
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), బ్యాటరీ ఉత్పత్తి రంగాలలో భారత్ అందిస్తున్న సబ్సిడీలు (EV Battery Subsidies) దేశీయ పరిశ్రమలకు అన్యాయంగా లాభాన్ని కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ చైనా (China) బుధవారం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద ఫిర్యాదు చేసింది. చైనా చేసిన ఫిర్యాదు వివరాలను త్వరలో పరిశీలిస్తామని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారత్ ‘ నేషనల్ క్రిటికల్ మినరల్ స్టాక్ పైల్’ (NCMS) కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిసిన వెంటనే చైనా ఈ ఫిర్యాదు చేసింది. ఈ స్కీం లక్ష్యం అరుదైన భూ మూలకాలు (rare earth elements) వంటి కీలక ఖనిజాల లభ్యతను మెరుగుపరచడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం. ఈ మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, ఇతర గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు కీలకం కావటంతో, వాటి ఎగుమతిపై ఆంక్షలు విధించాలని చైనా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఇతర దేశాలపైనా..
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్‌తో పాటు తుర్కియే, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా ఈ తరహా ఫిర్యాదులు డబ్ల్యూవో వద్ద నమోదయ్యాయి. డబ్ల్యూవో నిబంధనల ప్రకారం మొదటి దశలో చర్చల ద్వారానే వివాద పరిష్కారం వెతకాలి. చర్చలు ఫలితం ఇవ్వకపోతే, సమస్యపై తీర్పునిచ్చే ప్యానెల్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.
ఈ విషయంపై స్పందించిన భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్.. చైనా సమర్పించిన వివరాలను త్వరలో అధ్యయనం చేస్తామని తెలిపారు. చర్చలతో పరిష్కారం సాధించే దిశగా భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
ఇక వాణిజ్య సంబంధాల పరంగా చైనా భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే 2023-24లో చైనాకు భారత ఎగుమతులు 14.5% తగ్గి 14.25 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనాతో దిగుమతులు 11.52% పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.