ప్రతీకాత్మక చిత్రం
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోఒక విచిత్రం చోటు చేసుకుంది. జీవ శాస్త్రంలో కనీవినీ ఎరుగని రీతిలో 47 ఏళ్ల పురుషుడికి గర్భసంచి ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తితోపాటు, వైద్యులూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంతకీ అసలు ఏమిటంటే...
ఉంచెహరా నగర పంచాయతీ ఛైర్మన్ నిరంజన్ ప్రజాపతి, కడుపు నొప్పి , ఉబ్బరంతో బాధపడుతూ జనవరి 13న సోనోగ్రఫీ చేయించుకున్నారు. దీంతో అతనికి కుడివైపున గర్భసంచి ఉందనీ అదీ తలకిందులగా ఉందని ఒక డయాగ్నస్టిక్ రిపోర్ట్ వచ్చింది. అయితే, అతనికి ఆసుపత్రి ఫైల్‌కు బదులుగా, ఒక వైద్య వ్యంగ్య కథకు సరిపోయే రిపోర్ట్ అందింది. దీంతో నాకు యూట్రస్ ఏంటి అని విస్తుపోయిన ప్రజాపతి వైద్యులను సంప్రదించి అసలు విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరోగ్య శాఖ కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.

ఏం జరిగిందీ అంటే..
డయాగ్నస్టిక్ సెంటర్లోని గుమస్తా పొరపాటు కారణంగా ఈగందరగోళం నెలకింది. అతను ఒక రిపోర్ట్ బదులుగా, మరొకరి రిపోర్ట్‌ను అందించాడు. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగుల నిర్లక్ష్యానికి అజాగ్రత్తకు సంబంధించిన ఇదొక భయంకరమైన ఉదాహరణ అని చెప్పవచ్చు.
ఇదీ చదవండి: అరుదైన కానుక : రాహుల్ గాంధీ భావోద్వేగం, వైరల్ వీడియో
ఆ రిపోర్ట్ అస్సలు నాది కాదు అంటూ తన అనుభవాన్ని ప్రజాపతి పంచుకున్నారు. కొన్ని రోజులుగా కడుపులో నొప్పి వచ్చేది.. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. త రువాత మందులు తీసుకున్నా ఉపశమనం లభించలేదు. దీంతో మొదట ఉంచెహరాలో చికిత్స తీసుకుని, ఆ తర్వాత సత్నాలో సోనోగ్రఫీ చేయించుకున్నాను. ఆ తరువాత జబల్‌పూర్‌కు వెళ్ళాను. అక్కడి డాక్టర్ ఈ రిపోర్ట్ నాది కాదని స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఈ విషయంపై సత్నాలోని ఆ కేంద్రానికి చెందిన డాక్టర్ అరవింద్ సరఫ్‌ను సంప్రదించగా, ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఆయన మౌనం తీవ్రమైన నిర్లక్ష్యం ,రోగనిర్ధారణ ప్రక్రియలలో లోపాలు జరిగాయనే అనుమానాకు బలాన్నిచ్చింది. దీనిపై సత్నా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ శుక్లా స్పందించారు. సంబంధిత రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు ఇలాంటి పొరపాట్లు కేవలం గుమస్తా తప్పులు మాత్రమే కావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. "తప్పుగా వచ్చిన సోనోగ్రఫీ రిపోర్ట్ చికిత్సను తప్పుదోవ పట్టిస్తుందనీ, ఇది రోగిపై మానసికంగా ప్రభావం మాత్రమే కాదు, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటే ప్రాణాంతకం కూడా కావచ్చు అంటున్నారు సీనియర్ వైద్య నిపుణులు.
ఇదీ చదవండి: మిస్ అయిన ఫోన్ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్!


