
పాట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఫుల్ మెజార్టీ సాధిస్తుంది.. లేదంటే చివరి స్థానంలో నిలుస్తుంది అంటూ జోస్యం చెప్పారు. బీహార్‌లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీకే.. తన పార్టీ బీహార్‌లోని 243 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో తమ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. లేదంటే చివరి స్థానంలో నిలుస్తుందన్నారు. ఎటూ కాకుండా మధ్యలో ఉండటం జరగదన్నారు. అలాగే, అధికార ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ)కు 25 సీట్లకు మించి రావని తేల్చిచెప్పారు. బీజేపీకి కూడా ఓటమి తప్పదన్నారు. విపక్ష మహాఘట్‌బంధన్ మూడో స్థానంలో నిలుస్తుందని, తన పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ఇదిలా ఉండగా.. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. జేడీ(యూ)నేత, బీహార్ మంత్రి అశోక్ చౌదరికి పరువు నష్టం నోటీసు పంపుతానని తెలిపారు. రూ.200 కోట్ల అవినీతికి ఆయన పాల్పడినట్లు ఆరోపించారు. కోట్ల విలువైన ఆ భూమిని తన పీఏ పేరుతో ఆయన ఎందుకు కొన్నారు? అని ప్రశ్నించారు. త్వరలోనే నలుగురు లేదా ఐదుగురు ప్రముఖ నేతల గుట్టు బయటపెడతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఏం జరుగుతుందా? అనే సస్పెన్స్ బీహార్ రాజకీయాల్లో నెలకొంది.