ఇషా అంబానీ నాయకత్వంలో.. రిలయన్స్ రిటైల్ 2025లో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఏడాది ముగిసే సమయానికి దేశంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య 7000 కంటే ఎక్కువ నగరాల్లో.. 20వేలకు చేరుకుంది. ఇందులో ఒక బిలియన్ కంటే ఎక్కువ కస్టమర్ లావాదేవీలను నెరవేర్చడమే కాకుండా.. లక్షలాది మంది భారతీయులకు ప్రాథమిక షాపింగ్ గమ్యస్థానంగా దాని స్థానాన్ని బలోపేతం చేసింది.
రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో.. ఫిజికల్ స్టోర్లే మొత్తం వ్యవస్థకు వెన్నెముక అని ఇషా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది వస్తువులను ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లో డెలివరీ చేసేలా లాజిస్టిక్స్‌ను మార్చారు. 600 కొత్త డార్క్ స్టోర్లు ఏర్పాటు చేశారు. జియోమార్ట్ 1,000కి పైగా నగరాల్లో విస్తరించింది. Ajio Rush ద్వారా ఫ్యాషన్ ఉత్పత్తులు కూడా డెలివరీ చేయడం ప్రారంభమైంది. ఇవన్నీ కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడ్డాయి.
గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను.. భారతీయులకు చేరువ చేయడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'షీన్' బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువతను ఆకట్టుకున్నారు. ఫ్రెంచ్ బ్రాండ్ Maje, యువత కోసం Yousta, Azorte వంటివాటిని పరిచయం చేశారు. వీటికి పట్టణాల్లో మంచి ఆదరణ లభించింది.
ప్రజలను ఆకట్టుకునే ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో.. రిలయన్స్ రిటైల్ ఆర్థికంగా 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ FMCG విభాగం, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), దాని రెండవ సంవత్సరంలోనే రూ.11,500 కోట్ల మైలురాయి టర్నోవర్‌ను సాధించింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఏటా 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.


