
దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు వీలుగా కీలక సంస్కరణల అజెండాను భారతీయ పరిశ్రమల సమాఖ్య కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. సులభతర జీఎస్‌టీ నిర్మాణం ఉండాలంటూ అందులోకి పెట్రోలియం, రియల్ ఎస్టేట్‌ను కూడా చేర్చాలని సూచించింది. జాతీయ స్థాయిలో ఉపాధి, తాత్కాలిక కార్మికుల పని విధానాలను తీసుకురావాలని కోరింది. ‘పోటీతత్వంతో కూడిన భారత్ కోసం విధానాలు’ పేరుతో తన నివేదికలో 250కు పైగా సిఫారసలు చేసింది. ఇందులో 14 కీలక సంస్కరణల విభాగాలనూ ప్రస్తావించింది.
2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధనకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమల నేతలు, ఆర్థికవేత్తలు, విధానపరమైన నిపుణులతో సంప్రదింపుల అనంతరం సీఐఐ ఈ నివేదికను రూపొందించింది. ద్రవ్య క్రమశిక్షణ, ద్రవ్యోల్బణం నియంత్రణ, అధునాత గణాంకాల విధానాలు, వ్యూహాత్మకం కాని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, సావరీన్ వెల్త్ ఫండ్ ఏర్పాటు, స్వల్ప ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించకపోవడం, సకాలంలో అనుమతులు, సింగిల్ విండో అనుమతులు, రెండో తరం దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సంస్కరణలు, క్రమబద్ధీకరణతో కూడిన కార్మిక చట్టాలు, కనీస వేతన కార్యాచరణ, వివాదాలను వేగంగా పరిష్కరించడం వంటి సూచనలు ఈ నివేదికలో ఉన్నాయి.
ఇక ఇంధన రంగానికి సంబంధించి.. పోటీతో కూడిన టారిఫ్‌లు, క్రాస్ సబ్సిడీని తొలగించడం, బలమైన ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌లు, న్యూక్లియర్ విద్యుత్‌లో ప్రైవేటు రంగానికి చోటు కల్పించడం, గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను సూచించింది. ఈ కామర్స్ ఎగుమతులకు సంబంధించి ప్రత్యేక విధానం, మూలధన మద్దతుతో తయారీకి ఊతం, పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటు, రవాణా అనుసంధానత తదితర చర్యలను తన నివేదికలో ప్రస్తావించింది.
ప్రభుత్వ సంస్కరణలకు అనుగుణంగానే..
ఈ నివేదికపై సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ మాట్లాడుతూ.. ‘‘ఈ సిఫారసులు ప్రభుత్వ సంస్కరణల పథానికి అనుగుణంగా ఉన్నాయి. అంతేకాదు సాహసోపేత, పరివర్తనాత్మక మార్పు కోసం ప్రధాని ఇచ్చిన పిలుపునకు మద్దతుగా ఉన్నాయి. భారత పోటీతత్వం కోసం తీసుకోవాల్సిన చర్యలు, విధాన నిర్ణేతలకు తాజా ఐడియాలు ఇందులో ఉన్నాయి’’అని పేర్కొన్నారు. ఈ చర్యలు వృద్ధిని వేగవంతం చేస్తాయని, ఉపాధి కల్పనను విస్తృతం చేస్తాయని, వికసిత్ భారత్ దిశగా చేరువ చేస్తాయని సీఐఐ అభిప్రాయపడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి భారత్ చేరువ అవుతున్నందున.. అంతర్జాతీయంగా మరింత పోటీ పడేందుకు వీలుగా ఈ సంస్కరణలు అవసరమని సీఐఐ మాజీ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ సైతం అభిప్రాయపడ్డారు.