
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో తునిలో టీడీపీ నాయకుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ పట్ల సదరు టీడీపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆయన బాగోతాన్ని గుర్తించిన స్థానికులు బాలికను రక్షించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణ రావు అకృత్యాలు బయటకు వచ్చాయి. తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ పట్ల నారాయణ రావు దారుణంగా ప్రవర్తించాడు. మైనర్‌ను హస్టల్ నుండి తీసుకుని వెళ్ళి హంసవరం సపోటా తోటల్లో ఆమెతో నారాయణ రావు అసభ్యంగా తాకాడు.
ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే స్పందించి మైనర్‌ను రక్షించారు. ఈ క్రమంలో నారాయణ రావు ప్రశ్నించగా.. ఆమెను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని బుకాయించాడు. అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్‌ను అంటూ.. తను ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు. అయితే, హాస్టల్ నుండి మైనర్‌ను నారాయణ రావు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
