రొయ్యలకు దేశంలోనే డిమాండ్‌ పెంచాలి! | Sagubadi: Aqua Scientist Dr Vijay Gupta Interview with Sakshi | Sakshi
Sakshi News home page

రొయ్యలకు దేశంలోనే డిమాండ్‌ పెంచాలి!

Sep 30 2025 2:45 AM | Updated on Sep 30 2025 2:45 AM

Sagubadi: Aqua Scientist Dr Vijay Gupta Interview with Sakshi

వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ విజేత, సన్‌హాక్‌ పీస్‌ ప్రైజ్‌ గ్రహీత, ప్రముఖ ఆక్వా శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ్‌ గుప్తాతో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి

ఆక్వాకల్చర్‌ ప్రపంచంలో రాణించిన అరుదైన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ్‌ గుప్తా. 86 ఏళ్ల క్రితం బాపట్ల జిల్లాలో పుట్టారు. ఆక్వా కల్చర్‌ నిపుణుడిగా లావోస్‌ నుంచి బంగ్లాదేశ్‌ వరకు 22 ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విశేష సేవలందించారు. సామాన్య ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చారు. నిస్వార్థ సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రపంచ ఆహార పురస్కారం’ (2005), నోబెల్‌తో సరితూగే ‘సన్‌హాక్‌ శాంతి పురస్కారం ’(2015) అందుకున్నారు.

పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో నివసిస్తున్న డా. విజయ్‌ గుప్తాను ‘సాక్షి సాగుబడి’ పలుకరించింది. ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో అమెరికాయేతర మార్కెట్లను వెతకటంతో పాటు.. దేశీయ మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి చేపలు, రొయ్యలకు డిమాండ్‌ పెంచుకోవటానికి పుష్కలంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యాంశాలు..

86 ఏళ్ల వయసులో 66లా ఉన్నారు.. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?
డా. విజయ్‌ గుప్తా: ఏమీ లేదు. కష్టపడి పనిచెయ్యటమే. పనితో వయసును జోడించి చూడకూడదండి.. మీరు చెయ్యగలిగినంత కాలం పని చేస్తూనే ఉండాలి. జీవితంలో మీరు ఏమి చెయ్యదలచుకున్నారో ఆ పనిలో సంతృప్తి కోసం పాటుపడాలి. చాలా మంది ధనంలోనే సంతృప్తిని వెదుక్కుంటూ ఉంటారు. కానీ, అది వాస్తవం కాదు. ధనార్జన ఇచ్చే సంతృప్తి పరిమితమైనది. మీరు ఎవరికైనా సహాయంతో అభివృద్ధి చెందిన వాళ్లు చూపే ఆదరణతో లభించే ఆత్మసంతృప్తి అనంతమైనది.
2015లో దక్షిణ కొరియా ప్రభుత్వం సన్‌హాక్‌ శాంతి బహుమతి నాకు ఇచ్చింది.

దానికి ముందు నేను గతంలో పనిచేసిన దేశాల్లో ప్రజల స్పందనను తెలుసుకునేందుకు నాతో పాటు పాత్రికేయులను పర్యటనకు పంపింది. బంగ్లాదేశ్‌లో ఆరేళ్లు పనిచేసిన నేను పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అక్కడి గ్రామాల్లోకి వెళ్తే.. మహిళా రైతులు నన్ను గుర్తిపట్టి చాలా సంబరపడ్డారు. మీరు నేర్పిన ఆక్వా సాగు వల్ల మా పూరి గుడిసెలు ఇప్పుడు పక్కా భవనాలయ్యాయని చూపించి కృతజ్ఞతలు తెలిపారు. ఆ క్షణాల్లో వారి మొహాల్లో నవ్వును చూసినప్పుడు నాకు 
ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది. అది ఏ బహుమతులతోనూ దొరకదు..!

బంగ్లాదేశ్‌ ఆక్వా రైతు మిమ్మల్ని అంతగా గుర్తుపెట్టుకోవటానికి కారణం ఏమిటి?
అక్కడ ఆరేళ్లు పనిచేశా. బంగ్లాదేశ్‌ అంతా లోతట్టు ప్రాంతం. స్థానికంగా ప్రజలు గుంతలు తవ్విన మట్టిని ఎత్తుగా పోసి, వాటిపైన గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు. ఆ గుంతల్లో గుర్రపుడెక్క, దోమలు పెరిగి సమస్యగా ఉండేది. తినటానికి జనానికి తిండి లేదు. అటువంటి స్థితిలో ఆ చిన్న గుంతల్లోనే పెంచుకొని తినే చిన్న సైజు చేపల సాగు సాంకేతికతలను అభివృద్ధి చేశాం. స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతుల బృందాలను కూడగట్టాం. ఉమ్మడి బాధ్యతతో కూడిన బృంద రుణాలు ఇప్పించాం. తద్వారా పేద రైతులను అధిక వడ్డీల విషచక్రం నుంచి, ఆహార అభద్రత నుంచి బయటపడేశాం. యూఎన్‌ఎయిడ్‌ చరిత్రలోనే బెస్ట్‌ ప్రాజెక్ట్‌గా మాకు గుర్తింపు రావటం ఓ మధుర స్మృతి.  

ప్రభుత్వం అందుకు ఏం చెయ్యొచ్చు..?
ఒక్క రొయ్యలకే కాదు, చేపలకు కూడా మన నగరాలు, పట్టణాల్లో అపారమైన మార్కెటింగ్‌ అవకాశాలున్నాయి. ప్రొటీన్‌ ఆహారానికి డిమాండ్‌ ఉన్నా చేపలు, రొయ్యలను చాలా మంది తినకపోవటానికి కారణం.. వాటిని విక్రయించే పద్ధతులు సరిగ్గా లేకపోవటమే. జూబ్లీహిల్స్‌లో ఇప్పటికీ చేపలను రోడ్డుపక్కన పెట్టి అపరిశుభ్ర పరిస్థితుల్లో అమ్ముతున్నారు. అసలు మెరుగైన మార్కెటింగ్‌ కల్పించాలన్న చైతన్యం లేదు. నగరాలు, పట్టణాల్లో ఆధునిక వసతులతో ప్రత్యేక దుకాణాలు తెరవాలి. విలువ జోడించి మార్కెటింగ్‌ గొలుసును నిర్మిస్తే.. చేపలు, రొయ్యలను ప్రజలు బాగా తింటారు. సబ్సిడీలివ్వటం కాదు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. 

పోషకాల పరంగా అడ్వాంటేజ్‌ ఉందా?
పోర్క్, బీఫ్, పౌల్ట్రీతో పోల్చితే చేపలు, రొయ్యల్లో పోషకాలు చాలా ఎక్కువ. కంపేరిటివ్‌ స్టడీస్‌ కూడా వచ్చాయి. పర్యావరణ పరంగా చూసినా ఆక్వా ఉత్పత్తులే మెరుగైనవి. ఒకటిన్నర కేజీల మేత వేస్తే కిలో చేపల్ని పెంచే సాంకేతికత అందుబాటులో ఉంది. ఇతర జంతువులకు 12 కిలోల మేత పెడితే గాని ఒక కిలో ఉత్పత్తి రాదు. పశువుల పెంపకం కోసం విస్తారంగా గడ్డి భూములు కావాలి. చేపలు, రొయ్యలు నీటిలో పెరుగుతాయే కానీ అవి నీరు తాగవు. మార్కెటింగ్, కోల్డ్‌ చెయిన్‌ సదుపాయాల కొరత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రచార లోపమే సమస్య. 

యూరోపియన్‌ యూనియన్‌ కఠిన నియమాలను అధిగమించేదెలా?
ట్రేసబిలిటీ వంటి సదుపాయాలు అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కెమికల్‌ రెసిడ్యూ లేని విధంగా సస్టయినబుల్‌ ఫిష్‌ ప్రొడక్షన్‌ పద్ధతులను ఆక్వా రైతులకు, పరిశ్రమదారులకు ప్రభుత్వం నేర్పించాలి. తెలిసో తెలియకో మందులు వాడుతున్న మన చిన్న, సన్నకారు రైతులకు లోతైన అవగాహన కల్పించాలి. టెక్నాలజీ ఇవ్వాలి. ఇలా చేస్తే అధిక ధర వచ్చే విదేశీ మార్కెట్లు ఉన్నాయి. ఆఫ్రికాలో ఇలా చేశారు. మన ప్రభుత్వాలు కూడా చెయ్యాలి. అమెరికాయేతర దేశాలతో కూడా ట్రేడ్‌ అగ్రిమెంట్లకు ప్రయత్నం చెయ్యాలి. 

ప్రపంచ ఆహార భద్రత భవిష్యత్తు ఎలా ఉంటుంది?
రాబోయే 20–30 సంవత్సరాల్లో జంతువులను మాంసం కోసం పెంచటం చాలా ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. జనాభాతో పాటు వారి కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఇది ఆసియా దేశాల్లో ఆక్వా అభివృద్ధికి చాలా మంచి అవకాశం. జలవనరులు ఎక్కువగా ఉన్న మన దేశానికి ఇది గొప్ప అవకాశం. అయితే, మన ఆక్వా రంగం ఉత్పాదకతను పెంచుకోవాలి. 

మన ఉత్పాదకత ఎందువల్ల తక్కువ?
ఉప్పునీటి, మంచినీటి చేపలు, రొయ్యల సాగు రంగంలో మనకున్న వనరుల్లో 30–40% మాత్రమే ఇప్పటికి వాడుకుంటున్నాం. ఇంకా పెంచుకోవటానికి చాలా అవకాశం ఉంది. ఉత్పాదకత పెరగాలంటే దేశీయంగా వినియోగం పెరగాలి. మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలు పెంపొందిస్తే డిమాండ్‌ పెరుగుతుంది. డిమాండ్‌ డ్రైవెన్‌ ఎకానమీగా గుర్తించి ప్రభుత్వాలు ఆక్వా రంగంపై దృష్టి కేంద్రీకరిస్తే రైతులు అందుకుంటారు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు ఫొటో: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్‌ పెరిగే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి?
కోళ్ల పరిశ్రమతో సరిపోల్చి చూడండి.. 15–20 ఏళ్ల క్రితం కోడి మాంసం తినాలంటే కోడిని కొనుక్కొచ్చి ఇంటి దగ్గర  కోసుకునే వాళ్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా కోళ్లను కోసి మాంసం అమ్మే దుకాణాలొచ్చేశాయి. కాబట్టే వినియోగదారులు కోడి మాంసాన్ని ఇంత ఉత్సాహంగా వాడుతున్నారు. చేపలు, రొయ్యల అమ్మకానికి, పౌల్ట్రీ మాదిరిగా, మార్కెటింగ్‌ సదుపాయాలు, విలువ జోడింపు మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించాలి. మార్కెట్‌ సృష్టిస్తే చేపలు, రొయ్యల ఉత్పత్తిని ఇంకా  పెంచుకోవటానికి రైతులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. చేపలు, రొయ్యల పౌష్టికాహార విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ఎగ్‌ క్యాంపెయిన్‌ మాదిరిగా ప్రచారోద్యమం చేపట్టాలి.

దేశీయంగా రొయ్యలు ఎక్కువగా తినకపోవటానికి కారణం?
ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తులను ఏడాదికి తలసరి వినియోగం 22 కిలోలు. బంగ్లాదేశ్‌లో 30–40 కిలోల వరకు ఉంటుంది. మన దేశంలో 6 కిలోలంటారు. కచ్చితమైన గణాంకాలు లేవు. మనవాళ్లు రొయ్యలు ఎక్కువగా తినకపోవటానికి ధర ఎక్కువ కావటం ఒకటి. మరొక అపోహ ఏమిటంటే.. రొయ్యలు తింటే కొలెస్ట్రాల్‌ ఉంటుందని. అది అపోహే. చేపలతో కూడా ప్రాబ్లమ్‌ ఏమీ లేదు. నీట్‌గా ఉండే కోయిస్క్‌లను ఏర్పాటు చేస్తే వినియోగం పెంచవచ్చు. ప్రభుత్వం నగదు ఇన్సెంటివ్‌లు ఇవ్వటం కాదు. కోల్డ్‌చెయిన్, మౌలిక సదుపాయాలు కల్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement