
గత ఏడాది కంటే పడిపోయిన స్థానం
సింగపూర్: భారత పాస్‌పోర్టు స్థానం గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 85వ ర్యాంకు దక్కించుకుంది. భారత పాస్‌పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌలభ్యం ఉంది. గత ఏడాది ఇదే ఇండెక్స్‌లో 80వ ర్యాంకు లభించింది. అప్పట్లో 62 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌకర్యం ఉండేది. ఏడాది కాలంలో 5 స్థానాలు పడిపోయినట్లు స్పష్టమవుతోంది.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా సింగపూర్ పాస్‌పోర్టు తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ పాస్‌పోర్టు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ జాబితాలో దక్షిణ కొరియా పాస్‌పోర్టుకు రెండో ర్యాంకు దక్కింది. దీంతో 190 దేశాలకు వీసాతో నిమిత్తం లేకుండా వెళ్లే వీలుంది. మూడో స్థానంలో ఉన్న జపాన్ పాస్‌పోర్టుతో 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ పాస్‌పోర్టులు నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. వీటితో 188 దేశాలకు వీసా–ఫ్రీ సౌలభ్యం ఉంది.