పగ బట్టిన పండు ఈగ! | Fruit flies are destructive pests that damage a wide variety of fruit and vegetable crops | Sakshi
Sakshi News home page

పగ బట్టిన పండు ఈగ!

Oct 14 2025 4:44 AM | Updated on Oct 14 2025 4:44 AM

Fruit flies are destructive pests that damage a wide variety of fruit and vegetable crops

తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా పండ్ల, కూరగాయ తోటలకు విస్తరించిన పండు ఈగ ముప్పు

 మామిడిలో 30% నుంచి 70% వరకు దిగుబడి నష్టం

 జామ, బొప్పాయి, సపోటా, రేగు వంటి పంటల్లో 20% నుంచి 50% వరకు దిగుబడి నష్టం

పండు ఈగ (ఫ్రూట్‌ ఫ్లై) అనేక పండ్లు, కూరగాయ తోటలకు పెను నష్టాన్ని కలిగిస్తూ రైతులను అల్లాడిస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం మామిడికే పరిమితమై ఉండే  పండు ఈగ ఇప్పుడు అనేక పంటలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండు ఈగ ముప్పు ఏటేటా పెరుగుతోంది. దాదాపు 20కి పైగా పండ్లు, కూరగాయ తోటలకు పండు ఈగ ఆశిస్తూ రైతులకు పెను నష్టం కలిగిస్తోంది. మామిడిలో 30% నుంచి 70% దిగుబడి నష్టం జరుగుతోంది. జామ, బొప్పాయి, సపోటా, రేగు వంటి పంటల్లో 20% నుంచి 50% దిగుబడి నష్టాలకు కారణమవుతున్న పండు ఈగపై కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌’ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్‌ మరియదాస్, డాక్టర్‌ పైలా జ్యోతి, డాక్టర్‌ ఆలిస్‌ ఆర్‌పీ సుజీత సూచనలతో ప్రత్యేక కథనం. పండు ఈగ సోకకుండా జీవనియంత్రణ పద్ధతులను అనుసరించటమే మేలని వారు రైతులకు సూచిస్తున్నారు.

పండ్ల ఈగలు (ప్రధానంగా బాక్ట్రోసెరా జాతులు బి. డోర్సాలిస్, బి. జోనాటా, బి. కుకుర్బిటే వంటివి) ఎన్నో రకాల పండ్లు, కూరగాయలను ఆశించి నాశనం చేసే పురుగులు. అందుకే వీటిని ‘పాలీఫాగస్‌ పెస్ట్స్‌’ అంటారు. ఒకప్పుడు కొన్ని పండ్లు, కూరగాయ రకాలకు నష్టం చేకూర్చేవి. క్రమంగా అనేక ఇతర పంటలకు కూడా వ్యాపించి నష్టం చేస్తున్నాయి. అకాల వర్షాలు, అస్థిర వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యాన తోటల్లో పండు ఈగల త్వరితగతిన వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. దీనివల్ల గత సీజన్‌లో కూడా మామిడి కాయలకు తీవ్ర నష్టం కలిగింది. పండు ఈగ వల్ల మామిడి ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. అనేక ఇతర పంటలను కూడా పండు ఈగ చుట్టుముడుతోంది.

పండు ఈగ నియంత్రణకు మేలైన యాజమాన్య పద్ధతులు
→ తోటలో చెట్ల నుంచి రాలిపోయిన లేదా పండు ఈగ సోకిన పండ్లను సేకరించి మట్టిలో  రెండు అడుగుల (60 సెం.మీ.ల) లోతు గుంత తీసి పాతిపెట్టాలి. 

→ పండ్ల చెట్ల కొమ్మలను తగుమాత్రంగా కత్తిరించి, కత్తిరింపులను తో టలో నుంచి తొలగిస్తే పండు ఈగలు పెరగకుండా చూసుకోవచ్చు.  

→ పండిన పండ్లను పండినట్లు ఎప్పటికప్పుడు వెంటనే కోయండి. పండిన పండ్లను చెట్లపై వదిలివేయవద్దు.

→ జొన్న, ఆముదం, తులసి, కర్రపెండలం వంటి పురుగులను ఆకర్షించే జాతుల మొక్కలను తోటల గట్లు/ సరిహద్దుల్లో పెంచటం ద్వారా ప్రధాన పంటను పండు ఈగల నుంచి రక్షించుకోవచ్చు. 

→ మగ ఈగలను ఆకర్షించటం కోసం సామూహిక ఉచ్చులు ఏర్పాటు చేయటం ద్వారా పండు ఈగ సంతతిని నియంత్రించి తోటలను కాపాడుకోవచ్చు. పండ్ల తోటల్లో మిథైల్‌ యూజినాల్‌ ఉచ్చులు పెట్టాలి. తీగజాతి కూరగాయ పంటల్లో క్యూ–లూర్‌ ఉచ్చులను ఉపయోగించాలి. ఎకరానికి 6–10 ఉచ్చులు పెట్టాలి. ఒకసారి పెడితే చాల్లే అనుకోకండి. ప్రతి 30–40 రోజులకు ఒకసారి ఎరలను మార్చుతూ ఉండాలి. తక్కువ ఖర్చుతో కూడిన ‘ఫ్రూట్‌ ఫ్లై బాటిల్‌ ట్రాప్‌ టెక్నాలజీ’ని ఎన్‌ఐపీ హెచ్‌ఎం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. 

→ అధిక విలువైన పండ్లను పండు ఈగ నుంచి కాపాడుకోవటం కోసం పండ్లకు రక్షక సంచులు తొడగాలి. పండ్లకు కాగితం లేదా ప్లాస్టిక్‌ సంచులు తొడగండి. ఇది పండుపై ఈగ గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటుంది. పురుగుమందుల అవశేషాలను తగ్గిస్తుంది. ఎగుమతి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పండ్లు ఉండేలా చేస్తుంది. శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ చిన్న తోటలన్నిటిలో, దేశీయ /ఎగుమతి మార్కెట్ల కోసం ఉద్దేశించిన తోటల్లో చెట్లపై కాయలకు సంచి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

→ తోటలో చెట్లు / మొక్కల కింద ఉన్న మట్టిని కుళ్లగించి, ఆ మట్టిలో ఉండే పండు ఈగ ప్యూపాలను చంపడానికి క్లోర్‌పైరిఫోస్‌ 20% ద్రావణాన్ని లీటరు నీటికి 2.5 ఎం.ఎల్‌. చొప్పున కలిపి చల్లండి. 

→ బ్యూవేరియా బాసియానా, మెటారైజియం అనిసోప్లియా వంటి ఎంటోమో పాథోజెనిక్‌ శిలీంధ్రాలను ఆకులపై పిచికారీ చేయండి. 

→ మగ, ఆడ కీటకాలను చంపడానికి ఎర స్ప్రేలను పిచికారీ చేయవచ్చు. ఏదైనా ఒక పురుగుమందును (మలాథియాన్‌ 50% ద్రావణం లీటరు నీటికి 2 ఎం.ఎల్‌./∙లేదా డెల్టామెథ్రిన్‌ 2.8% ద్రావణం లీటరు నీటికి 2 ఎం.ఎల్‌. చొప్పున) ప్రోటీన్‌ హైడ్రోలైజేట్‌ లేదా మొలాసిస్‌ లేదా బెల్లంలకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయండి. పండు ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడల్లా 2 వారాల వ్యవధిలో పిచికారీ చేయండి.

