breaking news
krishi vignan kendram
-
‘జాబ్స్ టియర్స్’..కొత్త మిల్లెట్ పంట!
కొత్త మిల్లెట్ పంట! ‘జాబ్స్ టియర్స్’.. ఇది మన దేశానిదే అయినా మనకు తెలియని పంట. మణిపూర్‌కు చెందిన మిల్లెట్ పంట. అధిక పోషక విలువతో కూడి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే.. మల్టీకట్ మిల్లెట్ క్రాప్. అంటే, ఒక్కసారి నాటితే చాలు, మూడుసార్లు ధాన్యం కోసుకోవచ్చు. మొదటి కోత తర్వాత కొద్ది నెలల వ్యవధిలో మరో రెండుసార్లు పంట తీసుకోవచ్చు. మణిపూర్ ప్రాంతంలో ఇది సాగవుతోంది. అన్నంగా వండుకు తినొచ్చు. పశువులకు గ్రాసంగా, దాణాగా పెడతారు. మణిపూర్‌లోని సేనాపతి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ కమీ ‘సాక్షి సాగుబడి’తో ఈ పంట విశేషాలు పంచుకున్నారు. గ్రామినే కుటుంబంలోని ఒక స్మాల్ మిల్లెట్ పంట ఇది. 1–2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. గింజలు రకాన్ని బట్టి రంగు మారుతుంది. పసుపు, ఊదా లేదా గోధుమ రంగులో ఉంటాయి. కన్నీటì బిందువు రూపంలో ఉంటాయి. అందుకే ‘టియర్స్’ అనే పేరొచ్చింది. ఎటువంటి నేలల్లో, ఎంతటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకుంటుంది. దీని బియ్యంలో మాంసకృత్తులు 9%, కొవ్వు 0.5–6.1%, పిండిపదార్థం 58–77%, పీచు 0.3–8.4, 100 గ్రాముల బియ్యంలో 1500 కిలో కేలరీలుంటాయి. వరి బియ్యం, గోధుమలతో పోల్చితే కొవ్వు, ప్రొటీన్ చాలా ఎక్కువ. జాబ్స్ టియర్స్ పైపొట్టు తీసిన ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తింటే ఆరోగ్యం. పిండితో రొట్టె చెయ్యొచ్చు. సూప్‌లలో చిక్కదనం కోసం కలుపుకోవచ్చు. సిరిధాన్యాలతో చేసే చిరుతిళ్లన్నీ చేసుకోవచ్చు. మద్యం తయారీకీ వాడుతున్నారు. కోళ్లకు, పశువులకు కూడా పుష్టికరమైన ఆహారం ఇది. ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్కరువు కాలంలో ఇతర పంటలు పోయినా ఇది బతికి, మనుషుల్ని, పశువుల్ని బతికిస్తుంది. నీటి ముంపును తట్టుకుంటుంది. ఆమ్ల గుణం ఉండే నేలల్లో, లేటరైట్ నేలల్లో, కొండవాలులో నిస్సారమైన భూముల్లోనూ పెరుగుతుంది. సముద్రతలం నుంచి 2 వేల మీటర్ల వరకు ఎత్తు గల ప్రాంతాల్లో పండుతుంది. విత్తనాలను బాగా మసిలే వేడి నీళ్లలో 10 నిమిషాలు ఉంచి, విత్తుకుంటే తెగుళ్లు రావు. మే–జూలై మధ్య విత్తుకోవచ్చు. 8–10 అంగుళాల లోతు దుక్కిచేసి, సాళ్లుగా విత్తుకోవాలి/ వెద పెట్టాలి. 100–115 రోజుల పంట. గింజ గట్టిపడి, తేమ 20% కన్నా తగ్గినప్పుడు కోత కోసుకోవాలి. హెక్టారుకు 2–4 టన్నుల ధన్యం దిగుబడి నిస్తుంది. పైపొట్టు తీసేస్తే 30–50% వరకు ముడిబియ్యం వస్తాయి. హెక్టారుకు 34 టన్నుల పచ్చిగడ్డి, 8 టన్నుల ఎండు గడ్డి పండుతుంది. ఇతర వివరాలకు.. డా. డేవిడ్ కమీ davidkamei81@gmail.com -
ఎత్తు మడులతో ఎంతో మేలు!
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నారు. ఓ యేడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. అధిక వర్షం కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో బురదగా మారి పత్తి పంటలో ఎదుగుదల లోపించి దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఎత్తు మడుల పద్ధతి (రైజ్డ్ బెడ్ సిస్టమ్) ద్వారా కేవీకే క్షేత్రంలో వర్షాధారంగా బీటీ పత్తి సాగు చేస్తున్నారు. వర్షాధారపు సాగులో ఆదిలాబాద్ ప్రాంతంలో సాధారణంగా ఎకరానికి 8–10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అయితే, ఎత్తుమడుల పద్ధతిలో ఎకరానికి 13–15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంటున్నారు. 15–20 సెం.మీ. ఎత్తున మడులు సమతల భూమి మీద గొర్రుతో తోలి సాళ్లుగా పత్తి విత్తుకోవడం సాధారణ పద్ధతి. ఎత్తు మడుల పద్ధతిలో ట్రాక్టర్‌కు రెయిజ్డ్ బెడ్ మేకర్ అనే పరికరాన్ని జోడించడం ద్వారా మడులు తోలుకొని పత్తి విత్తుకోవాలి. ఈ మడి 15–20 సెం.మీ. ఎత్తున ఉంటుంది. మడి వెడల్పు (ఆ భూమి స్వభావాన్ని బట్టి, అక్కడి వర్షపాతాన్ని బట్టి) ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మడి పైనే పత్తి విత్తనాలు నాటుతారు. పత్తి మొక్కలున్న ఎత్తు మడికి అటు ఇటు కాలువలు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు పంట చేలల్లో వర్షపు నీరు ఈ కాల్వల్లో మాత్రమే నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. వర్షాలు ఈ ఏడాది మాదిరిగా బాగా ఎక్కువగా కురిస్తే.. పత్తి మొక్కలు ఎత్తు మడిలో ఉంటాయి కాబట్టి ఉరకెత్తే ఇబ్బంది ఉండదు. మొక్కల వద్ద నీరు నిల్వ లేకపోవడంతో అవి ఏపుగా పెరుగుతాయి. గాలి సరిగా ఆడుతుంది. ఎండ బాగా తగులుతుంది. తెగుళ్లు కూడా అంతగా ఆశించవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వర్షాలు అంతగా లేనప్పుడు కూడా ఎత్తు మడి ఉపయోగపడుతుంది. వర్షానికి కాలువల్లో ఇంకిన నీటి తేమ ఉపయోగపడుతుంది. భారీ వర్షాల్లో కూడా పత్తి చేలు ఉరకెత్తకుండా ఉండే ఉపాయం ఏమైనా ఉందా? ఉందంటున్నారు ఆదిలాబాద్ కేవీకే శాస్త్రవేత్తలు. ఎత్తు మడుల (రెయిజ్డ్ బెడ్స్)పై పత్తిని విత్తుకుంటే అతివృష్టిని మాత్రమే కాదు, ఒకవేళ అనావృష్టి ఎదురైనా పంట సమర్థవంతంగా తట్టుకోగలుగుతుందని అంటున్నారు. పసుపు మాదిరిగా పత్తి, కంది, మిర్చి, వంగ తదితర కూరగాయలను సైతం ఎత్తు మడలపై సాగు చేస్తే.. వర్షాలు అటూ ఇటూ అయినా సరే 10–20% మేరకు దిగుబడి పెరుగుతుందంటున్నారు. రెండేళ్లుగా ప్రయోగాలు కేవీకే సమన్వయకర్త డా. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రైజ్డ్ బెడ్ సాగు పద్ధతికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. గతేడాది కేవీకేలో ఈ పద్ధతిలో ఎకరంలో పత్తి సాగు చేస్తే 12.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 5 ఎకరాల్లో వేశారు. మొక్కల సాళ్ల మధ్య 180“30 సెం.మీ., 150“20 సెం.మీ., 120“30 సెం.మీ.ల దూరంలో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తి పంట ఐదున్నర అడుగుల ఎత్తు వరకు ఏపుగా పెరిగింది. ఒక్కో మొక్కకు ప్రస్తుతం 50 కాయలున్నాయి. మరో 30 నుంచి 40 కాయలు కాచే విధంగా పూత ఉంది. పురుగులు, తెగుళ్లు లేవు. సాళ్ల మధ్య తగినంత ఖాళీ ఉండటంతో కలుపు నిర్మూలనకు మినీట్రాక్టర్తో పైపాటు చేస్తున్నారు. కాయలు కాసిన తర్వాత పొలంలో నీరు నిల్వ ఉంటే కాయలు మురిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ తగినంత వర్షం కురవకపోయినా, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు ఎడం వచ్చినా పంట బెట్టకు వచ్చి దిగుబడి తగ్గుతుంది. ఎత్తు మడుల పద్ధతి ద్వారా పంటలను సాగు చేయటం ఒక్కటే ఈ సమస్యలకు పరిష్కారం అని కేవీకే సమన్వయకర్త డా. ప్రవీణ్‌కుమార్ రైతులకు సూచిస్తున్నారు. – సుధాకర్ యేరా, సాక్షి, ఆదిలాబాద్ టౌన్ వర్షాలు అటూ ఇటూ అయినా అధిక దిగుబడి! వర్షాధార భూముల్లో ఎత్తు మడులపై పంటలను సాగు చేయటం ద్వారా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. వర్షాలు ఎక్కువైతే మడుల పక్కన కాలువల్లోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. పంట ఉరకెత్తదు. వర్షాలు తక్కువగా కురిసినా.. ఎక్కడి నీరు అక్కడే ఇంకుతుంది కాబట్టి భూమిలో తేమ ఉండి పంట దిగుబడి దెబ్బతినదు. అంటే.. వర్షాలు అటూ ఇటూ అయినా ఎత్తుమడుల వల్ల దిగుబడి దెబ్బతినదు. 10–20% అదనంగా దిగుబడి పొందవచ్చు. పసుపు మాదరిగా పత్తిని కూగా ఎత్తు మడుల్లో సాగు చేయవచ్చు. కంది, మిరప, వంగ వంటి కూరగాయలు కూడా ఇలా సాగు చేయవచ్చు. ట్రాక్టర్‌తో ఎత్తుమడులు తోలుకోవాలి. ఎర్ర నేలల్లో అయినా, నల్ల నేలల్లో అయినా సాగు చేయొచ్చు. తేలికపాటి, ఎర్ర నేలల్లో సాళ్ల మధ్య, మొక్కల మధ్య దూరం తక్కువగా పెట్టుకోవాలి. బలమైన నల్ల నేలల్లో అయితే కొంచెం ఎడంగా పెట్టుకోవాలి. ఎర్ర నేలల్లో మొక్కల సాంద్రత ఎక్కువగా, నల్లనేలల్లో తక్కువగా ఉంటుంది. మొదటి సారి గత ఏడాది నల్ల నేలలో 120“30 సెం.మీ. (సాళ్ల మధ్య 120 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ.) దూరంలో సాగు చేశాం. బాగా వత్తుగా అయ్యి పురుగుమందుల పిరికారీ ఇబ్బంది అయ్యింది. ఈ ఏడాది 150“30, 180“30 కొలతల్లో పత్తి విత్తాం. 180“30లో ఎకరానికి 7,400 మొక్కలు వచ్చాయి. మొక్కలు ఆరు అడుగులు ఎత్తు పెరిగాయి. సాళ్లు కూడా మూసుకుపోయాయి. ఈ ఏడాది ఎడతెరపి లేని వర్షాల్లో కూడా నీరు నిలవలేదు. పంట ఉరకెత్తలేదు. చీడపీడల్లేవు. చెట్టుకు 40–50 కాయలున్నాయి. ప్రస్తుతం ఉన్న పూతతో మరో 30 వరకు కాయలు వరకు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి ఖాయంగా వస్తుంది. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి, కలుపు గొర్రుతో తీస్తారా, ట్రాక్టర్‌తో తీస్తారా అన్నదాన్ని బట్టి రైతులు సాళ్ల మధ్య దూరాన్ని ఎంపిక చేసుకోవాలి. – డా. యాదగిరి ప్రవీణ్‌కుమార్ (99896 23829), సమన్వయకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ 24, 25 తేదీల్లో ఆన్లైన్ దేశీ విత్తనోత్సవం జాతీయ స్థాయిలో దేశీ విత్తనోత్సవాన్ని వినూత్నంగా తొట్టతొలిగా ఆన్లైన్లో ఈ నెల 24(శని)–25(ఆది) తేదీల్లో ఉ. 10 గం. నుంచి సా. 2.30 గం. వరకు జరగనుంది. భారత్ బీజ్ స్వరాజ్ మంచ్, ఆషా–కిసాన్ స్వరాజ్, సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్, సహజ సమృద్ధ సంస్థలు ఈ సంప్రదాయ విత్తన పరిరక్షణ కార్యక్రమాన్ని సంయుక్తంగా చేపట్టాయి. విలక్షణమైన సంప్రదాయ వంగడాలకు ఆలవాలం దేశం మనది. ప్రపంచంలో ఇంతటి సుసంపన్నమైన వ్యవసాయ జీవవైవిధ్యం కలిగిన అతి కొద్ది దేశాలలో భారత్ కూడా ఉంది. అమూల్యమైన ఈ వంగడాలను ఏటేటా సాగు చేస్తూ పరిరక్షించుకోవటం ఆహార భద్రత రీత్యా చాలా ముఖ్యమైన సంగతి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయ విత్తన పరిరక్షకులు వారి వద్ద ఉన్న వంగడాలను ఈ ఆన్లైన్ విత్తనోత్సవంలో ప్రదర్శిస్తారు. ఈ ఆన్లైన్ విత్తనోత్సవం చూడాలనుకునే వారు రెండు రోజులకు వేర్వేరుగా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి. మొదటి రోజు 24వ తేదీ నాటి విత్తనోత్సవంలో పాల్గొనదలచిన వారు ఈ క్రింది వెబ్ పేజీలో రిజిస్టర్ చేసుకోవాలి. https://tinyurl.com/SeedMelaDay1 రెండో రోజు 25వ తేదీ నాటి విత్తనోత్సవంలో పాల్గొనదలచిన వారు ఈ క్రింది వెబ్ పేజీలో రిజిస్టర్ చేసుకోవాలి. https://tinyurl.com/SeedMelaDay2 మట్టికి దగ్గరైతే మది తేలిక! కోవిడ్–19 కష్టకాలంలో స్వయంగా మట్టిలో విత్తనాలు వేసి సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయటం ప్రారంభించిన వారి మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడిందని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఇంటిపట్టున కూరగాయలు సాగు చేసుకునే వారికి శారీరక వ్యాయామం, ఆరోగ్యదాయకమైన కూరగాయలకు తోడు మానసిక స్వస్థత కూడా అభిస్తోందని ప్రిన్సెటన్ విశ్వవిద్యాలయం కరోనా కాలంలో చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ‘ప్రకృతిలో, మొక్కల మధ్య గడుపుతూ పెంచిన కూరగాయలను ఇరుగు పొరుగు వారితో పంచుకుంటూ ఉన్నప్పుడు వారి మదిలో స్థిమితత్వ భావన, గొప్ప సంతృప్తి, ఆనందం కలుగుతాయ’ని రొడేల్ ఇన్స్టిట్యూట్ కమ్యూనికేషన్స్ సంచాలకులు డయానా మార్టిన్ అన్నారు. కరోనా కాలంలో చాలా మంది ఉచిత కిచెన్ గార్డెన్ కిట్ తమ దగ్గర తీసుకొని కూరగాయల సాగు మొదలుపెట్టారన్నారు. -
సాగుకు సాంకేతికత జోడించాలి
బుక్కరాయసముద్రం (శింగనమల): మారిన పరిస్థితులకనుగుణంగా సాగులో సాంకేతికతను ఉపయోగిస్తేనే దిగుబడులు సాధ్యమవుతాయని జేఎన్టీయూ(ఏ) ఫ్రొఫెసర్ డాక్టర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో కోర్డినేటర్ డాక్టర్ లక్ష్మిరెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ‘‘సంకల్పంతో సిద్ధి’’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్షాలు లేక...వరుస కరువులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాకు సాగునీరు లేక పొలాలన్నీ బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతులు వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతులు ఏ యూనివర్శిటీల్లో చదువుకోక పోయినా శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఆలోచనలకు దీటుగా విజ్ఞానం కలిగి ఉన్నారన్నారు. వారికి ఆధునిక టెక్నాలజీ గురించి అవగాహన కల్పిస్తే బంగారు పంటలు పండిస్తారన్నారు. ఆ దిశగా శాస్ర్తవేత్తలు కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రైతులకు సోలార్ సిస్టింలు అందజేస్తే విద్యుత్ లేకుండా పంటలు పండించుకోవచ్చన్నారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వినిపించి రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీరామమూర్తి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ డాక్టర్ ఎల్లమందారెడ్డి, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి, రెడ్డిపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర, కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.