
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(prashant Kishor) ఆరోపించారు. మంగళవారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. దానాపూర్, బ్రహాంపూర్, గోపాల్‌గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు.
ఈ సందర్బంగా ప్రశాంత్ కిషోర్.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలి’ అని ఆయన కోరారు. ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన బ్రహాంపూర్‌లో తమ అభ్యర్థి సత్యప్రకాశ్ తివారీ సోమవారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ(BJP Party) ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్లి తీవ్రంగా బెదిరించారన్నారు.
బీజేపీ నేతలు బెదిరింపుల వల్లే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు గోపాల్‌గంజ్‌లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా, దాన్‌పూర్‌లో అభ్యర్థి అఖిలేశ్ షా తనకు చెప్పారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ప్రజల్లో సడలుతున్న విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలన్నారు. అభ్యర్థులనే కాపాడలేని ఈసీ, ఓటర్లకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన ప్రశాంత్ కిశోర్ బీజేపీ నేతలపై ఆరోపణల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.