జీవితాలు అందరివీ ఒక్కతీరుగా ఉండవు. ఈ అనంత కాల గమనంలో, ఈ రవ్వంత జీవన పయనంలో ఎవరి యుద్ధం వారిదే. పైకి కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కనిపించని బడబాగ్నులుండవచ్చు మరెన్నో అంతులేని కష్టాలూ ఉండవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ముత్తు మాస్టర్ స్టోరీ ఇలాంటిదే. కన్న కూతురి కోసం మూడు దశాబ్దాలు పాటు మగాడిలా బతికింది.
పెచియమ్మాళ్ అలియస్ ముత్తు ఎంతోమంది సగటు అమ్మాయిల్లాగానే జీవితాన్నిప్రారంభించింది. కోటి ఆశలతో 20 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దురదృష్టం ఏమిటంటే.. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లైన 15 రోజులకే భర్త అనూహ్యంగా కన్నుమూశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే తాను గర్బవతినని తెలుసుకుంది. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఇక్కడే పెచియమ్మాళ్ చాలా విభిన్నంగా ఆలోచించింది. ఏపనిచేసినా ఆమెకు లైంగిక వేధింపులుతప్పలేదు. సమాజం సూటి పోటి మాటలూ భరించాల్సి వచ్చేది. అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది. తన గుర్తింపును మార్చుకుంది. మగాడిలా మారి పోయింది. జుట్టును చిన్నగా కత్తిరించుకోవడం, ప్యాంట్ చొక్కా వేసుకుంది. ముత్తు కుమార్ అనే పేరుతో అనేక సవాళ్ల మధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!
చెన్నై,తూత్తుకుడిలోని హోటళ్ళు, రోడ్డు పక్కన షాపులల్లో అవిశ్రాంతంగా పనిచేసింది. పెయింటర్‌గా, కూలీగా, టీ మేకర్‌గా పని చేస్తూ ఎంతో కష్టపడింది ఇవన్నీ స్త్రీగా తన ఉనికి రహస్యాన్నిజాగ్రత్తగా కాపాడుకుంటూ, పురుషుల్లో పురుషుడిలా కలిసి పోయి బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడుతూ, బస్సులలో సైతం వారి పక్కనే కూర్చుంటూ కాలం నెట్టుకొచ్చింది.
ఆమె మహిళ అని ఆమెకు ఒక పాప ఉందని కొంతమంది సమీప బంధువులకు మాత్రమే నిజం తెలుసు. బయట పడిపోతాననే భయం నిరంతరం ఉండేది, కానీ ఆమె కూతురు షణ్ముగసుందరి భవిష్యత్తు కోసం దాన్ని భరించే శక్తిని కూడగట్టుకుంది. పరోటా షాపుల్లో పనిచేస్తూ ‘‘ముత్తు మాస్టర్’’గా పాపులర్ అయింది. ఆధార్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతాలో కూడా అదే పేరు పెట్టుకుంది. ఒంటరిగా మహిళగా, దయా దాక్షిణ్యంలేని సమాజంలో ప్రతి పైసా బిడ్డ కోసం ఆదా చేశానని చెప్పుకొచ్చిందామె. చివరికి ఆమె కలలు, ఆమె త్యాగాలు ఫలించాయి. ఆమె కుమార్తె పెరిగి పెద్దదై, విద్యను అభ్యసించి,వివాహం చేసుకుంది. అలా ముత్తు లక్ష్యం నెరవేరింది. పెచ్చియమ్మాళ్‌గా మళ్లీ మహిళగా జీవిస్తారా అని అడిగినప్పుడు, ఆమె సమాధానం విన్నవారు ఆశ్చర్య పోయారు ముత్తు మాస్టర్‌గానే ఉండాలని నిర్ణయించుకుంది. అవసరం నుండి పుట్టిన ఈ గుర్తింపు, ఆమె పట్టుదలకు , విజయానికి ప్రతీకగా మారింది. ఇది తన కుమార్తె భద్రతను, తనకు గౌరవాన్నిచ్చిన గుర్తంపుతోనే తన చివరి శ్వాస వరకు ఉంటానని చెప్పింది.


