పాస్‌పోర్టూ పనికిరాదా? | Sakshi Editorial On India Passport | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టూ పనికిరాదా?

Jun 27 2026 12:32 AM | Updated on Jun 27 2026 12:32 AM

Sakshi Editorial On India Passport

ప్రపంచంలో ఏ దేశం పాస్‌పోర్టు శక్తిమంతమైందో లెక్కేసిచెప్పే హెన్లే పాస్‌పోర్టు ఇండెక్స్‌ (హెచ్‌పీఐ)... మన పాస్‌పోర్టు 75వ స్థానంలో ఉందంటూ ఈ ఏడాది మొదట్లో నిర్ధారించింది. ‘హమ్మయ్య... నిరుటితో పోలిస్తే పదిమెట్లు పైకొచ్చాం’ అని మన పౌరులు గర్వపడి ఆర్నెల్లు కాకుండానే దానికేమీ పెద్దగా విలువలేదనీ, భారత పౌరసత్వానికి అదేమీ రుజువు కాబోదనీ మన విదేశాంగ శాఖ తేల్చిచెప్పి, ఆ సంతోషంపై నీళ్లు చల్లింది. ‘ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు... గత పుష్కరకాలంలోని నిర్ణయం కానేకాదు. 1967 నాటి పాస్‌పోర్టు చట్టమే ఆ మాట చెప్పిం’దని సెలవిస్తోంది. గత కాలపు నిర్ణయం అయినంత మాత్రాన ఏదైనా శిరోధార్యమవుతుందా... దాన్ని సమీక్షించటం, మార్చటం అసాధ్యమా అన్న ప్రశ్నలు సహజంగానే అందరిలో తలెత్తుతున్నాయి. ఈమధ్యకాలంలో ఎన్నికల సంఘం (ఈసీ) ధర్మమా అని పౌరసత్వంపై ప్రజానీకంలో ఆందోళన బయల్దేరింది. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) పేరిట బిహార్‌లో మొదలై పలు రాష్ట్రాల్లో సాగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కావలసినంత కలవరపాటును సృష్టించింది.

ఇంకా సృష్టిస్తోంది. పౌరులమని నిరూపించుకునే పత్రాలు సమర్పిస్తేనే ఓటు ఉంటుందనటంవల్ల పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోయారు. యూపీలో అలాంటివారు రెండు కోట్ల పైమాటే. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోవటం తక్షణ ప్రమాదమైతే... దేశంలో నివసించటం అసాధ్యమయ్యే స్థితి ఏర్పడటం మున్ముందు ఎదురయ్యే ముప్పు. ఈ దేశ పౌరులని ఈసీ నమ్మితేనే ఎవరికైనా ఓటుహక్కు లభిస్తుంది. అలాగని ఓటర్‌ గుర్తింపు కార్డు పౌరసత్వానికి రుజువు కాబోదని ప్రభుత్వమే చెబుతోంది. ఇప్పుడు పాస్‌పోర్టు సైతం ఆ ఖాతాలో చేరింది.

పదిహేనేళ్ల క్రితం మహారాష్ట్రలోని తెంబ్లీలో ఆధార్‌ను లాంఛనంగా ప్రారంభించి నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆ కార్డే ఇకపై సర్వస్వమనీ, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినా వుంటుందనీ అన్నారు. నిరుపేదలకు ఏ గుర్తింపు కార్డూ లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించామని కూడా చెప్పారు. తీరా సర్‌ ప్రక్రియ సమయంలో అది చెల్లుబాటు కాబోదని ఈసీ తేల్చి చెప్పింది. అటుపై సుప్రీంకోర్టు అనుమతించిన 12 పత్రాల్లో పాస్‌పోర్టు కూడా ఉండటం చాలామందికి ఊరటనిచ్చింది. ఇప్పుడు పాస్‌పోర్టు కూడా పౌరసత్వాన్ని నిర్ధారించటానికి పనికిరాదనటం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. 

అవధానాల్లో ఆశువుగా పద్యం చెప్పే అవధానికి ‘నిషిద్ధాక్షరి’ మాటున పృచ్ఛకుడు అడుగడుగునా అడ్డుతగులుతూ, ప్రతి పదంలోనూ అక్షరాలను నిషేధిస్తూ ముప్పు తిప్పలు పెడతాడు. వీటన్నిటినీ అధిగమించి ఛందోబద్ధంగా అందమైన పద్యాన్ని అల్లటం అవధాని పద సంపదకు పరీక్ష. పౌరసత్వం విషయంలో దేశ పౌరులకు ఇలాంటి పరీక్షే ఎదురవుతోంది. ఏ పత్రం దాఖలు చేద్దామనుకున్నా అది పనికిరాదని చెప్పటం తప్ప, పనికొచ్చేదేమిటో పాలకులు నిర్ధారణగా చెప్పరు. ఇందువల్ల సామాన్యుల్లో అభద్రతా భావన ఏర్పడటం తప్ప సాధిస్తున్నదేమిటి? పాస్‌పోర్టు చట్టం సెక్షన్‌ 6(2)(ఏ) ఈ దేశ పౌరుడుకాని వ్యక్తికి పాస్‌పోర్టు నిరాకరించాలని స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టే వేరే దేశాలకు ప్రమాణం. దాన్నిబట్టే వీసాలు జారీ అవుతాయి. అది పనికిరాదంటే ఆ దేశాలు అడుగుపెట్టనిస్తాయా?

హెచ్‌పీఐ ర్యాంకులు సాధారణమైనవేం కాదు. ప్రపంచంలో సింగపూర్‌ పాస్‌పోర్టును మొత్తం 192 దేశాలు గుర్తించి, వీసా అవసరం లేకుండానే తమ భూభాగాల్లో అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నాయి. అందువల్లే అది ప్రథమ స్థానంలో ఉంది. 187 దేశాల గుర్తింపుతో జపాన్, దక్షిణ కొరియాలు... 186 దేశాల గుర్తింపుతో స్వీడన్, యూఏఈలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అలా చూస్తే మన పాస్‌పోర్టుకు 56 దేశాల గుర్తింపు మాత్రమే ఉంది. ఇతరచోట్లకు వెళ్లాలంటే వీసా కావాలి. వారు సైతం పాస్‌పోర్టు ఆధారంగానే వీసా జారీచేస్తారు. ఇప్పుడు విదేశాంగశాఖ తకరారుతో అంతర్జాతీయంగా ఎవరైనా తలుపులు మూస్తే మన పౌరుల గతేమిటి? ఎన్నో దేశాల్లో అన్నిటికీ చెల్లుబాటయ్యే కార్డు జారీ విధానం దశాబ్దాల క్రితమే అమల్లోకొచ్చింది. మనం మాత్రం అభద్రతాభావంతో పౌరులకు అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్నాం. ఇది సబబేనా? 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement