
15 మంది పౌరులు మృతి.. 100 మందికి గాయాలు
పాక్ సైన్యం కాల్పుల్లో 50 మంది తాలిబన్లు బలి!
పెద్ద సంఖ్యలో పాక్ జవాన్లు హతమయ్యారని తాలిబన్ల ప్రకటన
ఇస్లామాబాద్: ఒకప్పటి సన్నిహిత మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణ జరిగింది. కాందహార్ ప్రావిన్స్‌లో మంగళవారం అర్ధరాత్రి పాక్ సైన్యం, తాలిబన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి. తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 15 మంది సాధారణ పౌరులు మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో 80 మందికిపైగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. పాక్ దాడిలో దాదాపు 50 మంది తాలిబన్లు మరణించినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఘర్షణ నానాటికీ ముదురుతుండడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను ఫోన్‌లో సంప్రదించింది. అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా మధ్యవ ర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబన్లను ఒప్పించాలని కోరింది.
పరస్పరం నిందలు
పాక్, అఫ్గాన్ మధ్య గతవారం హింసాకాండ మొదలైంది. కాబూల్‌లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. డురాండ్ లైన్‌లో 58 మంది పాక్ సైనికులను హతమార్చారు. 20 పాక్ సెక్యూరిటీ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశారు. 2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్‌తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం.
అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలోనే పాక్ సైన్యం తాలిబన్లపై గురిపెట్టింది. మంగళవారం రాత్రి తొలుత పాక్ జవాన్లే కాల్పులు జరిపారని, భారీ ఆయుధాలు ప్రయోగించారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ఆరోపించారు. తమ ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో పాక్ జవాన్లు హతమయ్యారని, పాక్ ఆయుధాలను, యుద్ధ ట్యాంక్‌లను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించా రు. అయితే, రెండు సరిహద్దు పోస్టులు సహా మొ త్తం నాలుగుచోట్ల తాలిబన్లు మొదట కాల్పులు జరిపారని, దాంతో తాము ప్రతిస్పందించాల్సి వచ్చిందని పాకిస్తాన్ సైన్యం తెలియజేసింది.
ఎదురుకాల్పుల్లో 30 మంది తాలిబన్ ఫైటర్లు మరణించారని స్పష్టంచేసింది. స్పిన్ బోల్డాక్‌లో మరో 20 మంది మృతిచెందారని వివరించింది. తాలిబన్లకు సంబంధించిన 8 సైనిక పోస్టులు, 6 యుద్ధ ట్యాంకులు ధ్వంసమైనట్లు పేర్కొంది. తాలిబన్ల దాడిలో చమన్‌జిల్లాలో నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాక్ వెల్లడించింది. ఒరాక్‌జాయ్ జిల్లాలో ఆరుగురు పాక్ పారామిలటరీ సిబ్బంది మృతిచెందినట్లు తెలిసింది. ఇరువర్గాల కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల నుంచి వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గత పది రోజులుగా సరిహద్దు మార్గాలను అధికారులు మూసివేశారు.
రెండు దేశాల మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. పాక్ రక్షణ శాఖ మంత్రి, ఐఎస్‌ఐ అధినేత, ఇద్దరు సైనికాధికారులకు వీసాలు ఇవ్వడానికి తాలిబన్ ప్రభుత్వం నిరాకరించింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది. దాంతో అఫ్గాన్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. మరోవైపు భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీరి్ణంచుకోలేకపోతోంది. కాబూల్‌లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్‌కు కంటగింపుగా మారింది.
48 గంటల కాల్పుల విరమణ
అఫ్గానిస్తాన్‌తో 48 గంటలపాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాలిబన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ తెలియజేశారు. ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదులిస్తామని స్పష్టంచేశారు.