breaking news
Henley Passport Index
-
ఇండియా పాస్‌పోర్ట్ పవర్ తగ్గిందా?
ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌ల బలాన్ని అంచనా వేసే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 (జూలై ఎడిషన్)లో భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ మరోసారి పడిపోయింది. ఫిబ్రవరిలో 75వ స్థానానికి చేరిన భారత్, మేలో 78వ స్థానానికి జారగా, తాజాగా 81వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 55 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. ఈ ర్యాంకింగ్ 199 దేశాల పాస్‌పోర్ట్‌లను, 227 గమ్యస్థానాలకు ఉన్న వీసా సౌకర్యాల ఆధారంగా రూపొందించారు.ఈ ఏడాది ప్రారంభంలో భారత్ 85వ స్థానంలో ఉండగా, ఫిబ్రవరిలో ఒక్కసారిగా 75వ స్థానానికి ఎగబాకింది. అయితే తరువాతి నెలల్లో ఇతర దేశాల వీసా విధానాల్లో వచ్చిన మార్పులు, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాల పునర్వ్యవస్థీకరణ ప్రభావంతో భారత్ మళ్లీ క్రమంగా దిగజారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హెన్లీ ఇండెక్స్‌లో ర్యాంకు మార్పు అనేది ఒక దేశానికి లభించే వీసా-రహిత గమ్యస్థానాల సంఖ్యతో పాటు ఇతర దేశాల పనితీరుపైనా ఆధారపడి ఉంటుంది.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 20వ వార్షికోత్సవ ఎడిషన్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సగటు పాస్‌పోర్ట్‌కు 2006లో 58 గమ్యస్థానాలకు మాత్రమే వీసా-రహిత ప్రవేశం ఉండగా, ప్రస్తుతం అది 108 గమ్యస్థానాలకు పెరిగింది. ఈ ఇండెక్స్‌ను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) టిమాటిక్ డేటా ఆధారంగా రూపొందిస్తారు.ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్ పౌరులు 192 గమ్యస్థానాలకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. యూఏఈ ఈ ఏడాది అత్యధిక పురోగతి సాధించి మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌ను చేరుకుంది. మరోవైపు అమెరికా 10వ స్థానంలో కొనసాగుతోంది. -
పాస్పోర్టూ పనికిరాదా?
ప్రపంచంలో ఏ దేశం పాస్‌పోర్టు శక్తిమంతమైందో లెక్కేసిచెప్పే హెన్లే పాస్‌పోర్టు ఇండెక్స్ (హెచ్పీఐ)... మన పాస్‌పోర్టు 75వ స్థానంలో ఉందంటూ ఈ ఏడాది మొదట్లో నిర్ధారించింది. ‘హమ్మయ్య... నిరుటితో పోలిస్తే పదిమెట్లు పైకొచ్చాం’ అని మన పౌరులు గర్వపడి ఆర్నెల్లు కాకుండానే దానికేమీ పెద్దగా విలువలేదనీ, భారత పౌరసత్వానికి అదేమీ రుజువు కాబోదనీ మన విదేశాంగ శాఖ తేల్చిచెప్పి, ఆ సంతోషంపై నీళ్లు చల్లింది. ‘ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు... గత పుష్కరకాలంలోని నిర్ణయం కానేకాదు. 1967 నాటి పాస్‌పోర్టు చట్టమే ఆ మాట చెప్పిం’దని సెలవిస్తోంది. గత కాలపు నిర్ణయం అయినంత మాత్రాన ఏదైనా శిరోధార్యమవుతుందా... దాన్ని సమీక్షించటం, మార్చటం అసాధ్యమా అన్న ప్రశ్నలు సహజంగానే అందరిలో తలెత్తుతున్నాయి. ఈమధ్యకాలంలో ఎన్నికల సంఘం (ఈసీ) ధర్మమా అని పౌరసత్వంపై ప్రజానీకంలో ఆందోళన బయల్దేరింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బిహార్‌లో మొదలై పలు రాష్ట్రాల్లో సాగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కావలసినంత కలవరపాటును సృష్టించింది.ఇంకా సృష్టిస్తోంది. పౌరులమని నిరూపించుకునే పత్రాలు సమర్పిస్తేనే ఓటు ఉంటుందనటంవల్ల పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోయారు. యూపీలో అలాంటివారు రెండు కోట్ల పైమాటే. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోవటం తక్షణ ప్రమాదమైతే... దేశంలో నివసించటం అసాధ్యమయ్యే స్థితి ఏర్పడటం మున్ముందు ఎదురయ్యే ముప్పు. ఈ దేశ పౌరులని ఈసీ నమ్మితేనే ఎవరికైనా ఓటుహక్కు లభిస్తుంది. అలాగని ఓటర్ గుర్తింపు కార్డు పౌరసత్వానికి రుజువు కాబోదని ప్రభుత్వమే చెబుతోంది. ఇప్పుడు పాస్‌పోర్టు సైతం ఆ ఖాతాలో చేరింది.పదిహేనేళ్ల క్రితం మహారాష్ట్రలోని తెంబ్లీలో ఆధార్‌ను లాంఛనంగా ప్రారంభించి నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమనీ, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినా వుంటుందనీ అన్నారు. నిరుపేదలకు ఏ గుర్తింపు కార్డూ లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించామని కూడా చెప్పారు. తీరా సర్ ప్రక్రియ సమయంలో అది చెల్లుబాటు కాబోదని ఈసీ తేల్చి చెప్పింది. అటుపై సుప్రీంకోర్టు అనుమతించిన 12 పత్రాల్లో పాస్‌పోర్టు కూడా ఉండటం చాలామందికి ఊరటనిచ్చింది. ఇప్పుడు పాస్‌పోర్టు కూడా పౌరసత్వాన్ని నిర్ధారించటానికి పనికిరాదనటం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. అవధానాల్లో ఆశువుగా పద్యం చెప్పే అవధానికి ‘నిషిద్ధాక్షరి’ మాటున పృచ్ఛకుడు అడుగడుగునా అడ్డుతగులుతూ, ప్రతి పదంలోనూ అక్షరాలను నిషేధిస్తూ ముప్పు తిప్పలు పెడతాడు. వీటన్నిటినీ అధిగమించి ఛందోబద్ధంగా అందమైన పద్యాన్ని అల్లటం అవధాని పద సంపదకు పరీక్ష. పౌరసత్వం విషయంలో దేశ పౌరులకు ఇలాంటి పరీక్షే ఎదురవుతోంది. ఏ పత్రం దాఖలు చేద్దామనుకున్నా అది పనికిరాదని చెప్పటం తప్ప, పనికొచ్చేదేమిటో పాలకులు నిర్ధారణగా చెప్పరు. ఇందువల్ల సామాన్యుల్లో అభద్రతా భావన ఏర్పడటం తప్ప సాధిస్తున్నదేమిటి? పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 6(2)(ఏ) ఈ దేశ పౌరుడుకాని వ్యక్తికి పాస్‌పోర్టు నిరాకరించాలని స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టే వేరే దేశాలకు ప్రమాణం. దాన్నిబట్టే వీసాలు జారీ అవుతాయి. అది పనికిరాదంటే ఆ దేశాలు అడుగుపెట్టనిస్తాయా?హెచ్పీఐ ర్యాంకులు సాధారణమైనవేం కాదు. ప్రపంచంలో సింగపూర్ పాస్‌పోర్టును మొత్తం 192 దేశాలు గుర్తించి, వీసా అవసరం లేకుండానే తమ భూభాగాల్లో అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నాయి. అందువల్లే అది ప్రథమ స్థానంలో ఉంది. 187 దేశాల గుర్తింపుతో జపాన్, దక్షిణ కొరియాలు... 186 దేశాల గుర్తింపుతో స్వీడన్, యూఏఈలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అలా చూస్తే మన పాస్‌పోర్టుకు 56 దేశాల గుర్తింపు మాత్రమే ఉంది. ఇతరచోట్లకు వెళ్లాలంటే వీసా కావాలి. వారు సైతం పాస్‌పోర్టు ఆధారంగానే వీసా జారీచేస్తారు. ఇప్పుడు విదేశాంగశాఖ తకరారుతో అంతర్జాతీయంగా ఎవరైనా తలుపులు మూస్తే మన పౌరుల గతేమిటి? ఎన్నో దేశాల్లో అన్నిటికీ చెల్లుబాటయ్యే కార్డు జారీ విధానం దశాబ్దాల క్రితమే అమల్లోకొచ్చింది. మనం మాత్రం అభద్రతాభావంతో పౌరులకు అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్నాం. ఇది సబబేనా? -
భారత పాస్‌పోర్టుకు 85వ ర్యాంకు
సింగపూర్: భారత పాస్‌పోర్టు స్థానం గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 85వ ర్యాంకు దక్కించుకుంది. భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌలభ్యం ఉంది. గత ఏడాది ఇదే ఇండెక్స్‌లో 80వ ర్యాంకు లభించింది. అప్పట్లో 62 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌకర్యం ఉండేది. ఏడాది కాలంలో 5 స్థానాలు పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా సింగపూర్ పాస్‌పోర్టు తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ పాస్‌పోర్టు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ జాబితాలో దక్షిణ కొరియా పాస్‌పోర్టుకు రెండో ర్యాంకు దక్కింది. దీంతో 190 దేశాలకు వీసాతో నిమిత్తం లేకుండా వెళ్లే వీలుంది. మూడో స్థానంలో ఉన్న జపాన్ పాస్పోర్టుతో 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ పాస్‌పోర్టులు నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. వీటితో 188 దేశాలకు వీసా–ఫ్రీ సౌలభ్యం ఉంది. -
మోస్ట్ పవర్ ఫుల్ పాస్పోర్ట్స్ లిస్ట్ : టాప్‌లో సింగపూర్, మరి ఇండియా?
ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాను ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ విడుదల చేసింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) ర్యాంకింగ్ డేటా ఆధారంగా దీన్ని రూపొందించింది. ఈ తాజా ర్యాంకింగ్‌లో భారతదేశానికి చెందిన పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. అంటే గతంతో పోలిస్తే భారత్ మూడు స్థానాలు పైకి ఎగబాకింది .ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన దేశం 85వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు ప్రయాణించవచ్చు. గతంలోఈ అనుమతి 59 దేశాలకు ఉండేది. సింగపూర్ టాప్ సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఈ జాబితా ప్రకారం 195 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను అందిస్తోంది. జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ , స్పెయిన్ రెండో స్థానంలో ఉన్నాయి. పాస్‌పోర్ట్ హోల్డర్లకు 192 దేశాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఆ తర్వాత, ర్యాంకింగ్‌లో మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా ,స్వీడన్లు 191 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్ , స్విట్జర్లాండ్లతో పాటు యునైటెడ్ కింగ్డమ్ నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా పోర్చుగల్ 5వ స్థానాన్ని పంచుకోగా, అమెరికా 186 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. సెనెగెల్, తజకిస్థాన్ దేశాలు 82వ స్థానంలోఉన్నాయి. పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక ఈ జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో అఫ్గానిస్థాన్ ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగినవారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చు. 2024 అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల టాప్ -10 జాబితాసింగపూర్ (195 గమ్యస్థానాలు)ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ (192)ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191)బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (190)ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189)గ్రీస్, పోలాండ్ (188)కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187)అమెరికా (186)ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185)ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184) -
ఫ్రాన్స్ పాస్‌పోర్టు చాలా పవర్ఫుల్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంక్స్–2024’ ఈ మేరకు పేర్కొంది. ఇందులో భారత పాస్‌పోర్టు 85వ స్థానంలో ఉంది. 2023 కంటే ఈసారి ఒక స్థానం పడిపోయింది. గతేడాది ఇండియా పాస్పోర్టుతో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలుండేది. ఈ ఏడాది అది 62కు పెరిగినా ర్యాంకు మాత్రం పడిపోయింది! అత్యంత శక్తివంతమైన ఫ్రాన్స్ పాస్‌పోర్టు కలిగి ఉంటే 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ తర్వాత జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ నిలిచాయి. పాకిస్తాన్ పాస్‌పోర్టు ఈసారి కూడా 106వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పాస్‌పోర్టు ర్యాంకు 101 నుంచి 102కు పడిపోయింది. చిన్నదేశమైన మాల్దీవుల పాస్‌పోర్టు ర్యాంకు 58. ఈ పాస్‌పోర్టు ఉంటే 96 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్(ఐఏటీఏ) డేటా ఆధారంగా పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తుంటారు. ఇందుకోసం గత 19 ఏళ్ల డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 199 పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తారు. వీసా లేకున్నా తమ దేశంలో పర్యటించే అవకాశం కలి్పస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2006లో సగటున 58 దేశాల్లో వీసా రహిత ప్రయాణ సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 111కు చేరింది. -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే.. భారత్‌కు ఎన్నో స్థానం అంటే
