
మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(prashant kishor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారాయన. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో..
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారాయన. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్ లేదంటే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు.
రాఘోపూర్ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్.. హ్యాట్రిక్‌పై కన్నేశారు. అయితే.. జన్ సురాజ్ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్ సురాజ్ రెండో జాబితాలో రాఘోపూర్ నుంచి చంచల్ సింగ్ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.
అయితే పోటీ చేయకున్నా పార్టీని బలోపేతం చేయడానికి.. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తాను కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారాయన. జేడీయూకి ఎలాంటి ఓటమి దక్కబోతోందో చెప్పడానికి సెఫాలజిస్ట్( ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరమేమీ లేదని అన్నారాయన. అలాగే జన్ సురాజ్‌పార్టీ లక్ష్యం భారీదని, 150 స్థానాలకు ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఓడిపోయినట్లేనని పీకే ధీమా వ్యక్తం చేస్తున్నారు.