
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల నేర చరిత్రను బహిర్గతం చేసింది. 66 శాతం మంది శాసనసభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 241 మంది ఎమ్మెల్యేల్లో 158 మంది (66 శాతం) తమపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఏడీఆర్ తన నివేదికలో (ADR Report) పొందుపరిచింది.
అరాయ్ బీజేపీ ఎమ్మెల్యే రామ్‌సురత్ కుమార్, సూర్యగర్హా జేడీయూ ఎమ్మెల్యే పహ్లాద్ యాదవ్ అఫిడవిట్లు అందుబాటు లేనందున వారిద్దరి వివరాలు పరిగణనలోకి తీసుకోలేదని ఏడీఆర్ తెలిపింది. 2020 ఎన్నికల అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకున్నందున కొంతమంది ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్యలో ఇప్పుడు కొన్ని మార్పులు ఉండవచ్చని తెలిపింది.
ముఖ్యంశాలు
119 మంది (49 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
8 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.
16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై హత్య కేసులు (ఐపీసీ సెక్షన్ 302) ఉన్నాయి.
30 మందిపై హత్యాయత్నం కేసులు (ఐపీసీ సెక్షన్ 307) ఉన్నాయి.
53 మంది (64 శాతం) బీజేపీ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
53 మంది (74 శాతం) ఆర్జేడీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
21 మంది (45 శాతం) జేడీయూ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
14 మంది (82 శాతం) కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
9 మంది (82 శాతం) సీపీఐ (ఎంఎల్) (ఎల్) ఎమ్మెల్యేలపైనా కేసులున్నాయి.
విద్యార్హత- వయసు
సిట్టింగ్ ఎమ్మెల్యేల విద్యార్హతలను పరిశీలిస్తే.. 82 మంది (34 శాతం) ఎమ్మెల్యేలు 5 నుంచి 12వ తరగతి చదివిన వారు. గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ చదివిన వారు 149 (62 శాతం) మంది ఉన్నారు. వయసులవారీగా చూస్తే.. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 122 మంది (51 శాతం) ఉన్నారు. 241 మంది ఎమ్మెల్యేల్లో 29 మంది (12 శాతం) మాత్రమే మహిళలు.
బిహార్ అసెంబ్లీకి తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే!