
పిల్లలూ.... ఈ ప్రకృతి దానిలో భాగమైన భూమి మనకు దొరికిన వరం. ఇది మనుషులైన మనతోపాటు అనేక జీవాలకు ఆవాసం. మరి అంతటి విలువైన ప్రకృతిని సంరక్షించు కోవాల్సిన మనం ఏం చేస్తున్నాం? అనేక రూపాల్లో రోజు రోజుకీ ద్వంసం చేస్తున్నాం.
కానీ మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజాం (Licypriya Kangujam) మాత్రం ‘ఈ సమస్త భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది’ అని తన ఆరేళ్ళ వయసు నుండి పర్యావరణ సమస్యల మీద అవగాహన కల్పించడం ప్రారంభించింది.
2011లో జన్మించిన ఈ బాలిక, 2018లో అంటే ఆరేళ్ళ వయసులో చైల్డ్ మూవ్‌మెంట్ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్ చేంజ్‌ను ఎదుర్కొనేందుకు పిల్లలను సమీకరించింది. లిసిప్రియా 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రసంగంలో పర్యావరణ రక్షణ కోసం యువత శక్తిని ఉపయోగించాలని నొక్కి చెప్పింది.
భారతదేశంలో క్లైమేట్ చేంజ్‌ను పాఠ్యాంశంలో చేర్చాలని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలని కోరింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె సందేశం లక్షల మంది యువతకు చేరడంతో ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డ్, 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డ్ వంటి పురస్కారాలు అందుకుంది. లిసిప్రియా, సమకాలీన సమాజంలో యువతకు స్ఫూర్తిగా నిలిచి, పర్యావరణ రక్షణ కోసం అవిశ్రాంత కృషి చేస్తోంది, భవిష్యత్ తరాలకు మార్గం సుగమం చేస్తూ. అంతేకాకుండా ప్రపంచ నాయకులను పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా కషిచేస్తుంది.