breaking news
Planet Earth
-
చిన్న వయసు నుంచే పర్యావరణ కోసం పోరాడుతోంది
పిల్లలూ.... ఈ ప్రకృతి దానిలో భాగమైన భూమి మనకు దొరికిన వరం. ఇది మనుషులైన మనతోపాటు అనేక జీవాలకు ఆవాసం. మరి అంతటి విలువైన ప్రకృతిని సంరక్షించు కోవాల్సిన మనం ఏం చేస్తున్నాం? అనేక రూపాల్లో రోజు రోజుకీ ద్వంసం చేస్తున్నాం. కానీ మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజాం (Licypriya Kangujam) మాత్రం ‘ఈ సమస్త భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది’ అని తన ఆరేళ్ళ వయసు నుండి పర్యావరణ సమస్యల మీద అవగాహన కల్పించడం ప్రారంభించింది. 2011లో జన్మించిన ఈ బాలిక, 2018లో అంటే ఆరేళ్ళ వయసులో చైల్డ్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్ చేంజ్‌ను ఎదుర్కొనేందుకు పిల్లలను సమీకరించింది. లిసిప్రియా 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రసంగంలో పర్యావరణ రక్షణ కోసం యువత శక్తిని ఉపయోగించాలని నొక్కి చెప్పింది. భారతదేశంలో క్లైమేట్ చేంజ్‌ను పాఠ్యాంశంలో చేర్చాలని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలని కోరింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె సందేశం లక్షల మంది యువతకు చేరడంతో ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డ్, 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డ్ వంటి పురస్కారాలు అందుకుంది. లిసిప్రియా, సమకాలీన సమాజంలో యువతకు స్ఫూర్తిగా నిలిచి, పర్యావరణ రక్షణ కోసం అవిశ్రాంత కృషి చేస్తోంది, భవిష్యత్ తరాలకు మార్గం సుగమం చేస్తూ. అంతేకాకుండా ప్రపంచ నాయకులను పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా కషిచేస్తుంది. -
వసంతపు వెలుగులు
సరిగ్గా సగ భాగం చీకట్లో, మరో సగం ఉదయపు కాంతుల్లో నిండుగా వెలిగిపోతూ కనిపిస్తున్న భూమిని చూస్తున్నారుగా! వసంత విషువత్తు (స్ప్రింగ్ ఈక్వినాక్స్) సందర్భంగా బుధవారం అంతరిక్షం నుంచి భూ గ్రహం ఇలా కని్పంచింది. అచ్చెరువొందించే ఈ ఫొటోను యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మెటరోలాజికల్ శాటిలైట్స్ (ఈయూఎంఈటీఎస్ఏటీ) విడుదల చేసింది. సంవత్సరంలో రెండు రోజులు భూమిపై రాత్రింబవళ్ల నిడివి సమానంగా ఉంటుంది. ఆ రోజుల్లో సూర్యుడు భూమధ్యరేఖపై నేరుగా ఉండటమే ఇందుకు కారణం. వీటినే విషువత్తులుగా పిలుస్తారు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఇవి ఏర్పడతాయి. మొదటిదైన వసంత విషువత్తు ఏటా మార్చి 20కి అటూ ఇటుగా వస్తుంది. ఆ రోజుతో ఉత్తరార్ధ గోళం అధికారికంగా శీతాకాలం నుంచి వసంత కాలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుంచి ఆ ప్రాంతంలో పగటికాలం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ రాత్రుళ్ల నిడివి తగ్గుతూ వస్తాయి. రెండోదైన శరది్వషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) సెపె్టంబర్ 22కు ఇటూ ఇటుగా వస్తుంది. విషువత్తులకు జ్యోతిశ్శాస్త్రంలో చాలా ప్రాధాన్యముంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇది మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకర సమయం
భూగ్రహాన్ని సంరక్షించుకునేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలి: హాకింగ్ లండన్: అభివృద్ధి మాటున మానవుడు చేస్తున్న విధ్వంసం తో భూగ్రహం తీవ్ర సంక్షోభా న్ని ఎదుర్కొంటోందని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అన్నారు. మానవజాతి చరిత్రలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన సమయమని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచం అనేక పర్యావరణ, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోందని, భూగ్రహంపై మానవజాతిని సంరక్షించుకునేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం మనం అనేక పర్యావరణ సవాళ్లు, వాతావరణ సమస్యలు, ఆహారధాన్యాల కొరత, అధిక జనాభా, అనేక జాతులు అంతరించి పోవడం, సముద్రాల్లో ఆమ్లశాతం పెరిగిపోవడం వంటి ప్రమాదకర సవాళ్లను ఎదుర్కొంటున్నామని, మానవాభివృద్ధి క్రమంలో మనం అత్యంత ప్రమాదకర దశకు చేరుకున్నామనే విషయాన్ని ఇవి గుర్తు చేస్తున్నాయని హాకింగ్ అన్నారు. ‘మనం నివసిస్తున్న ఈ గ్రహాన్ని నాశనం చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుతం మనం సమకూర్చుకున్నాం. కానీ దాన్నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని మాత్రం అభివృద్ధిచేసుకోలేకపోయాం. బహుశా మరి కొన్ని వందల ఏళ్ల తర్వాత ఇతర నక్షత్ర మండలాల్లో మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకోగలమేమో.. కానీ ప్రస్తుతా నికి మానవజాతికి ఉన్నది ఒక్క భూగ్రహం మాత్రమే. దీన్ని సంరక్షించుకోవడం అందరి బాధ్యత’ అని ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాకింగ్ పేర్కొన్నారు.


