భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమగ్రమైన బ్లూప్రింట్‌ను ప్రతిపాదించింది. ముఖ్యంగా నాన్-స్ట్రాటెజిక్ రంగాల్లో(జాతీయ భద్రత, క్లిష్టమైన మౌలిక సదుపాయాలు లేదా అత్యవసర సేవలతో సంబంధం లేని రంగాలు) ప్రభుత్వ వాటాలను తగ్గించడం ద్వారా సుమారు రూ.10 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చుకోవచ్చని అంచనా వేసింది.
2026-27 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రైవేటీకరణ అనేది సుదీర్ఘ ప్రక్రియ కావడంతో మధ్యంతర చర్యగా నిర్ణీత కాలపరిమితితో కూడిన డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) విధానాన్ని సీఐఐ సూచించింది.
రూ.10 లక్షల కోట్ల ప్రణాళిక ఇలా..
సీఐఐ విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన 78 పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎస్‌ఈ)లో ప్రభుత్వ వాటాను దశలవారీగా తగ్గించడం ద్వారా భారీ నిధులను సమీకరించవచ్చు.
మొదటి దశలో.. ప్రభుత్వం సుమారు రెండు సంవత్సరాల కాలపరిమితిలో 55 ప్రభుత్వ రంగ సంస్థలపై దృష్టి సారించాలని సీఐఐ సూచించింది. ప్రస్తుతం ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటా 75 శాతం వరకు ఉంది. ఈ సంస్థల నుంచి వాటాల ఉపసంహరణ ద్వారా దాదాపు రూ.4.6 లక్షల కోట్లు సమీకరించే అవకాశం ఉందని పేర్కొంది. తక్కువ వాటా ఉన్న సంస్థలను ముందుగా ఎంచుకోవడం వల్ల ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని సీఐఐ భావిస్తోంది.
రెండో దశలో.. ప్రభుత్వం మిగిలిన 23 ప్రభుత్వ రంగ సంస్థలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ సంస్థల్లో ప్రస్తుతం ప్రభుత్వ వాటా 75 శాతం కంటే ఎక్కువగా ఉంది. వీటిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా అదనంగా మరో రూ.5.4 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందే వీలుందని సీఐఐ తన విశ్లేషణలో వెల్లడించింది. ఇలా దశలవారీగా పకడ్బందీగా ముందుకు వెళ్లడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వనరులను సమకూర్చుకోవచ్చని స్పష్టం చేసింది.
ప్రస్తుతం బడ్జెట్ పత్రాల్లో ‘డిస్‌ఇన్వెస్ట్‌మెంట్’ అనే పదానికి బదులుగా ‘మిసెలేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్’ అనే పదాన్ని వాడుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో రూ.47,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటివరకు వివిధ మార్గాల్లో రూ.27,500 కోట్లు సమకూరాయి.
ప్రైవేటీకరణ ప్రక్రియకు సూచనలు
ప్రభుత్వం తనకు నచ్చిన సంస్థను అమ్మకానికి పెట్టడం కంటే, మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు ఏ సంస్థలపై ఆసక్తి ఉందో ముందుగా అంచనా వేయాలి.
డిమాండ్ ఎక్కువగా ఉన్న సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇన్వెస్టర్లకు ముందస్తు ప్లానింగ్ కోసం వీలుగా, రాబోయే మూడేళ్లలో ఏయే సంస్థలను ప్రైవేటీకరణ చేయబోతున్నారో ప్రభుత్వం స్పష్టమైన క్యాలెండర్‌ను ప్రకటించాలి.
ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా మినిస్టీరియల్ బోర్డ్, నిపుణులతో కూడిన అడ్వైజరీ బోర్డ్, ఎగ్జిక్యూషన్ కోసం ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేయాలి.
నేరుగా ప్రైవేటీకరణ సాధ్యం కాకపోతే ముందుగా ప్రభుత్వ వాటాను 51 శాతానికి తగ్గించి, ఆ తర్వాత క్రమంగా 33 నుంచి 26 శాతానికి తీసుకురావాలి.
ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక


