
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నవంబర్ 6న మొదటి దశ, 11న రెండో దశ పోలింగ్
నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు
ఎస్‌ఐఆర్‌తో ఓటర్ల జాబితా శుద్ధీకరణ
రాష్ట్రంలో 69 లక్షల పేర్లు తొలగించాం
అన్ని ఎన్నికలకు తల్లిలాంటివి బిహార్ ఎన్నికలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడి
న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల రణరంగానికి తెరలేచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్రం ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
మొత్తం 243 స్థానాలకు గాను.. మొదటి దశలో నవంబర్ 6న 121 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 11న 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. నవంబర్ 16 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో బిహార్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) తక్షణమే అమల్లోకి వచి్చంది.
నామినేషన్ల ప్రక్రియ మొదటి దశ పోలింగ్‌కు అక్టోబర్ 17న, రెండో దశ పోలింగ్‌కు అక్టోబర్ 20న ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 7.43 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎస్‌ఐఆర్‌ను ఓటర్ల జాబితా శుద్ధీకరణగా జ్ఞానేశ్ కుమార్ అభివరి్ణంచారు. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 69 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. అయితే, భారత పౌరసత్వం లేనికారణంగా ఎన్ని పేర్లు తొలగించారో ఆయన బయటపెట్టలేదు. మరణాలు, పౌరసత్వం లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లడం వంటి కారణాలతో పేర్లు తొలగించినట్లు స్పష్టంచేశారు.
8 అసెంబ్లీ స్థానాలకు వచ్చేనెల 11న ఉప ఎన్నికలు
తెలంగాణ, రాజస్తాన్, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, మిజోరం తదితర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు తెలిపింది.
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
బిహార్ ఎన్నికలు అన్ని ఎన్నికలకు తల్లిలాంటివని జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో 17 సంస్కరణలు చేపడుతున్నామని, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. దేశ ఎన్నికల చరిత్రలో బిహార్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో ఒకటిగా రికార్డుకెక్కబోతున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా శుద్ధీకరణ విషయంలో మొత్తం దేశానికి బిహార్ ఒక మార్గం చూపిందని అన్నారు. రాజకీయ పారీ్టల విజ్ఞప్తి మేరకు.. బిహార్‌లో ఈవీఎంల చివరి రెండు రౌండ్ల కౌంటింగ్ కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేస్తామని వివరించారు.
మహిళలు ఓటు వేసే సమయంలో బుర్ఖా లేదా తలపై ముసుగు ధరించవచ్చా? అని ప్రశ్నించగా, ఓటర్ల గుర్తింపును నిర్ధారించే విషయంలో మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేస్తామని జ్ఞానేశ్ కుమార్ బదులిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు విధుల్లో ఉంటారని, మహిళా ఓటర్ల గుర్తింపును వారు తనిఖీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో 250 పోలింగ్ బూత్‌ల పరిధిలో పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలియజేశారు. 197 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పడవలపై అక్కడికి చేరుకుంటారని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడం దగ్గర్నుంచి, ఓట్ల లెక్కింపు దాకా.. మొత్తం 17 సంస్కరణలు చేపట్టబోతున్నామని మరోసారి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ వీటిని అమలు చేస్తామన్నారు.
తొలిసారిగా ‘ఈసీఐ నెట్’
ఎన్నికల్లో పారదర్శకతను మరింత పెంచడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా బిహార్ ఎన్నికల్లో ‘ఈసీఐ నెట్’ను ప్రవేశపెడుతోంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన 40కిపైగా యాప్‌లను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఈసీఐ నెట్‌ను రూపొందించారు. ఇదొక డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇది ‘మదర్ ఆఫ్ ఆల్ యాప్స్’ అని చెబుతున్నారు. బూత్ లెవెల్ అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ అధికారులు సహా ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది దీన్ని వినియోగించుకుంటారు.
ఓటర్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, రిపోర్టింగ్ తదితర పనులు దీనిద్వారా నిర్వహిస్తారు. ఫలితంగా వారిమధ్య సమన్వయం పెరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. మొత్తానికి ఎన్నికల నిర్వహణ సులభంగా మారుతుంది. ఓటర్లు కూడా ఈ వేదికను వాడుకోవచ్చు. పోలింగ్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. కౌంటింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. తొలుత బిహార్‌లో.. అనంతరం దేశమంతటా ఈసీఐ నెట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.