
అరుదైన మూలకాల తవ్వకం కోసం భారీ ఒప్పందం ఖరారు
స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.
దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.
‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.
తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్‌ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు.