
అడవుల నరికివేత తగ్గుతోంది. గత దశాబ్దంలో ప్రపంచంలోని అన్నిప్రాంతాల్లో అడవుల నరికివేత నెమ్మదించింది. అయినప్పటికీ అడవులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్లలో అడవుల పరిస్తితిపై ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) మంగళవారం విడుదల చేసిన ‘గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్‌మెంట్ 2025’ (జీఎఫ్‌ఆర్‌ఏ 2025) తాజా నివేదికలో అనేక అంశాలను ఎత్తిచూపింది. 236 దేశాలు, ప్రాంతాల అటవీ సంబంధ వివరణాత్మక విశ్లేషణలను ఈ నివేదిక అందిస్తోంది. దీని ఆధారంగానే ప్రపంచ దేశాల అటవీ సంరక్షణ కార్యక్రమాల సమీక్ష, ప్రణాళిక, అమలు ఆధారపడి ఉంటుంది. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి విడుదలయ్యే ఈ నివేదిక 2025 ఎడిషన్‌ను ఇండోనేషియాలోని బాలిలో జరిగిన గ్లోబల్ ఫారెస్ట్ అబ్జర్వేషన్స్ ఇనిషియేటివ్ ప్లీనరీ సందర్భంగా విడుదలైంది. ఈ నివేదికలో మరెన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి..
అడవులు భూమిపై మనుషులు సహా సకల జీవ జాతుల మనుగడ సజావుగా సాగటానికి దోహద పడతాయి. ఆహార భద్రత, స్థానికుల జీవనోపాధి, పునరుత్పాదక జీవ పదార్థాలు, శక్తి సరఫరాకు అడవులు కీలకమైనవి. ప్రపంచంలోని జీవవైవిధ్యంలో ఎక్కువ భాగానికి అడవులు ఆవాసాలుగా ఉన్నాయి. ప్రపంచ కర్బన చక్రాలు, జలసంబంధ చక్రాలను నియంత్రించడంలో సహాయపడతాయి. కరువు, ఎడారీకరణ, నేల కోత, కొండచరియలు విరిగిపడటం, వరదల ముప్పులను తగ్గించడంలో అడవులపాత్ర కీలకం. అందుకనే, ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ అడవుల ఆరోగ్య స్థితిగతులపై నిరంతరం అధ్యయనం చేస్తుంటుంది. తాజా గణాంకాల ప్రకారం అడవులు 414 కోట్ల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇది భూగ్రహంపైన గల భూభాగంలో మూడింట ఒక వంతు. అడవులు అంతరించి΄ోయే వేగం తగ్గుముఖం పట్టిందని జీఎఫ్‌ఆర్‌ఏ 2025 నివేదిక చెబుతోంది. అంతేకాదు, ప్రపంచ అడవులకు సంబంధించి మరికొన్ని సానుకూల వార్తలను సైతం ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. అడవులలో సగానికి పైగా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళికల పరిధిలో సంరక్షించబడుతున్నాయి. ఐడో వంతు అడవులు చట్టబద్ధంగా ప్రభుత్వాలు ప్రకటించిన రక్షిత ప్రాంతాల్లో క్షేమంగా ఉన్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా అటవీ పర్యావరణ వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం సంవత్సరానికి 1.09 కోట్ల హెక్టార్ల అడవుల నరికివేత ఎక్కువగానే కొనసాగుతోందని ఉందని నివేదిక పేర్కొంది.
236 దేశాలు,ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవుల వివరాలను ‘గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్‌మెంట్ 2025’(జీఎఫ్‌ఆర్‌ఏ 2025) విశ్లేషిస్తుంది. 197 దేశాలు,ప్రాంతాలకు చెందిన ప్రభుత్వాలు నియమించిన అధికార∙జాతీయ కరస్పాండెంట్లు గణాంకాలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా 700 పైచిలుకు నిపుణులు ఈ నివేదిక తయారీలో పాల్గొన్నారు.
సమగ్ర నివేదిక : ఎఫ్‌ఆర్‌ఏ 2025కి ముందుమాట రాస్తూ ఎఫ్‌ఏఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డోంగ్యు ఇలా అన్నారు: ‘అటవీ వనరుల అంచనా నివేదికలు అటవీ వనరులు, వాటి పరిస్థితి, నిర్వహణ, ఉపయోగాలకు సంబంధించి అత్యంత సమగ్రమైన, పారదర్శకమైన ప్రపంచ మూల్యాంకనాలు. సుస్థిర అటవీ నిర్వహణలోని అన్ని నేపథ్య అంశాలను విశదీకరిస్తాయి. ఇవి ఉత్పత్తి చేసే డేటా బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అడవుల స్థితిని, వాటిలో వస్తున్న మార్పులను అంతర్జాతీయ సమాజానికి తెలియజేయటం, అడవులకు సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, పెట్టుబడులకు మద్దతు ఇవ్వటంతో పాటు అవి అందించే పర్యావరణ సేవలను మనకు గుర్తు చేయడానికి ఈ నివేదికలు ఉపయోగపడతాయి’ అన్నారు.
మనిషికో అర హెక్టారు అడవి!
అటవీ విస్తీర్ణం: అడవులు 414 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రపంచ భూభాగంలో ఇవి 32 శాతానికి విస్తరించాయి. భూతలంపై ఉన్న ప్రతి ఒక్కొక్కరికి 0.5 హెక్టార్ల (123.6 సెంట్ల) మేరకు అడవులు ఉన్నాయి. ప్రపంచంలోని దాదాపు సగం అడవులు ఉష్ణమండలంలోనే ఉన్నాయి.
నికర నష్టం తగ్గుతోంది: అడవి ప్రతి ఏటా తగ్గిపోతోంది. నికర నష్టం 1990లలో ఏటా 1 కోటి 7 లక్షల హెక్టార్ల మేరకు తగ్గుతుండేది. 2015–2025లో మధ్యకాలంలో ఇది 41 లక్షల హెక్టార్లకు తగ్గింది.
అడవుల నరికివేత: 1990–2000 దశకంలో 1.76 కోట్ల హెక్టార్ల మేరకు సం‘‘రానికి అడవులను నరికివేస్తుండే వాళ్లం. 2015–2025 దశకంలో సంవత్సరానికి 1.09 కోట్ల హెక్టార్లకు మందగించింది. అటవీ విస్తరణ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. 2000–2015 మధ్యలో ఏటా 98.8 లక్షల హెక్టార్ల నుంచి 2015–2025లో 67.8 లక్షల హెక్టారు తగ్గింది.
సహజంగా పునరుత్పత్తి చెందుతున్న అడవులు: సహజంగా పునరుత్పత్తి చెందుతున్న అడవుల విస్తీర్ణం మొత్తం అటవీ ప్రాంతంలో 92 శాతం (383 కోట్ల హెక్టార్లు). 1990–2025 మధ్య అవి 32.4 కోట్ల హెక్టార్లు తగ్గినప్పటికీ, నికర నష్టం రేటు గణనీయంగా తగ్గింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో అత్యంత ముఖ్యమైన తగ్గుదల (గత దశాబ్దంలో) జరిగింది. అయితే, సహజంగా పునరుత్పత్తి అయ్యే అడవుల పెరుగుదల అత్యధికంగా యూరప్‌లో జరుగుతోంది.
పురాతన అడవులు: పురాతన కాలం నుంచి మనుషుల వల్ల నాశనం కాకుండా కొనసాగుతున్న అడవులను ప్రాథమిక అడవులు అంటారు. ఇవి కనీసం 118 కోట్ల హెక్టార్లలో ఉన్నాయి. అటవీ ప్రాంతంలో మూడింట ఒక వంతు వరకు ఉంటాయి. అయితే, ఈ విస్తీర్ణం తగ్గి΄ోతున్నది. కానీ, 2000 దశకం ప్రారంభంతో పోలిస్తే ఈ రేటు ఇప్పుడు సగానికి తగ్గింది.
నాటిన అడవులు: మనుషులు నాటిన చెట్లతో కూడిన అడవులు మొత్తం అటవీ ్ర΄ాంతంలో దాదాపు 8 శాతం. అంచనా ప్రకారం.. 31.2 కోట్ల హెక్టార్లలో ఇవి ఉన్నాయి. 1990 నుంచి అన్ని ప్రాంతాల్లోనూ వాటి విస్తీర్ణం పెరిగింది. కానీ ఇటీవలి దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుదల నెమ్మదించింది.
జీవపదార్థం, కర్బనం: ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో పచ్చదనం 63,000 కోట్ల క్యూబిక్ మీటర్లు ఉందని అంచనా. అడవుల్లో కర్బన నిల్వలు 714 గిగా టన్నులకు పెరిగాయి.
రక్షిత ప్రాంతాలు: చట్టబద్ధంగా ప్రభుత్వాలు ప్రకటించిన రక్షిత ప్రాంతాల్లో దాదాపు 20 శాతం అడవులు (81.3 కోట్ల హెక్టార్లు) విస్తరించి ఉన్నాయి. 1990 తర్వాత ఈ విస్తీర్ణం 25.1 కోట్ల హెక్టార్ల మేర పెరిగింది.
నిర్వహణ ప్రణాళికలు: ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా అడవులు (213 కోట్ల హెక్టార్లు లేదా మొత్తం విస్తీర్ణంలో 55 శాతం) నిర్వహణ ప్రణాళికల కింద ఉన్నాయి. 1990 తర్వాత 36.5 కోట్ల హెక్టార్ల మేరకు ఈ విస్తీర్ణం పెరిగింది. కార్చిచ్చులు: అగ్నిప్రమాదాలు ఏటా సగటున 26.1 కోట్ల హెక్టార్ల భూమిని కాల్చేస్తున్నాయి. కార్చిచ్చులకు దగ్ధమవుతున్న విస్తీర్ణంలో దాదాపు సగం అడవులు. 2020లో కీటకాలు, వ్యాధులు, ప్రతికూల వాతావరణం 4.1 కోట్ల హెక్టార్ల అడవులను దెబ్బతీశాయి.
యాజమాన్యం: ప్రపంచంలోని డెబ్బై ఒక్క శాతం అడవులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. 24 శాతం ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. మిగిలినవి ఇతరుల యాజమాన్యంలో ఉన్నాయి లేదా ఎవరి యాజమాన్యంలో ఉన్నాయో సమాచారం లేదు. నిర్వహణ లక్ష్యాలు దాదాపు 120 కోట్ల హెక్టార్ల (29 శాతం) అడవులను ప్రధానంగా అటవీ ఉత్పత్తుల కోసం నిర్వహిస్తున్నారు. 61.6 కోట్ల హెక్టార్ల అడవులను బహుళ ఉపయోగాల కోసం నిర్వహిస్తున్నారు. 48.2 కోట్ల హెక్టార్ల అడవులను జీవవైవిధ్య పరిరక్షణ కోసం, 38.6 కోట్ల హెక్టార్లను నేల, నీటి రక్షణ కోసం, 22.1 కోట్ల హెక్టార్లను సామాజిక సేవల కోసం నిర్వహిస్తున్నారు. రణ సేవలను మనకు గుర్తు చేయడానికి ఈ నివేదికలు ఉపయోగపడతాయి’ అన్నారు.
తగ్గిన అటవీ నష్టం : 35 సంవత్సరాల కాలంలో మూడు బ్లాక్‌ల(1990–2000, 2000–2015 మరియు 2015–2025)లో అటవీ ప్రాంత పోకడలను విశ్లేషించారు. కెనడా, చైనా, రష్యన్ ఫెడరేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అటవీ విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ కారణంగా 1990–2000 మధ్య ప్రపంచవ్యాప్తంగా అటవీ నష్టం (అంతరిస్తున్న అడవుల విస్తీర్ణం) సంవత్సరానికి 1.07 కోట్ల హెక్టార్ల నుంచి 2000–2015లో సంవత్సరానికి 36.8 లక్షల హెక్టార్లకు తగ్గింది. అటవీకరణ, సహజ అటవీ విస్తరణ (అటవీ లాభం రేటు) తగ్గటం కారణంగా 2015–2025 కాలంలో నికర అటవీ నష్టం వార్షిక రేటు 4.12 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఉదాహరణకు, చైనాలో, 2000–2015 మధ్యలో సంవత్సరానికి 22.2 లక్షల హెక్టార్లుగా ఉన్న నికర అటవీ లాభం 2015–2025లో సంవత్సరానికి 16.9 లక్షల హెక్టార్లకు తగ్గింది. కెనడాలో 2000–2015లో సంవత్సరానికి 5.13 లక్షల హెక్టార్లుగా ఉన్న నికర అటవీ లాభం 2015–2025లో సంవత్సరానికి 82,500 హెక్టార్లకు తగ్గింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, 2000–2015లో సంవత్సరానికి 4.37 లక్షల హెక్టార్ల నికర అటవీ లాభం ఇటీవలి దశాబ్దంలో సంవత్సరానికి 1.2 లక్షల హెక్టార్ల నికర అటవీ నష్టంగా మారింది.
5 దేశాల్లోనే 54% అడవి : ప్రపంచంలోని అటవీ ప్రాంతం సగానికి పైగా (54 శాతం) కేవలం ఐదు దేశాలలో (రష్యన్ ఫెడరేషన్, బ్రెజిల్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా) విస్తరించింది. ప్రపంచంలో అత్యధిక అటవీప్రాంతం ఉన్న పది దేశాలు మొత్తం అటవీ విస్తీర్ణంలో మూడింట రెండు వంతులు (66 శాతం) ఆక్రమించాయి. ఏడు దేశాలు, ప్రాంతాలు (ఫాక్లాండ్ దీవులు (మాల్వినాస్), 8 జిబ్రాల్టర్, హోలీ సీ, మొనాకో, నౌరు, స్వాల్‌బార్డ్, జాన్ మాయెన్ దీవులు, టోకెలావ్) అస్సలు అడవులే లేవు. మరో 49 దేశాలు,ప్రాంతాల్లో మొత్తం భూభాగంలో 10 శాతం కంటే తక్కువగానే అడవుల వాటా ఉంది.
అటవీ భూమిలో హెక్టారుకు 79.6 టన్నుల సేంద్రియ కర్బనం! : అడవులు వాతావరణంలోని కర్బనాన్ని గ్రహించటం ద్వారా పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయి. ‘గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్‌మెంట్ 2025’(జీఎఫ్‌ఆర్‌ఏ 2025)లో 215 దేశాల అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన ఫారెస్ట్ కార్బన్ స్టాక్ సమాచారాన్ని పొందుపరిచారు. అటవీ నేలలోని సేంద్రియ కర్బనం లెక్క వెయ్యటానికి సగటున నేల లోతు 41 సెం.మీ. మట్టిని పరిగణనలోకి తీసుకున్నారు. ఆసియా, ఓషియానియాలో 30 సెం.మీ., యూరప్‌లో 32 సెం.మీ, దక్షిణ అమెరికాలో 34 సెం.మీ, ఆఫ్రికాలో 41 సెం.మీ, ఉత్తర–మధ్య అమెరికాలో 70 సెం.మీ. లోతు మట్టిని విశ్లేషించారు. అడవిలో మట్టిలో, చెట్ల కాండంలో, ఆకుల్లో, వేర్లలో కర్బనం ఉంటుంది. 2025లో మొత్తం అటవీ కర్బన నిల్వలు 714 గిగా టన్నులుగా అంచనా వేశారు. అంటే.. హెక్టారు అడవిలో 172 టన్నుల కర్బనం ఉంది. మట్టిలో సేంద్రియ కార్బన్ 329 గిగా టన్నులు (మొత్తంలో 46 శాతం) లేదా హెక్టారుకు 79.6 టన్నులు. భూమి పైన చెట్లలో 247 గిగా టన్నులు (35 శాతం) లేదా హెక్టారుకు 59.7 టన్నులు. భూగర్భంలో వేర్లు తదితరాలలోని కర్బనం 65.9 గిగా టన్నులు (9 శాతం) లేదా హెక్టారుకు 15.9 టన్నులు. నేలపైన రాని ఆకులు అలముల్లో 41.1 గిగా టన్నులు (6 శాతం) లేదా హెక్టారుకు 9.93 టన్నులు. ఎండిన కట్టెల్లో కర్బనం 30.3 గిగా టన్నులు (4 శాతం) లేదా హెక్టారుకు 7.32 టన్నులు. యూరప్ (ప్రపంచ మొత్తంలో 24 శాతం), ఉత్తర, మధ్య అమెరికా (22 శాతం), దక్షిణ అమెరికా (20 శాతం)లలో అధిక మోతాదులో కర్బన నిల్వలున్న అటవీప్రాంతాలున్నాయి. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఒక యూనిట్ ప్రాంతానికి కర్బన నిల్వలు అత్యధికంగా హెక్టారుకు 260 టన్నులు ఉన్నాయి. ఉత్తర అమెరికాలో హెక్టారుకు దాదాపు 200 టన్నుల కర్బన నిల్వలు ఉన్నాయి.
అటవీ విస్తీర్ణం యూరప్‌లోనే ఎక్కువ!
2025లో ప్రపంచ అటవీప్రాంతం 414 కోట్ల హెక్టార్లలో విస్తరించి ఉందని అంచనా. ఇది మొత్తం భూభాగంలో 32 శాతం. ఈ ప్రాంతం తలసరి 0.50 హెక్టార్ల అడవికి సమానం. అయితే, అడవులు ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా సమానంగా వ్యాపించి లేవు. నలభై ఐదు శాతం అడవులు ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నాయి. బోరియల్ (28 శాతం), సమశీతోష్ణ (17 శాతం), ఉప ఉష్ణమండల (11 శాతం)ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని అటవీ ప్రాంతం యూరప్‌లో 25 శాతం, దక్షిణ అమెరికాలో 20 శాతం, ఉత్తర, మధ్య అమెరికాలో 19 శాతం, ఆఫ్రికాలో 16 శాతం, ఆసియాలో 15 శాతం, ఓషియానియాలో 4 శాతం విస్తరించి ఉన్నాయి.
– నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్