
ఈ పెద్దమనిషి పేరు చెప్పాలంటే 20 నిమిషాలు కావాలి. అంటే, ఓ సినిమా ఇంటర్వెల్ అయ్యేంత సేపు! అదండీ విషయం! మామూలుగా అయితే ఎవరినైనా పరిచయం చేసుకుంటే ‘హాయ్, నా పేరు ఫలానా’ అని సెకన్లలో చెప్పేస్తాం. కానీ, లారెన్స్ వాట్కిన్స్ అనే న్యూజిలాండ్ మాజీ సెక్యూరిటీ గార్డ్‌కి మాత్రం ఆ విధానం అస్సలు నచ్చలేదు!
పేరు కాదది.. అష్టాదశ పురాణం!
ఆయన పేరంటే పేరు కాదు, అదొక అష్టాదశ పురాణం! మొత్తం 2,253 పదాలు ఉంటాయిట! గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ‘ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తిగత పేరు’.. అని అధికారికంగా ప్రకటించింది. అంటే.. ఆయన తన పూర్తి పేరు చెప్పడం మొదలుపెడితే.. మీరు ఒక కాఫీ తాగి రావచ్చు. ఓ రెండు చిన్న కవితలు రాసి ముగించవచ్చు. పక్కన ఉన్న స్నేహితుడితో ఓ దేశ రాజకీయాల గురించి చర్చ మొదలెట్టి ముగించవచ్చు కూడాను.. మీరు టిఫిన్ చేయడం పూర్తయ్యేలోపు కూడా ఆయన పేరు సగం కూడా పూర్తి కాదు మరి!
పెళ్లి మండపంలోనూ అదే హంగామా!
1991లో లారెన్స్ వాట్కిన్స్ మొదటి పెళ్లప్పుడు జరిగింది మరింత కామెడీ. ఆ పెళ్లి తంతు జరిపించే వ్యక్తి తెలివైన వాడు. రిస్క్ తీసుకోకుండా, లారెన్స్ గారి ఆ 2,253 పేర్ల లిస్ట్‌ను ముందుగానే రికార్డ్ చేశాడట!. మండపంలో మంగళవాయిద్యాల బదులు ఆ రికార్డింగ్ అర్ధగంట పాటు మోగుతూనే ఉందట!. అక్కడికి వచ్చిన అతిథులు షాంపైన్ తాగుతూ, ఆ అనంతమైన నామస్మరణను వింటూ హాయిగా తిరిగారట!.
ఎట్టకేలకు 20 నిమిషాల తర్వాత, నామకరణ ఘట్టం ముగిశాక, ‘ఐ డూ’ అనే ముఖ్యమైన మాట చెప్పడానికి లారెన్స్ గారికి అవకాశం దొరికింది! ఆయన చిన్నప్పుడు ’రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ షో చూసి, గిన్నిస్ రికార్డ్స్ పుస్తకాలు చదివి, ‘నాలాంటి సాధారణ మనిషికి ఏ ప్రత్యేక ప్రతిభ లేదు’ అని బాధపడిపోయాడట. అప్పుడు, తనకున్న ఏకైక అవకాశం.. ప్రపంచంలోనే అతి పొడవైన పేరు పెట్టుకోవడమే అని డిసైడ్ అయ్యారు!
సంతకం సంగతేంటి?
రోజువారీ అవసరాల కోసం, ఆయన తన పేరును కేవలం ’లారెన్స్ అలోన్ అలోయ్ వాట్కిన్స్’ అని కుదించుకుని, సంతకాన్ని వాట్కిన్స్–5 (అయిదో తరం) అని పెడతారట. ఆయన పూర్తి పేరుతో ఉన్న పాత పాస్‌పోర్ట్‌కి ఏకంగా ఆరు అదనపు పేజీలు అవసరమయ్యాయట!
ఇదే లారెన్స్ గారి పూర్తి పేరు
లారెన్స్ అలోన్ అలాయిస్ అలోయిసియస్ ఆల్ఫెజ్ అలున్ అలురెడ్ ఆల్విన్ అల్యాసాండిర్ ఆంబీ ఆంబ్రోస్ ఆంబ్రోసియస్ అమియాస్ అమియోట్ అమియాస్ అండర్స్ ఆండ్రీ ఆండ్రియా ఆండ్రియాస్ ఆండ్రూ ఆండీ అనైరిన్ ఆంగ్విష్ ఆన్లెయిఫర్ ఆంథిన్... (ఓస్.. ఇంతేనా అనుకున్నారు కదూ.. అయిపో లేదు.. ఇంకా ఉంది..)
– సాక్షి, నేషనల్ డెస్క్