
నార్త్‌లో దాండియా కల్చర్ బాగుంటుంది. చిన్నప్పుడు మేం ముంబైలో ఉండేవాళ్లం. దసరా టైమ్‌లో మా కమ్యూనిటీలో దాండియా ఆడేవాళ్లు. అలా మా అపార్ట్‌మెంట్‌వాళ్లతో కలిసి లైట్‌గా దాండియా చేసిన గుర్తు ఉంది. కానీ పెద్దయ్యాక దాండియా ఆడలేదు. అయితే చేయాలని ఉంది.
పండగ అంటే ఫ్యామిలీ రీ యూనియన్ అని నా ఫీలింగ్. నా చిన్నప్పుడు మా బంధువులందరం కలిసి పండగ జరుపుకునేవాళ్లం. అందరూ కలిసి పండగ వంటలు చేయడం చాలా బాగుండేది. అయితే పై చదువులు, కెరీర్... వీటివల్ల రాను రాను ఆ సందడి తగ్గిపోయింది. ఇప్పుడైతే వర్క్‌లో బిజీ అయ్యాను కదా... షూటింగ్స్, ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి పండగ సమయంలో ఇంటి దగ్గర ఉండటం తగ్గిపోయింది. ఆ పాతరోజులను తలచుకుంటూ ఉంటాను.
‘‘అపజయం ఎదురైనప్పుడు జీవితం ఆగిపోయింది అనుకుంటే మనం ఆగిపోతాం... ఆ అపజయాన్ని విజయానికి మెట్టుగా మార్చుకుంటే ముందుకు సాగిపోతాం’’ అంటున్నారు శ్రీనిధి శెట్టి. అందాల పాటీల్లో ‘మిస్ సుప్ర నేషనల్ ఇండియా’ కిరీటం దక్కించుకోవడం నుంచి, ‘మిస్ స్మైల్’... వరకు పలు టైటిల్స్ శ్రీనిధి సొంతం. తొలి చిత్రం ‘కేజీఎఫ్’తో హీరోయిన్‌గా విజయవంతంగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీనిధి శెట్టి ఇప్పుడు ఫుల్ బిజీ. ‘‘ప్రతి స్త్రీ అమ్మవారిలా ఓ శక్తి స్వరూపిణి’’ అంటూ ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో శ్రీనిధి శెట్టి ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.
⇒ మా మంగళూరులో చాలా టెంపుల్స్ ఉన్నాయి. నవరాత్రి సమయంలో గుడిలో జరిగే పూజలు చాలా వైభవంగా ఉంటాయి. ఈ దసరా టైమ్‌లో వీలైనప్పుడల్లా గుడికి వెళుతుంటాను. మైసూర్‌లో నవరాత్రి పూజలను ఘనంగా చేస్తారు. మైసూర్ ప్యాలెస్‌ని బాగా డెకరేట్ చేస్తారు. జాతర జరుగుతుంది. స్టాల్స్ పెడతారు. ‘మైసూర్ దసరా’ చాలా పాపులర్. ఈ పండగ సమయంలో సిటీ మొత్తం జనాలతో కిటకిటలాడిపోతుంది.
⇒ ‘ఫాస్టింగ్’ అనేది సైంటిఫికల్లీ, ట్రెడిషనల్లీ మంచిది అని నా అభి్రపాయం. అయితే నవరాత్రి టైమ్‌లో ఉపవాసం ఉండను. కానీ నాన్ వెజ్‌కి దూరంగా ఉంటాను. నెలలో
రెండుసార్లు ఏకాదశి వస్తుంది కదా... అప్పుడు ఉపవాసం ఉంటాను. ఏకాదశి వస్తోందంటే చాలు... ‘నువ్వు ఫాస్టింగ్ ఉండాలి’ అని నా బాడీ నాకు గుర్తు చేస్తుంది. నా మైండ్ అలా ట్యూన్ అయిపోయింది.
⇒ చెడుపై మంచి గెలవడం అనేది దసరా థీమ్. ఒక చెడు ఉంటేనే మంచి జరుగుతుంది. అపజయాలను నేను ఇలానే భావిస్తాను. ఫెయిల్యూర్ ఎదురైతేనే కదా సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తాం. సో... ఫెయిల్యూర్స్‌ని చెడుగా భావించను. చెడుని అంతం చేయడానికి అమ్మవారు ఏం చేసిందో మనందరికీ తెలుసు. అలాగే మనకు ఎదురయ్యే ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొందరు మహిళలు సపోర్ట్‌ని ఆశిస్తారు. కానీ మనకు మనమే సపోర్ట్ సిస్టమ్ అవ్వాలి. మన శక్తిని మనం గుర్తించగలగాలి. నాకు ఏదైనా చెడు ఎదురైందనుకోండి అది నా ‘స్టెప్పింగ్ స్టోన్’ అని నమ్ముతాను. జీవితం లో ఎదురయ్యే సవాల్‌ని అలా అనుకుంటే సక్సెస్ అయిపోతాం.
⇒ స్త్రీలు ఇంటిల్లిపాదినీ చూసుకోవాలి. అది చాలా పెద్ద బాధ్యత. అయితే అందరి బాగోగులు చూస్తూ చాలామంది మహిళలు తమ గురించి పట్టించుకోరు. కానీ మన గురించి కూడా మనం పట్టించుకోవాలి. ఇన్నర్‌గా మనం హ్యాపీగా ఉంటే చుట్టూ ఉన్నవాళ్లను మనం ఇంకా హ్యాపీగా ఉంచగలుగుతాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... అందర్నీ హ్యాపీగా ఉంచడమే మన పని అని ఫిక్స్ అయిపోకండి. మనం హ్యాపీగా, హెల్తీగా ఉండటం కూడా ముఖ్యం.
⇒ జీవితంలో ‘పాజిటివిటీ’ చాలా ముఖ్యం. ఒక పని చేసే ముందు ‘ఇది మనవల్ల అవుతుంది. చేసి తీరతాం’ అని పాజిటివ్‌గా ఆలోచించాలి. ఆ పాజిటివిటీ మనల్ని చాలా దూరం తీసుకెళుతుంది. చదువుకునే అమ్మాయిలకు, ఉద్యోగం చేసుకునేవారికి నేను చెప్పేదేంటంటే... ఏ విషయంలోనూ ‘నా వల్ల కాదు’ అనుకోకండి. స్త్రీలు తలచుకుంటే చేయలేనిదేం ఉండదు. పాజిటివ్ గా ఆలోచించండి. అంతా మంచే జరుగుతుంది. చెడు ఆలోచనలను దూరం పెట్టండి. ఆటోమేటిక్‌గా మంచి దగ్గరవుతుంది. ఈ పద్ధతి ఫాలో అయితే జీవితం కష్టంగా ఉండదు... తేలికగా సాగిపోతుంది’’ అని చె΄్పారు. – డి.జి. భవాని