రేడియో సిలోన్ @ 100
‘భాయో ఔర్ బెహనో!’.. ఈ గంభీరమైన స్వరం వినిపించగానే భారతీయుల ఇళ్లలో సమయం స్తంభించిపోయేది. టీవీలు లేని కాలంలో.. ఇంటర్నెట్ ఊసే లేని రోజుల్లో.. సరిహద్దులు దాటి వచ్చి మన గుండె తలుపులు తట్టిన ఆ అద్భుతమే ’రేడియో సిలోన్’. ఆసియాలోనే మొదటి కమర్షియల్ షార్ట్–వేవ్ స్టేషన్‌గా వెలిగిన ఈ రేడియో, ఈ వారంతో విజయవంతంగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఒక చరిత్ర.. ఒక ప్రస్థానం
డిసెంబర్ 16, 1925న అధికారికంగా ప్రారంభమైన ఈ రేడియో సర్వీస్, ఆసియాలోనే అతిపెద్ద రికార్డెడ్ సాంగ్స్ లైబ్రరీని కలిగి ఉంది. భారత్‌లో కూడా దొరకని అరుదైన హిందీ పాటల రికార్డులు, ప్రపంచ దేశాల నేతల గొంతులు ఇక్కడ భద్రంగా ఉండటం విశేషం. 1949లో ’రేడియో సిలోన్’గా మారి, 1967లో ’శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎల్‌బీసీ)గా రూపాంతరం చెందినా, శ్రోతల మనసుల్లో మాత్రం అది ఎప్పటికీ ’రేడియో సిలోన్’ మాత్రమే..
అమీన్ సయానీ మ్యాజిక్..
ప్రతి బుధవారం రాత్రి 8 గంటలవుతోందంటే చాలు.. రేడియో దగ్గర జనం గుమిగూడేవారు. అమీన్ సయానీ తన అద్భుత గళంతో హిందీ సినిమా పాటల ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుంటే, ఆ ఉత్కంఠే వేరు. 1952 నుండి 1988 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ’బినాకా గీత్‌మాల’ భారతీయులను ఉర్రూతలూగించింది. నేటికీ శ్రీలంక రేడియోలో ’కోరా కాగజ్ థా యే మన్ మేరా’ వంటి పాత బాలీవుడ్ పాటలు వినిపిస్తుంటే, అదొక మధురమైన కాలయానమే..
పీవో బాక్స్ 574.. ఉత్తరాల వెల్లువ
అప్పట్లో రేడియో సిలోన్‌కు వచ్చే ఉత్తరాల సంఖ్య చూసి శ్రీలంక తపాలా శాఖ ఆశ్చర్యపోయేదట. ముఖ్యంగా ’ఆల్ ఆసియా
ఇంగ్లిష్ సర్వీస్’ కోసం భారత్ నుండి వేల సంఖ్యలో ఉత్తరాలు వచ్చేవి. ‘అప్పట్లో ఉత్తరాల వెల్లువను తట్టుకోవడానికి ‘పీవో బాక్స్ 574, కొలంబో’ అనే ప్రత్యేక చిరునామాను సృష్టించాల్సి వచ్చింది. చిత్రమేమిటంటే, ఆ ఉత్తరాల్లో అత్యధికం సికింద్రాబాద్ నుండే వచ్చేవి. ఆ తర్వాత ముంబై, షిల్లాంగ్ నుంచి ఉండేవి’.. అని ప్రస్తుత నిర్వాహకులు గుర్తు చేసుకుంటున్నారు.
ప్రపంచ పరిణామాలకు సాక్షి
ప్రస్తుతం ఎల్‌బీసీ సింహళ, తమిళ, ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సేవలు అందిస్తోంది. 70,000కు పైగా మ్యూజిక్ రికార్డులు, 78 ఆర్‌పీఎం నాటి పాత కాలపు రికార్డుల నుండి నేటి డిజిటల్ యుగం వరకు ఈ రేడియో అన్నీ చూసేసింది. ఎవరెస్ట్ శిఖరారోహణ వార్త దగ్గర నుండి, మనిషి చంద్రుడిపై అడుగు పెట్టిన విశేషాల వరకు ప్రపంచ పరిణామాలన్నింటికీ సాక్షిగా నిలిచింది.
తరాలు మారినా.. తరగని మమకారం
ప్రైవేట్ రేడియోలు, మ్యూజిక్ యాప్‌లు ఎన్ని వచ్చినా.. రేడియో సిలోన్ అందించిన ఆ అనుభూతి సాటిలేనిది. క్లాసికల్ నుండి పాప్ వరకు, జాజ్ నుండి కంట్రీ మ్యూజిక్ వరకు శ్రోతలకు షడ్రసోపేతమైన విందు వడ్డించిన ఈ రేడియో సర్వీస్, మరో వందేళ్ల పాటు తన ప్రయాణాన్ని దిగి్వజయంగా కొనసాగించాలని కోరుకుందాం.
– సాక్షి, నేషనల్ డెస్క్


