న్యూఢిల్లీ: రైలు బోగీలో అసభ్యంగా ప్రవర్తించిన సివిల్ జడ్జిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయాధికారితోపాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్‌లో 2011లో నియమితులైన కాల్‌స్–2 సివిల్ జడ్జి ఒకరు 2018లో రైలులో ప్రయాణిస్తూ మద్యం మత్తులో తన బోగీలో ఇతర ప్రయాణికులను వేధించడంతోపాటు ఓ ప్రయాణికురాలిని బెర్త్‌కు ఎదురుగా మూత్ర విసర్జన చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దీతో, ప్రయాణికులు చైన్‌లాగి రైలును ఆపేశారు. ఆయన కారణంగా రైలు ఆలస్యమైంది. ఆ జడ్జిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.
విచారణ జరిపిన జబల్పూర్‌లోని స్పెషల్ రైల్వే మేజిస్ట్రేట్.. ఆ జడ్జిపై కేసును 2019లో కొట్టివేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో హైకోర్టు ఫుల్ బెంచ్ ఆ జడ్జిని విధుల నుంచి తొలగిస్తూ 2019లో ఉత్తర్వులిచ్చింది. అనంతరం జడ్జి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఫుల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. ఆ జడ్జిని 15 రోజుల్లోగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.
ఈ తీర్పును హైకోర్టు పరిపాలనా విభాగం సుప్రీంలో సవాల్ చేసింది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోందని, అసహ్యంగా ప్రవర్తించిన ఆ న్యాయాధికారిని డిస్మిస్ చేయాల్సిందేనని సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని, సంబంధిత న్యాయాధికారితోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.


