
కేరళ ఆయుర్వేద ఆస్పత్రిలో వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో కన్నుమూత
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంతాపాలు
పుష్కరకాలంగా విపక్షనేతగా సేవలందిస్తున్న మాజీ ప్రధాని
నైరోబీ: కెన్యా రాజకీయాలపై తనదైన చెరగని ముద్రవేసిన దిగ్గజ విపక్ష నేత, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడిన్గా తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయసులో ఆయుర్వేద చికిత్స కోసం ఇటీవల ఆయన భారత్‌కు విచ్చేశారు. కేరళలోని కొత్తట్టుకులంలోని దేవమాత ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఆస్పత్రి ప్రాంగణంలో ఉదయపు నడకకు ఒడిన్గా బయల్దేరగా గుండెపోటుతో కుప్పకూలారు.
అక్కడే ఉన్న ఆయన కుమార్తె, సోదరి, వ్యక్తిగత వైద్యుడు, భారత, కెన్యా భద్రతాధికారులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా అప్పటికే ఆయన కన్నుమూశారని వైద్యులు ధ్రువీకరించారు. గత 12 సంవత్సరాలుగా కెన్యా పార్లమెంట్‌లో విపక్షనేతగా కొనసాగుతున్న ఒడిన్గా దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. అజీమియో లా ఉమోజా(వన్ కెన్యా) కూటమి పార్టీకి సారథ్యంవహిస్తున్నారు.
ఒడిన్గా మరణ వార్త తెల్సి కెన్యా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. దేశ ప్రజాస్వామ్యాన్ని పటిష్టంచేసేందుకు అవిశ్రాంతంగా పోరాడిన తమ నేత లేడన్న వార్త తెలిసి నైరోబీలోని ఆయన సొంతింటికి జనం పోటెత్తారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సైతం ఒడిన్గా నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. మరణం పట్ల భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.
‘‘నిలువెత్తు దార్శనికుడు నేలకొరిగారు’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. కెన్యా ప్రజాస్వామ్యం కోసం పాటుపడిన గొప్పనేత ఒడిన్గా అంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసా, టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహూ సహా పలువురు ప్రపంచనేతలు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. కెన్నెత్ మతిబా తర్వాత బహుళ రాజకీయపార్టీల కెన్యా ప్రజాస్వామ్యంలో ఒడిన్గాను మరో జాతిపితగా పలువురు కొనియాడతారు.
అత్యంత ప్రజాదరణ నేతగా పేరు
ఇటీవలి దశాబ్దాల్లో ఒడిన్గా కెన్యా రాజకీయాల్లో ముఖ్యనేతగా ఎదిగారు. కెన్యా స్వాతంత్య్రం సాధించాక తొలి ఉపాధ్యక్షుడిగా సేవలందించిన జరమోగు అజుమా ఒడిన్గా కుమారుడే ఈ ఒడిన్గా. కెన్యాలోని కిసుము నగరంలో 1945 జనవరి 7న జన్మించారు. రాజకీయ కుటుంబంలో జన్మించిన ఈయన చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. జర్మనీలో ఇంజనీరింగ్ చదివారు.
రాజకీయాల్లోకి రాకముందు కెన్యా నాణ్యతా ప్రమాణాల సంస్థకు మేనేజర్‌గా పనిచేశారు. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అయితే కేంద్రప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై అరెస్టయి జైలు జీవితం గడిపారు. 1997లో తొలిసారిగా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత దేశబహిష్కరణకు గురై యూరప్‌లో గడిపారు.
1992లో స్వదేశానికి తిరిగొచ్చారు. తర్వాత సైతం నాలుగుసార్లు ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చినా అధ్యక్ష పగ్గాలు చేపట్టలేకపోయారు. 2007లో స్వల్ప తేడాలో పదవి దక్కకపోవడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రోజుల తరబడి జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల మంది చనిపోయారు. కానీ ఈయనపై ఎలాంటి ఆరోపణలు రాకపోవడం విశేషం. ఘర్షణలు సద్దుమణిగాక 2008 నుంచి 2013దాకా కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిగా సేవలందించారు. యువకునిగా ఉన్నప్పుడు నైరోబీలోని గోర్ మహియా ఫుట్‌బాల్ క్లబ్ తరఫున కొంతకాలం ఫుట్‌బాల్ సైతం ఆడారు.