ఇండియా టీచింగ్‌..వరల్డ్‌ లెర్నింగ్‌ | Indian edtech platforms expanding globally | Sakshi
Sakshi News home page

ఇండియా టీచింగ్‌..వరల్డ్‌ లెర్నింగ్‌

Feb 5 2026 6:05 AM | Updated on Feb 5 2026 7:13 AM

Indian edtech platforms expanding globally

దేశీ ఎడ్‌టెక్‌ ఎక్స్‌పోర్ట్‌ స్టోరీ స్టార్ట్‌ 

థాయ్, వియత్నాం టార్గెట్‌ 

బెంగళూరు నుంచి బ్యాంకాక్‌ వరకు ఎడ్‌టెక్‌ దూకుడు 

యూఏఈ నుంచి ఇండోనేసియా వరకు మన కంపెనీల హవా 

క్యూలో అప్‌గ్రాడ్, సింఫ్లీలెర్న్, బ్రైట్‌చాన్స్‌  

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 25 శాతం వరకు ఆదాయం

దేశీ ఎడ్‌టెక్‌ కంపెనీలు అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో విదేశాల బాట పడుతున్నాయి. పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు విద్యా వ్యాపారాన్ని దూకుడుగా  విస్తరిస్తున్నాయి.  అప్‌గ్రాడ్, సింప్లీలెర్న్, బ్రైట్‌చాన్స్‌ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి. మన ఎడ్‌టెక్‌ కంపెనీలు ప్రధానంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియాపై దృష్టి పెడుతున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వియత్నాం, థాయ్‌ల్యాండ్, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్‌లాంటి మార్కెట్లలో విస్తరిస్తున్నాయి. ఆయా మార్కెట్లలో వినియోగదారుల ప్రొఫైల్‌ దాదాపు మన దేశం తరహాలోనే ఉండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

థాయ్, వియత్నాంలో అప్‌గ్రాడ్‌: టీమ్‌లీజ్‌ గణాంకాల ప్రకారం ఆగ్నేయాసియా, ఆఫ్రికా తదితర మార్కెట్లలో 35 ఏళ్ల లోపు వయస్సు గల వారు 2 కోట్ల మంది పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలపై మన సంస్థలు దృష్టి పెడుతున్నాయి. బెంగళూరుకు చెందిన అప్‌గ్రాడ్‌ సంస్థ థాయ్‌ల్యాండ్, వియత్నాంలో కార్యకలాపాలు విస్తరించింది. అలాగే యూఏఈ, మేనా ప్రాంతంలో (మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా) వర్క్‌ఫోర్స్‌ శిక్షణకు సంబంధించి వివిధ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే సింప్లీలెర్న్‌ కంపెనీ వివిధ సంస్థలు, ప్రభుత్వాల భాగస్వామ్యాలతో అమెరికా, బ్రిటన్, పశ్చిమాసియావ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక కిడ్స్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం అయిన బ్రైట్‌ఛాంప్స్‌ సంస్థ ఏకంగా 30 పైగా దేశాల్లో విస్తరించింది. యూఏఈ, సౌదీ అరేబియా, వియత్నాం మొదలైనవి వీటిలో ఉన్నాయి.  

ఆకర్షణీయంగా ఆగ్నేయాసియా: వియత్నాం, థాయ్‌ల్యాండ్‌ లాంటి ఆగ్నేయాసియా దేశాలు వేగంగా డిజిటల్‌ ఎకానమీలుగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో కెరియర్‌ పురోగతికి సంబంధించిన కోర్సులను నేర్చుకోవడంపై పెరుగుతున్న ఆసక్తిని అవకాశంగా మల్చుకోవడంపై ఎడ్‌టెక్‌ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. 2024–25లో అప్‌గ్రాడ్‌ ఆదాయంలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 20–25 శాతంగా నమోదైంది. అటు సింప్లీలెర్న్‌ అంతర్జాతీయ యూజర్లలో 11 శాతం మంది బ్రిటన్, పశ్చిమాసియాలో ఉన్నారు. ఇక తమ గ్లోబల్‌ యూజర్లలో 30 శాతం మంది ఆగ్నేయాసియా, దక్షిణాసియా వారు ఉన్నారని బ్రైట్‌ఛాంప్స్‌ పేర్కొంది.  

అంతర్జాతీయంగా పోటీ: మన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్నప్పటికీ అంతర్జాతీయ దిగ్గజాల నుంచి పోటీ ఎదుర్కొనాల్సి వస్తోంది. యుడెమి, ఎరుడైటస్, యుడాసిటీ, కోర్సెరాలాంటి గ్లోబల్‌ సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో దూకుడుగా విస్తరిస్తున్నాయి. తమకు విదేశీ మార్కెట్లలో కోర్సెరా, ఎరుడైటస్‌ నుంచి పోటీ ఉంటోందని అప్‌గ్రేడ్‌ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో ఎమెరిటస్, కోర్సెరా, యుడాసిటీలను సింప్లీలెర్న్‌ ఢీకొంటోంది. మిగతా సంస్థలతో పోలిస్తే తక్కువ వ్యయాలతో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా దేశీ కంపెనీలు.. ఆయా మార్కెట్లలో పటిష్టపడేందుకు ప్రయతి్నస్తున్నాయి.  లీడ్‌ గ్రూప్‌ ఈ ఏడాది 1,200 పాఠశాలలతో భాగస్వామ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది.

సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement