
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చిన ఆయన.. నితీశ్ కుమార్‌కు ఇవి ఫేర్‌వెల్ ఎలక్షన్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో.. తాము అధికారంలోకి వస్తే గనుక అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఓ ప్రకటన చేశారు.
ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘మోదీ, నితీశ్, లాలూ వీళ్ల కోసం ఓట్లు వేయొద్దు. ఈ ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం. వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త భవిష్యత్తు కోసం ఓటు వేయండి’’ బీహార్ ఓటర్లకు ప్రశాంత్ కిషోర్ పిలుపు ఇచ్చారు.
జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) ఈ ఎన్నికల్లో 48% ఓట్లు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారాయన. ఇది బీహార్‌కు కొత్త అధ్యాయం అని, జన సురాజ్ పార్టీ నేతృత్వంలో తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అవినీతి రాజకీయ నాయకులు, అధికారులపై విచారణ జరిపించి వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అలాగే.. బీహార్‌ను దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని, ఆయన ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉండరని, ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని ప్రశాంత్ కిషోర్ ధీమాగా ప్రకటించారు. బహుశా.. పట్నా మెట్రో ప్రారంభం సీఎంగా నితీశ్ చివరి కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Election 2025) ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయబోతున్నారు. అక్టోబర్ 9వ తేదీన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారాయన.
బీహార్ అసెంబ్లీని రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే మెజారిటీ మార్క్ 122 సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ప్రస్తుతానికి.. అధికార ఎన్డీయే కూటమికి 131 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి 111 సీట్లు, మిగిలినవి ఇతరులు ఉన్నారు.
అధికారంలో కొనసాగాలని ఎన్డీయే కూటమి(జేడీ(యూ)+బీజేపీ), అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్ష మహాఘట్‌బంధన్ కూటమి, అవినీతి.. ప్రజా సమస్యలే ప్రదాన అజెండా తొలిసారి పోటీకి దిగుతున్న జన్ సురాజ్‌తో త్రిముఖ పోటీ హోరాహోరీగానే నడవచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయక్కడ.
ఇదీ చదవండి: బీహార్ ఎన్నికల్లో.. తొలిసారిగా ఈసీఐ నెట్!