అప్పు చేయడమంటే పరువు పోగొట్టుకోవడం అని ఒకప్పుడు అనుకునేవారు. అప్పు చేసి పప్పు కూడు తినకూడదన్న సామెతలు కూడా ఇలాగే పుట్టుకొచ్చాయి. కానీ కాలం మారింది. తరాలు మారిపోయాయి. అందుకు తగ్గట్టే విలువలూ వేరయ్యాయి. 2025నే ఉదాహరణగా తీసుకుందాం. ఈతరం వాళ్లు... అదేనండి జెన్-జీకి అప్పు చేయడంలో ఆరితేరిపోయారు.
చిన్న వయసులోనే మంచి ఆదాయం వస్తూండటం కారణం కావచ్చు... లేదా అప్పు చేయడం చాలా సులువై ఉండవచ్చునేమో కానీ.. జెన్-జీ బోలెడన్ని అప్పులు చేస్తోందన్నది వాస్తవం. అత్యవసరాల కోసమా? ఊహూ కానే కాదు... ఈ ఏడాది జెన్-జీ చేసిన అప్పుల్లో అత్యధికం విహారయాత్రలకట!
అవునండి.. నిజం.
దేశ ఆర్థిక వ్యవహారాల చరిత్రల్లో మొట్టమొదటి సారి విహార యాత్రల కోసం అప్పులు చేయడం ఇదే మొదటిసారి. అది కూడా పర్సనల్ లోన్స్! రెండో అతిపెద్ద కారణం స్టేటస్‌ను మెయిన్‌టెయిన్ చేయడం గమనార్హం.
వైద్యపరీక్షలు నిర్వహించే సంస్థ హెల్తియన్స్ నిర్వహించిన సర్వే ప్రకారం... పాత తరం మాదిరిగా ఆస్తులు కొనుక్కునేందుకో లేక అత్యవసరాల కోసమో జెన్-జీ అప్పులు చేయడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ లేదంటే పోస్టులు పెట్టేందుకు అనువైన ప్రదేశాలకు వెళ్లేందుకు చేస్తున్నాయి. అవి విదేశాలైనా సరే అస్సలు తగ్గడం లేదు. ఇవి కాదంటే సంగీత కచేరీలకు ఖర్చు పెడుతున్నారు. ఈ ఏడాది పర్సనల్ లోన్స్ తీసుకున్న జెన్-జీ వారిలో 27 శాతం మంది ఈ కారణాలు చెప్పినట్లు హెల్తియన్స్ సర్వే ద్వారా తెలిసింది.
అప్పు చేసేందుకు రెండో కారణం. లైఫ్‌స్టైల్. బ్రాండెడ్ దుస్తులు, స్నీకర్స్ కొనడం, కాస్ట్‌లీ రెస్టారెంట్లలో విందులు ఉంటున్నాయి. మోడర్న్ లైఫ్‌స్టయిల్ పేరుతో జెన్-జీ పర్సనల్ లోన్స్ తీసుకునేందుకు చూపుతున్న మూడో కారణం ‘టెక్-గాడ్జెట్స్’. ల్యాప్‌టాప్‌లు వేరబుల్స్, గాగుల్స్, పర్‌ఫ్యూమ్స్ వంటివి ఈ కోవకు చెందుతాయి. డిజిటల్ లోన్స్ క్షణాల్లో మంజూరవుతూండటం వీరికి కలిసివస్తోంది. ఆదాయంలో ఎంతో కొంత దాచుకుని అవసరాల కోసం లేదంటే బంధుమిత్రుల పెళ్లిల్లు, శుభకార్యాలకు వినియోగించడం మునుపటి తరం పద్ధతైతే... జెన్-జీ వీటి కోసం పొదుపు కంటే పర్సనల్ లోన్స్‌కే ప్రాధాన్యమిస్తోంది.
అప్పు కోసం రుణం..
ఈ తరం యువకుల్లో కనిపిస్తున్న ఇంకో పెద్ద ధోరణి అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయడం. అదేనండి.. క్రెడిట్‌కార్డు బ్యాలెన్స్‌ను చెల్లించేందుకు పర్సనల్ లోన్స్ చేస్తున్నట్టు ఈ సర్వే ద్వారా తెలిసింది. దురదృష్టవశాత్తూ ఇన్‌స్టంట్ లోన్స్ వంటివి యువతను శాశ్వతంగా రుణబంధంలో ఉండిపోయేందుకు కారణాలవుతున్నాయి. బ్యాంకుల ద్వారా పొందే రుణాల కంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అప్పులపై వడ్డీలు చాలా ఎక్కువ కావడం గమనార్హం.
జెన్-జీలో చాలా తక్కువమందికి ఆర్థిక వ్యవహారాల విషయంలో అవగాహన ఉండటం కూడా వారు పర్సనల్ లోన్స్ తీసుకునేందుకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏతావాతా.. వినియోగమే ప్రధానంగా అప్పులు చేయడమన్న ట్రెండ్ మొదలైందన్నమాట. పొదుపునకు ఎగనామం పెట్టేస్తున్నారని అనుకోవాలి.


