ఆ వెదురులో మంచుయుగపు గుట్టు  | 37,000 years old bamboo from Manipur just exposed an Ice Age mystery | Sakshi
Sakshi News home page

ఆ వెదురులో మంచుయుగపు గుట్టు 

Nov 29 2025 5:55 AM | Updated on Nov 29 2025 5:55 AM

37,000 years old bamboo from Manipur just exposed an Ice Age mystery

ఇంఫాల్‌ లోయలో వెదురు శిలాజాలు 

ఆసియాలోనే అతి పురాతనమైనవి 

వెదురులో మురళి దాగుంటుందన్నది తెలిసిందే. అయితే మణిపూర్‌లోని అతి పురాతన వెదురు శిలాజాల్లో మాత్రం మన దేశపు మంచు యుగానికి సంబంధించిన 
పలు రహస్యాలే దాగున్నాయి! అంతేనా? భారత్‌తో పాటు ఆసియా ఖండపు వృక్షశాస్త్ర చరిత్ర గతినే అవి సమూలంగా మార్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు...!

అది అలాంటిలాంటి శిలాజం కాదు. ఏకంగా 37,000 ఏళ్లనాటి వెదురు తాలూకు అత్యంత అరుదైన శిలాజం. ఎందుకంత అరుదైనదీ అంటే వెదురు శిలాజ రూపు దా
ల్చడం కనాకష్టం. దాని లోపలంతా బోలుగా ఉండటమే అందుకు కారణం. దాంతో అతి త్వరగా కుళ్లి మట్టిలో కలిసిపోతుంది. 

అలాంటి వెదురు తాలూకు అతి పురాతన శిలాజాన్ని మణిపూర్‌లోని ఇంఫాల్‌ లోయ ప్రాంతంలో సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. అది ఇప్పటిదాకా వెల్లడించిన, ఇకపై జరిపే పరిశోధనల్లో బయటపెట్టబోయే రహస్యాలు భారత్‌తో పాటు ఆసియా వృక్షశాస్త్ర చరిత్రనే తిరగ రాయగలవని భావిస్తున్నారు. 

ఇంఫాల్‌ లోయ ప్రాంతంలో చిరాంగ్‌ నదీ తీరాన ఇసుక మేటలు అధికంగా ఉండే చోట ఈ వెదురు శిలాజాలు వెలుగు చూశాయి. ఆసియా ప్రాంతంలో మంచుయుగపు అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని వెదురు తన ఉనికిని కాపాడుకుందనేందుకు ఈ శిలాజాలు తిరుగులేని నిదర్శనమని సైంటిస్టులు చెబుతున్నారు. 

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ బృందంతో కలిసి బీర్బల్‌ సాహ్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియోసైన్సెస్‌ (బీఎస్‌ఐపీ) సైంటిస్టులు ఈ శిలాజాలపై ముమ్మరంగా పలు పరిశోధనలు జరుపుతున్నారు. వాటి తాలూకు పలు భాగాలను ఒక్కొక్కటిగా దుర్భిణి వేసి మరీ పరిశీలిస్తున్నారు. నాటి ప్రతికూల పరిస్థితుల్లో ఉనికిని కాపాడుకునేందుకు అవి ఎలాంటి పద్ధతులను అవలంబించిందీ క్రమంగా వెలుగులోకి వస్తోందని     వారు చెబుతున్నారు. శిలాజ రూపు దాల్చిన వెదురు జాతిని జెనస్‌ చిమొనోబాంబూసాగా గుర్తించారు. 

సహచరులు మాయమైనా... 
మంచుయుగం తాలూకు అతి ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా చాలారకాల వెదురు జాతులు అంతర్ధానమైపోయాయి. యూరప్‌ మొదలుకుని అమెరికా ఖండాల దాకా ఇదే పరిస్థితి. అయినా మణిపూర్‌లోని ఈ జెనస్‌ జాతి తట్టుకుని నిలవడానికి కారణాలన్నింటినీ కనిపెట్టేందుకు సైంటిస్టుల బృందం అన్నిరకాలుగానూ ప్రయతి్నస్తోంది. 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శిలాజాల తాలూకు విడిభాగాలను ఒక్కొక్కటిగా మథిస్తోంది. ‘‘ఈశాన్య భారతంలోని అపార జీవవైవిధ్యం కారణంగా మంచుయుగపు ప్రభావం ఇక్కడ మరీ ఎక్కువగా పడి ఉండకపోవచ్చు. ఈ వెదురు జాతులు ఆ కష్టకాలాన్ని గట్టెక్కి మనుగడ సాగించేందుకు అదే కారణం కావచ్చు’’అన్న వాదనల్లోని నిజానిజాలను కూడా నిగ్గుదేల్చేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. ఈ పరిశోధన వివరాలను పాలయోబోటనీ, పాలియాలజీ జర్నల్‌ రివ్యూలో ప్రచురించారు. 

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement
 
Advertisement
Advertisement