విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూప్ విజేతగా బీహార్ నిలిచింది. మంగళవారం రాంచీ వేదికగా జరిగిన ఫైనల్‌లో 6 వికెట్ల తేడాతో మణిపూర్‌ను చిత్తు చేసిన బీహార్.. ఈ దేశవాళీ వన్డే టోర్నీ టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 47.5 ఓవర్లలో కేవలం 169 పరుగులకే కుప్పకూలింది.
బీహార్ స్పిన్నర్ షబీర్ ఖాన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి మణిపూర్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు హిమాన్షు తివారీ 3 వికెట్లు సాధించాడు. మణిపూర్ బ్యాటర్లలో ఉలెనయ్ ఖ్వేరాక్‌పమ్(61), ఫిరాయిజామ్ జోటిన్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని బీహార్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 31.2 ఓవర్లలో చేధించింది.
బీహార్ బ్యాటర్లలో ఆయుష్ లోహరుక 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మంగల్ మహరౌర్(32), ఆకాష్ రాజ్(20) రాణించారు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ షబీర్ ఖాన్‌కు దక్కగా.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా ఫిరాయిజామ్ జోటిన్ నిలిచాడు. కాగా ఈ సీజన్‌లో బీహార్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది.
ఫైనల్‌లో కూడా అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా ఈ టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్‌పై బీహార్ 574 పరుగుల భారీ స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అదేవిధంగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ తరపున కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే జాతీయ విధుల కారణంగా టోర్నీ మధ్యలోనే వైభవ్ వైదొలిగాడు.
చదవండి: ‘రీఎంట్రీ’లో శుబ్‌మన్ గిల్ అట్టర్‌ఫ్లాప్


