
అమెరికా అప్పీళ్ల కోర్టు సంచలన తీర్పు
ట్రంప్‌కు శరాఘాతం
యూఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ట్రంప్ సర్కార్
వాషింగ్టన్: శత్రుదేశాలు, మిత్ర దేశాలు అనే తేడా లేకుండా ఎడాపెడా టారిఫ్‌ల వాతలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి అప్పీళ్ల కోర్టు షాక్ ఇచ్చింది. అధికారాలను మితిమీరి వాడేశారని, ఇలా టారిఫ్‌లు పెంచడం పూర్తిగా అక్రమమని వాషింగ్టన్‌లోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్’శుక్రవారం తీర్పు చెప్పింది.
‘‘ప్రపంచంలోని ప్రతి దేశంపై ఇష్టారీతిన అంతర్జాతీయ టారిఫ్‌లు పెంచేసే అధికారం, అర్హత అధ్యక్షుడికి లేవు’’అని జడ్జీలు 7–4 మెజారీ్టతో తీర్పు చెప్పారు. అధిక టారిఫ్‌లను తప్పుబడుతూ మేలో న్యూయార్క్‌లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును మేం సమర్థిస్తున్నామని మెజారిటీ జడ్జీలు తమ తీర్పులో అభిప్రాయపడ్డారు.
అమెరికా అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) ప్రకారమే ఈ టారిఫ్‌లు పెంచామన్న ట్రంప్ ప్రభుత్వం చేసిన వాదనలను జడ్జీలు తోసిపుచ్చారు. ఐఈఈపీఏ చట్టానికి విరుద్దంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకున్నారు. అధికారాలను మితిమీరి ఉపయోగించారు. ఇలా భూగోళం మీది ప్రతి ఒక్క దేశంపై టారిఫ్ మోపకూడదు. పెంచిన టారిఫ్‌లను తొలగిస్తే ఇప్పటికిప్పుడే అమెరికా ఆర్థికవ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. అందుకే అక్టోబర్ 14వ తేదీదాకా యథాతథ స్థితిని కొనసాగిస్తాం. ఆలోపు ఈ కేసును యూఎస్ సుప్రీంకోర్టు పరిశీలించాలని కోరుతున్నాం’’అని 127 పేజీల తీర్పులో అప్పీళ్ల కోర్టు తెలిపింది.
తీర్పుపై దుమ్మెత్తిపోసిన ట్రంప్
తన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెలువడిన కోర్టు తీర్పుపై వెంటనే ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆరోపణలు గుప్పించారు. ‘‘తీర్పు తర్వాత సైతం నేను విధించిన టారిఫ్‌లు ఇంకొన్ని రోజులు అమల్లోనే ఉండబోతున్నాయి. పక్షపాతధోరణితోనే అప్పీళ్ల కోర్టు టారిఫ్‌లను తప్పుబట్టింది. అప్పీళ్ల కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టులో గెలిచి తీరతాం. చివరకు గెలిచేది మేమే.
ఒకవేళ టారిఫ్‌లను తొలగిస్తే దేశంలో వినాశనం తప్పదు. అది మన ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది. వాస్తవానికి మన వ్యవస్థ బలీయంగా ఉండాలి. శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా మనపై విదేశాలు మోపిన టారి ఫ్‌ల భారాన్ని, వాణిజ్య లోటును అమెరికా సహించబోదు. విదేశాల విధానాలతో మన తయారీసంస్థలు, రైతులుసహా ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారు. మన కార్మికులతోపాటు కర్మాగారాలను పరిరక్షించాలంటే విదేశాలపై టారిఫ్‌లను పెంచడమే అత్యుత్తమ మార్గం’’అని ట్రంప్ అన్నారు.
ఇప్పుడేం జరగొచ్చు?
అప్పీళ్ల కోర్టులో కేసును ఓడిపోవడంతో ట్రంప్ వెంటనే యూఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అక్కడే ట్రంప్ సర్కార్‌కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్ సుప్రీంకోర్టులోని 9 మంది జడ్జీల్లో ఆరుగురిని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వాలే నియమించాయి. ఈ ఆరుగురిలో ముగ్గురిని స్వయంగా ట్రంప్ నియమించారు. వీరంతా ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశముంది.
అయితే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పోలిస్తే స్వయంగా అధ్యక్షుడు కలుగజేసుకున్న కేసులను యూఎస్ సుప్రీంకోర్టు మరింత నిశితంగా పరిశీలించే వీలుంది. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)ను కాదని సొంతంగా తీసుకున్న నిర్ణయాలతో వెలువర్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు పారదర్శకంగా వ్యవహరిస్తే ఈ కేసు ఫలితం ఎటువైపు రానుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. ఒకవేళ సుప్రీంకోర్టు సైతం ట్రంప్ టారిఫ్‌లు చట్టవ్యతిరేకమని తేలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. అదనపు టారిఫ్‌ల కింద వసూలుచేసిన వందల బిలియన్ డాలర్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.