న్యూఢిల్లీ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా 194 ప్రపంచ దేశాల్లో ప్రయాణించొచ్చు. ➦ఈ దేశాల తర్వాత ఫిన్లాండ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 193 దేశాల్ని చుట్టి రావొచ్చు. ➦భారత్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకపోయినా 62 దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉండడంతో హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జాబితాలో 85వ స్థానాన్ని దక్కించుకుంది. ఇండోనేషియా, మలేషియా,థాయిలాండ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు భారతీయులకు వీసా అవసరలేదు. అయితే హెన్లీ ఇండెక్స్‌లో భారత్ గతేడాది 84వ స్థానంతో పోలిస్తే భారత్ ఒక ర్యాంక్ దిగజారడం గమనార్హం. ➦దక్షిణాఫ్రికా (55), మాల్దీవులు (58), సౌదీ అరేబియా (63), చైనా (64), థాయిలాండ్ (66), ఇండోనేషియా (69), ఉజ్బెకిస్థాన్ (84) వంటి దేశాల కంటే భారత్ వెనుకబడి పోయింది. ➦భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ సూచీలో 106వ స్థానంలో ఉండగా, శ్రీలంక 101వ స్థానంలో, బంగ్లాదేశ్ 102వ స్థానంలో, నేపాల్ 103వ స్థానంలో నిలిచాయి. ➦వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించే అర్హత ఉన్న పాస్‌పోర్ట్‌ల జాబితాలో యూకే, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియాలు ఇండెక్స్‌లో మూడవ స్థానంలో ఉంది. ఆ దేశాల తర్వాత మూడు యూరోపియన్ దేశాలు బెల్జియం, నార్వే, పోర్చుగల్, 191 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో నాల్గవ స్థానాన్ని ఆక్రమించాయి. ➦ఆస్ట్రేలియా, గ్రీస్, మాల్టా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్‌లు 190 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్న తర్వాత ఇండెక్స్‌లోని మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ➦ప్రపంచంలోని అత్యంత వలసలు ఎక్కువగా ఉన్న దేశాలలో ఒకటి కెనడా కాగా, దాని పొరుగున ఉన్న అమెరికా, రెండు యూరోపియన్ దేశాలైన పోలాండ్, చెకియాతో పాటు ఆరవ స్థానంలో ఉంది. ➦అమెరికా, కెనడా, పోలాండ్, చెకియా 189 దేశాలకు వీసా రహిత ప్రాప్యతను కలిగి ఉన్న తర్వాత సూచికలో ఆరవ స్థానంలో ఉన్నాయి. ➦ఈ సూచీ ఆఫ్ఘనిస్తాన్ 109వ స్థానంలో ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌తో ఆఫ్ఘనిస్తాన్ 28 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ➦సిరియా (108వ స్థానం), ఇరాక్ (107వ స్థానం), యెమెన్ (105వ స్థానం), పాలస్తీనా టెరిటరీ (103వ స్థానం) వంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందు ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్ ఎలా నిర్ణయిస్తారు? 2006 నుంచి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌ను నిరంతరం విడుదల చేస్తోంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ అథారిటీ డేటా ఆధారంగా. ఒక దేశంలోని ప్రజలు అనేక దేశాలకు ప్రయాణించడం ఎంత సులభమో తెలియజేస్తుంది. -
Henley Passport Index 2023: సింగపూర్ పాస్‌పోర్టు పవర్ఫుల్ ..!
లండన్: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా సింగపూర్ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఈ దేశం పాస్‌పోర్టు ఉంటే ఎలాంటి వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. ఇన్నాళ్లూ నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వచ్చిన జపాన్ను తోసిరాజని సింగపూర్ మొదటి ర్యాంక్ దక్కించుకుంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2023 సంవత్సరానికి విడుదల చేసిన జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలిస్తే భారత్ 80వ ర్యాంక్ దక్కించుకుంది. భారత్ వీసా ఉంటే ఇండోనేసియా, రువాండా, జమైకా, శ్రీలంక వంటి దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. కానీ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలకు భారతీయులు వెళ్లాలంటే వీసా తీసుకొని తీరాలి. అమెరికా, చైనా, రష్యా, జపాన్ సహా పలు యూరోపియన్ యూనియన్ దేశాలకు వీసా తప్పకుండా తీసుకోవాలి. వీసా లేకుండా పాస్ పోర్టు సాయంతో ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఐఏటీఏ) ఇచ్చే డేటా ఆధారంగా తొలిసారిగా ఈ జాబితా రూపొందించింది. జాబితాలో అమెరికాకు ఎనిమిదో స్థానం, యూకే నాలుగో ర్యాంకులో ఉంటే అట్టడుగు స్థానంలో అఫ్గానిస్తాన్ నిలిచింది.


