారు. అమెరికా అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) ప్రకారమే ఈ టారిఫ్‌లు పెంచామన్న ట్రంప్ ప్రభుత్వం చేసిన వాదనలను జడ్జీలు తోసిపుచ్చారు. ఐఈఈపీఏ చట్టానికి విరుద్దంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకున్నారు. అధికారాలను మితిమీరి ఉపయోగించారు. ఇలా భూగోళం మీది ప్రతి ఒక్క దేశంపై టారిఫ్ మోపకూడదు. పెంచిన టారిఫ్‌లను తొలగిస్తే ఇప్పటికిప్పుడే అమెరికా ఆర్థికవ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. అందుకే అక్టోబర్ 14వ తేదీదాకా యథాతథ స్థితిని కొనసాగిస్తాం. ఆలోపు ఈ కేసును యూఎస్ సుప్రీంకోర్టు పరిశీలించాలని కోరుతున్నాం’’అని 127 పేజీల తీర్పులో అప్పీళ్ల కోర్టు తెలిపింది. తీర్పుపై దుమ్మెత్తిపోసిన ట్రంప్ తన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెలువడిన కోర్టు తీర్పుపై వెంటనే ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆరోపణలు గుప్పించారు. ‘‘తీర్పు తర్వాత సైతం నేను విధించిన టారిఫ్‌లు ఇంకొన్ని రోజులు అమల్లోనే ఉండబోతున్నాయి. పక్షపాతధోరణితోనే అప్పీళ్ల కోర్టు టారిఫ్‌లను తప్పుబట్టింది. అప్పీళ్ల కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టులో గెలిచి తీరతాం. చివరకు గెలిచేది మేమే. ఒకవేళ టారిఫ్‌లను తొలగిస్తే దేశంలో వినాశనం తప్పదు. అది మన ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది. వాస్తవానికి మన వ్యవస్థ బలీయంగా ఉండాలి. శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా మనపై విదేశాలు మోపిన టారి ఫ్ల భారాన్ని, వాణిజ్య లోటును అమెరికా సహించబోదు. విదేశాల విధానాలతో మన తయారీసంస్థలు, రైతులుసహా ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారు. మన కార్మికులతోపాటు కర్మాగారాలను పరిరక్షించాలంటే విదేశాలపై టారిఫ్‌లను పెంచడమే అత్యుత్తమ మార్గం’’అని ట్రంప్ అన్నారు.ఇప్పుడేం జరగొచ్చు? అప్పీళ్ల కోర్టులో కేసును ఓడిపోవడంతో ట్రంప్ వెంటనే యూఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అక్కడే ట్రంప్ సర్కార్‌కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్ సుప్రీంకోర్టులోని 9 మంది జడ్జీల్లో ఆరుగురిని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వాలే నియమించాయి. ఈ ఆరుగురిలో ముగ్గురిని స్వయంగా ట్రంప్ నియమించారు. వీరంతా ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశముంది. అయితే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పోలిస్తే స్వయంగా అధ్యక్షుడు కలుగజేసుకున్న కేసులను యూఎస్ సుప్రీంకోర్టు మరింత నిశితంగా పరిశీలించే వీలుంది. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)ను కాదని సొంతంగా తీసుకున్న నిర్ణయాలతో వెలువర్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు పారదర్శకంగా వ్యవహరిస్తే ఈ కేసు ఫలితం ఎటువైపు రానుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. ఒకవేళ సుప్రీంకోర్టు సైతం ట్రంప్ టారిఫ్‌లు చట్టవ్యతిరేకమని తేలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. అదనపు టారిఫ్‌ల కింద వసూలుచేసిన వందల బిలియన్ డాలర్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. -
మాల్యా అప్పీల్‌పై విచారణకు హైకోర్టు ఓకే
లండన్: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఊరట లభించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే నిర్ణయం తీసుకుంటూ గతంలో బ్రిటన్ హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై మాల్యా చేసుకున్న అప్పీల్‌ను విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. మాల్యా అప్పీల్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అన్న విషయంపై జస్టిస్ జార్జ్ లెగ్గాట్ట్, జస్టిస్ ఆండ్రూ పాపుల్‌వెల్‌ల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తాము అప్పీల్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. మాల్యా తరఫున న్యాయవాది క్లారీ మోంట్‌గోమెరీ వాదనలు వినిపించగా, భారత హై కమిషన్ కార్యాలయ అధికారులు, మాల్యా భాగస్వామి పింకీ లల్వానీ, కొడుకు సిద్ధార్థ్‌లు కూడా కోర్టుకు వచ్చారు. మాల్యా అప్పీల్ పిటిషన్‌ను కోర్టు తదుపరి రోజుల్లో విచారించనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం అప్పు తీసుకుని, బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను బ్రిటన్ పోలీసులు 2017 ఏప్రిల్‌లోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన అక్కడే బెయిల్‌పై ఉంటున్నారు. అప్పటి నుంచి మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగానే మాల్యా రుణాలను ఎగ్గొట్టారనడానికి ఆధారాలు ఉన్నాయని గతేడాది డిసెంబర్లోనే లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తేల్చింది. దీంతో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ హోం శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. -
ట్రంప్‌కు మరో కోర్టు షాక్!
న్యూయార్క్: అమెరికాలోకి ప్రవేశించే ఏడు ముస్లిం దేశాల పౌరులపై కఠిన ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ట్రావెల్ బ్యాన్ అమలు చేసేందుకు నిరాకరిస్తూ అప్పీల్ కోర్టు తీర్పు వెల్లడించింది. అప్పీల్ కోర్టు వెల్లడించిన ఈ తీర్పుపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం న్యాయస్థానాల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలు దేశభద్రతను పణంగా పెట్టాయని ఆయన విమర్శలు చేస్తున్నారు. అప్పీల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ ట్రంప్ స్పష్టం చేశారు.


