బాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ అర్జిత్‌సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఇటీవల అందరినీ ఆశ్చర్య పరిచారు. కరియర్ పీక్‌లో ఉండగా సంగీత ప్రపంచానికి వీడ్కోలు పలకడం, ప్లేబ్యాక్ సింగర్ ఇకపై కొత్త ప్రాజెక్టులను తీసుకోనని అర్జిత్‌సింగ్ ప్రకటించి సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేశాడు. ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్‌లను నెరవేరుస్తానని, స్వతంత్రంగా సంగీతాన్ని కొనసాగిస్తానన ప్రకటించాడు. ప్లే బ్యాక్ సింగింగ్ నుండి వైదొలగాలనే అతని నిర్ణయం తర్వాత, అతని తదుపరి అడుగుపై ఊహాగానాలు మొదలయ్యాయి.
అర్జిత్‌సింగ్ త్వరలోనే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. 2026 ఎన్నికలకు ముందు కాకుండా, తొలుత అతను క్షేత్రస్థాయిలో ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నాడట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి ఎన్నికలలో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఎన్‌డిటివి నివేదిక పేర్కొంది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగం కాకపోవచ్చని ఆ నివేదిక తెలిపింది. బెంగాలీ చిత్ర పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ, సింగ్ మొదట క్షేత్రస్థాయిలో ఎన్నికలలో పోటీ చేయడం గురించి ఆలోచించవచ్చని ఆ నివేదిక పేర్కొంది. కెరీర్‌ను రాజకీయ రంగంలోకి మార్చే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాడని సన్నిహిత వర్గాల సమాచాం.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా, జియాగంజ్‌కు చెందినవాడు అర్జిత్ సింగ్. 2005లో “ఫేమ్ గురుకుల్” అనే రియాలిటీ షోలో పోటీదారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే పోటీ నుండి మధ్యలోనే నిష్క్రమించాడు. రియాలిటీ షో తర్వాత, అతను కొన్ని సంవత్సరాలు ప్రీతమ్‌కు సంగీత సహాయకుడిగా పనిచేసి, ఆ తర్వాత 2011లో ప్లేబ్యాక్ గాయకుడిగా అరంగేట్రం చేశారు.
గత కొన్నేళ్లుగా ఎన్నో హిట్ సాంగ్స్‌కు అదీ ప్రేమగీతాలకు మారుపేరుగా నిలిచాడు. బాలీవుడ్ నుండి వచ్చిన దాదాపు ప్రతి పెద్ద హిట్ చిత్రంలో సింగ్ పాడిన కనీసం ఒక పాట తప్పనిసరిగా ఉంటుంది. బాలీవుడ్ లెజెండ్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్.రణబీర్ కపూర్ వంటి ప్రముఖ తారలకు ప్లేబ్యాక్ సింగర్‌గా తన సత్తా చాటుకున్నాడు. 38 ఏళ్ల అర్జిత్‌సింగ్ తన రాజకీయ జీవితంపై వస్తున్న ఊహాగానాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


