
కొత్త మిల్లెట్ పంట! ‘జాబ్స్ టియర్స్’.. ఇది మన దేశానిదే అయినా మనకు తెలియని పంట. మణిపూర్‌కు చెందిన మిల్లెట్ పంట. అధిక పోషక విలువతో కూడి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే.. మల్టీకట్ మిల్లెట్ క్రాప్. అంటే, ఒక్కసారి నాటితే చాలు, మూడుసార్లు ధాన్యం కోసుకోవచ్చు.
మొదటి కోత తర్వాత కొద్ది నెలల వ్యవధిలో మరో రెండుసార్లు పంట తీసుకోవచ్చు. మణిపూర్ ప్రాంతంలో ఇది సాగవుతోంది. అన్నంగా వండుకు తినొచ్చు. పశువులకు గ్రాసంగా, దాణాగా పెడతారు. మణిపూర్‌లోని సేనాపతి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ కమీ ‘సాక్షి సాగుబడి’తో ఈ పంట విశేషాలు పంచుకున్నారు.
గ్రామినే కుటుంబంలోని ఒక స్మాల్ మిల్లెట్ పంట ఇది. 1–2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. గింజలు రకాన్ని బట్టి రంగు మారుతుంది. పసుపు, ఊదా లేదా గోధుమ రంగులో ఉంటాయి. కన్నీటì బిందువు రూపంలో ఉంటాయి. అందుకే ‘టియర్స్’ అనే పేరొచ్చింది. ఎటువంటి నేలల్లో, ఎంతటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకుంటుంది.
దీని బియ్యంలో మాంసకృత్తులు 9%, కొవ్వు 0.5–6.1%, పిండిపదార్థం 58–77%, పీచు 0.3–8.4, 100 గ్రాముల బియ్యంలో 1500 కిలో కేలరీలుంటాయి. వరి బియ్యం, గోధుమలతో పోల్చితే కొవ్వు, ప్రొటీన్ చాలా ఎక్కువ. జాబ్స్ టియర్స్ పైపొట్టు తీసిన ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తింటే ఆరోగ్యం. పిండితో రొట్టె చెయ్యొచ్చు. సూప్‌లలో చిక్కదనం కోసం కలుపుకోవచ్చు. సిరిధాన్యాలతో చేసే చిరుతిళ్లన్నీ చేసుకోవచ్చు. మద్యం తయారీకీ వాడుతున్నారు. కోళ్లకు, పశువులకు కూడా పుష్టికరమైన ఆహారం ఇది.
ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్
కరువు కాలంలో ఇతర పంటలు పోయినా ఇది బతికి, మనుషుల్ని, పశువుల్ని బతికిస్తుంది. నీటి ముంపును తట్టుకుంటుంది. ఆమ్ల గుణం ఉండే నేలల్లో, లేటరైట్ నేలల్లో, కొండవాలులో నిస్సారమైన భూముల్లోనూ పెరుగుతుంది. సముద్రతలం నుంచి 2 వేల మీటర్ల వరకు ఎత్తు గల ప్రాంతాల్లో పండుతుంది. విత్తనాలను బాగా మసిలే వేడి నీళ్లలో 10 నిమిషాలు ఉంచి, విత్తుకుంటే తెగుళ్లు రావు. మే–జూలై మధ్య విత్తుకోవచ్చు. 8–10 అంగుళాల లోతు దుక్కిచేసి, సాళ్లుగా విత్తుకోవాలి/ వెద పెట్టాలి. 100–115 రోజుల పంట. గింజ గట్టిపడి, తేమ 20% కన్నా తగ్గినప్పుడు కోత కోసుకోవాలి. హెక్టారుకు 2–4 టన్నుల ధన్యం దిగుబడి నిస్తుంది. పైపొట్టు తీసేస్తే 30–50% వరకు ముడిబియ్యం వస్తాయి. హెక్టారుకు 34 టన్నుల పచ్చిగడ్డి, 8 టన్నుల ఎండు గడ్డి పండుతుంది.
ఇతర వివరాలకు.. డా. డేవిడ్ కమీ davidkamei81@gmail.com