ఆ కోటు ‘క్లోక్) వేసుకోవాలనేది డ్రీమ్.. కానీ అప్పుడు నెలగడవడమే ముఖ్యం
కష్టపడి చదువుకోవడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్‌ను అందుకోవడం మరో ఎత్తు. గ్రాడ్యుయేషన్ విద్యార్థుల జీవితాల్లో, కరియర్‌లో అదొక అద్భుతమైన అనుభూతి. గ్రాడ్యుయేషన్ డ్రెస్‌లో తోటివారితో పాటు వేదికపై నిలబడటం, హితులు, సన్నిహితుల సమక్షంలో గర్వంగా పట్టా పుచ్చుకోవడం అనేది చాలా అరుదుగా సాధించగల అనుభూతి. కానీ అలాంటి ఆనందాన్ని మిస్ అవడం నిజంగా చెప్పలేనంత దురదృష్టమే. అలాంటి అనుభవాన్ని డిజిటల్ క్రియేటర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది నెట్టింట పలువురి హృదయాలను దోచుకుంది.
డిజిటల్ క్రియేటర్, రషికా ఫజాలి తన గ్రాడ్యుయేషన్ అనుభవాన్ని పంచుకున్నారు. గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో పాల్తొనాలనే ఆమె డ్రీమ్ సాకారం కాలేదు.కేవలం ఆర్థిక సమస్యల కారణంగా దాన్ని మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆరోజు కేవలం జనంలో అతిథిగా కూర్చోవాల్సి వచ్చిందంటూ హృదయాన్ని కదిలించే స్టోరీ షేర్ చేశారు.
"నేను నా స్వంత గ్రాడ్యుయేషన్‌కు అతిథిగా ఉన్నాను" అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లోచేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అప్పట్లో ఆ వేడుకకు డబ్బు చెల్లించడం కంటే నెల గడవడమే తనకు ముఖ్యమని ఫజాలి పేర్కొన్నారు. నిజంగా ఆ క్లోక్ ధరించాలని చాలా కోరిక ఉండేదని, కానీ మిస్ అవ్వడం తీపి చేదు కలయిక క్షణాలని, వేడుకకు అతిథిగా హాజరు కావాలనే తన నిర్ణయం అత్యంత దారుణమైందని గుర్తు చేసుకున్నారు. అయితే తనను ప్రోత్సహించిన తన తోటివారిని అభినందించే అవకాశం వచ్చినందుకు సంతోషించాననీ, కనీసం ఆ ఆనంద జ్ఞాపకాలు తనలో మిగిలాయని చెప్పుకొచ్చారు.
బిడ్డకు తల్లిగా
ఒక బిడ్డకు తల్లిగా క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రషికా మెరిట్‌తో పట్టభ్రదురాలైంది. రిసెర్చ్‌లో డిస్టింక్షన్ తెచ్చుకుంది. అదీ చిన్ని పాపాయిని ఎత్తుకుని ఎవరి సాయం లేకుండానే, మాస్టర్స్ సాధించానంటూ గర్వంగా చెప్పుకుంది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు.
అయ్యో... అప్పుడు తమకీ విషయం తెలిసి ఉంటే, సాయం చేసేవారమని చాలామంది కమెంట్ చేశారు. "ఎంత గొప్ప విజయం! భవిష్యత్తులో ఇంకా సాధిస్తారు! అలా కూర్చోవడానికి చాలా ధైర్యం అవసరం! అని ఒకరు, ‘‘గ్రాడ్యుయేషన్‌కు అభినందనలు మీరు నిజంగా క్వీన్," మరొకరు కామెంట్ చేశారు. నాకు తెలిసి ఉంటే కచ్చితంగా సాయం చేసే దాన్ని.. సాయంగానో, ఉపకారంగానో కాదు ఒకబిడ్డకు తల్లిగా ఇది సాధించడంఎంత కష్టమో తెలుసు అన్నారు మరొకరు.