ఈ తోటలకు ముప్పు
పండ్ల జాతులు: మామిడి, జామ, సీతాఫలం, రేగు, బొప్పాయి, సపోటా, అరటి, దానిమ్మ, బత్తాయి, పుచ్చతో పాటు కివి వంటి అన్యదేశ పండ్లను కూడా పండు ఈగలు ఆశిస్తున్నాయి. కూరగాయలు, దోసకాయలు: టమాటా, వివిధ రకాల తీగ జాతి కూరగాయ పంటలకు పండు ఈగ సమస్యగా మారింది. బీర, సొర, కాకర, నేతి బీర, పొట్ల, గుమ్మడి, దొండ, దోస, కీర దోస తదితర ఉద్యాన పంటలకు పండు ఈగ ముప్పు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలు విజృంభిస్తున్నాయి. వందలాది పంటలను ఆశిస్తున్నాయి. అకాల వర్షాలు, తేమతో పాటు వెచ్చని రాత్రులతో మారుతున్న వాతావరణం చీడపీడలు వేగంగా విస్తరించటానికి సహాయపడుతున్నది. ఇది తెలంగాణ, ఆంధ్రలో ఇటీవలి మామిడి నష్టాలకు ప్రధాన కారణం బాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలే. పక్వానికి వచ్చిన కాయల కోత ఆలస్యమై పండ్లు చెట్లపై ఎక్కువ కాలం ఉన్నప్పుడు పండు ఈగలు వాటిని ఆశించి, ఆ పండ్ల లోపలికి గుడ్లు చొప్పించడానికి ఎక్కువ అవకాశం దొరుకుతున్నది.

నష్టాలు.. ఎగుమతి చిక్కులు
చెట్లకు వేలాడుతున్న పండ్ల తొక్కకు ఆడ పండు ఈగలు బెజ్జం చేసి, వాటి లోపల గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి తయారయ్యే పురుగులు ఆ పండు లోపలే ఉండి గుజ్జు ను తింటూ ఉంటాయి. దీనివల్ల పండు పైకి చూపులకు అంతా బాగానే కనిపిస్తున్నా లోపల్లోపల కుళ్ళి మెత్తబ డుతుంది. అకాలంగా పండ్లు రాలిపోతుంటాయి. ఇది పంట కోత తర్వాత కాలంలో అధిక నష్టాలకు దారితీస్తుంది. పండు ఈగలు ఎక్కువగా ఆశిస్తే పంట దిగుబడితో పాటు మార్కెట్‌లో ధరలు, ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. పండు ఈగల దాడిని సరిగ్గా నియంత్రించకపోతే పండ్లు, కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి, రైతులకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. మామిడిలో 30% నుంచి 70% వరకు పంట నష్టం జరుగుతుంది. జామ, బొప్పాయి, సపోటా, రేగు తదితర పంటల్లో సీజన్‌ను, పండు ఈగల తీవ్రతను బట్టి 20% నుంచి 50% వరకు పంట నష్టం జరుగుతుంది. 

పండు ఈగలు పెద్ద సంఖ్యలో ఆశిస్తే విదేశాలకు ఎగుమతైన పండ్లు అక్కడికి వెళ్లిన తర్వాత తిరస్కరణకు గురయ్యే రిస్క్‌ పెరుగుతుంది. ఎగుమతికి సిద్ధం చేసే ప్రక్రియలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో సరుకు ఎగుమతి ఆర్డర్ల రద్దుకు సైతం దారితీస్తుంది. ఇది భారతీయ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో వాణిజ్య భాగస్వామ్యాన్ని తగ్గిస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి పండ్లు ఈగలతో ప్రభావితమైన పండ్లను ఎగుమతి కాకుండా చూడాలి. అందుకు అనుగుణంగా కఠినమైన ఫైటో శానిటరీ శుద్ధి ప్రక్రియలు చేపట్టటం అవసరం. వేడి నీటి చికిత్స, వేడి ఆవిరి చికిత్స, చల్ల నీటి చికిత్స, వికిరణ చికిత్స, రసాయన ద్రావణాల్లో పండ్లను ముంచటంతో పాటు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండు ఈగ రహిత ధ్రువీకరణను ప్రవేశపెట్టటం వంటి పటిష్ట చర్యలు తీసుకుంటే పండు ఈగ వల్ల ఎగుమతులు దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement